కేసీఆర్ పర్యటనలో ఎవరీ సర్దార్జీ..?

ఒక్క సర్దార్ రవీందర్ సింగ్ మాత్రం కేసీఆర్ వెంట ఉన్నారు. ఎవరీ సర్దార్ సింగ్..? టీఆర్ఎస్ అధినేత అంత నమ్మకంగా తన వెంటబెట్టుకుని వెళ్లడానికి కారణం ఏంటి..?

Advertisement
Update: 2022-09-01 03:21 GMT

తెలంగాణ సీఎం కేసీఆర్ బీహార్ పర్యటన విజయవంతంగా ముగిసింది. ఈ పర్యటన కోసం తెలంగాణ నుంచి కీలక నేతలెవరూ కేసీఆర్ వెంట వెళ్లలేదు. ఆ మాటకొస్తే ఢిల్లీలో టీఆర్ఎస్ ఫేస్ గా నిలబడే నాయకులు కూడా బీహార్ వెళ్లలేదు. ఒక్క సర్దార్ రవీందర్ సింగ్ మాత్రం కేసీఆర్ వెంట ఉన్నారు. ఎవరీ సర్దార్ సింగ్..? టీఆర్ఎస్ అధినేత అంత నమ్మకంగా తన వెంటబెట్టుకుని వెళ్లడానికి కారణం ఏంటి..?

కరీంనగర్ జిల్లా మాజీ మేయర్ టీఆర్ఎస్ సీనియర్ నేత సర్దార్ రవీందర్ సింగ్ రాజకీయ ప్రస్థానం అనూహ్య మలుపులు తిరిగి ఇప్పుడు కేసీఆర్ కి జాతీయ రాజకీయాల్లో కీలకంగా మారబోతోందని అంటున్నారు. ఒక సమయంలో పార్టీ నుండి బలవంతంగా బయటకు వెళ్లే పరిస్థితి ఆయనకు వచ్చింది. ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో పార్టీకి రాజీనామా చేసిన రవీందర్ సింగ్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి దిగారు కూడా. ఆయన బీజేపీలో చేరతారని కూడా అనుకున్నారు. కానీ ఇప్పుడాయనకు అనుకోని ప్రాధాన్యత లభించింది. కేసీఆర్ బీహార్ పర్యటనలో ఆయన వెంటే ఉన్నారు సర్దార్ రవీందర్ సింగ్.

సిక్కు వర్గం ప్రతినిధిగా..

జాతీయ రాజకీయాల్లో కీలకం కావాలనుకుంటున్న కేసీఆర్ కి.. సిక్కుల ప్రాధాన్యం ఉన్న కొన్ని రాష్ట్రాల్లో పార్టీ ఫేస్ గా సర్దార్ సింగ్ పనిచేయబోతున్నారు. జాతీయ నాయకులతో మాట్లాడటం, సమాచార మార్పిడికి కూడా సర్దార్ సింగ్ ని కేసీఆర్ ఉపయోగించుకోబోతున్నారు. ఉత్తర భారత పర్యటనల కోసం వెళ్తున్న కేసీఆర్ తన వెంట సర్దార్ సింగ్ ని తీసుకెళ్తున్నారు. దీంతో ఆయనకు మళ్లీ పార్టీలో మంచిరోజులు వచ్చాయని అంటున్నారు. కరీంనగర్ కి చెందిన న్యాయవాది సర్దార్ సింగ్ స్వతంత్రంగా తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. ఆ తర్వాత బీజేపీలో చేరారు. తెలంగాణ ఉద్యమ సమయంలో టీఆర్ఎస్ లో చేరి కీలకంగా వ్యవహరించారు. కరీంనగర్ పట్టణానికి మేయర్ గా పనిచేశారు. ఆ తర్వాత కొంతకాలంగా పార్టీకి దూరంగా ఉంటున్నా.. ఇప్పుడు కేసీఆర్ జాతీయ రాజకీయాలు ఆయనకు అనుకోని అవకాశంగా మారాయి. బీహార్ పర్యటనలో కేసీఆర్ వెంట ఆయన కీలకంగా కనిపించారు.

Tags:    
Advertisement

Similar News