సొంత పార్టీలోనే ఈటలకు దిక్కులేదు : బాల్క సుమన్

పేదల భూములను కబ్జా చేసిన చరిత్ర ఈటలదని.. ఆ భూములన్నింటినీ పేదలకు తిరిగి పంచుతామని బాల్క సుమన్ స్పష్టం చేశారు.

Advertisement
Update: 2022-07-26 12:52 GMT

ఈటల రాజేందర్‌కు సొంత పార్టీ బీజేపీలోనే దిక్కులేదని.. కానీ ఆయన టీఆర్ఎస్ నుంచి భారీగా ఎమ్మెల్యేలు వలస వస్తారంటూ ప్రగల్భాలు పలుకుతున్నారని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ధ్వజమెత్తారు. ఈ నెల 27 తర్వాత టీఆర్ఎస్ నుంచి భారీగా వలసలు ఉంటాయని బీజేపీ జాయినింగ్స్ కమిటీ కో-ఆర్డినేటర్ ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ పార్టీ ఘాటుగా స్పందించింది. ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, కేపీ వివేకానందతో కలసి విప్ బాల్క సుమన్ మంగళవారం టీఆర్ఎస్ఎల్పీలో మీడియాతో మాట్లాడారు.

ఈటల రాజేందర్ ఒక విశ్వాస ఘాతకుడని, కనీసం వార్డు మెంబర్‌గా కూడా లేని అతడిని మంత్రిని చేసిన ఘనత టీఆర్ఎస్‌దే అని అన్నారు. తిన్నింటి వాసాలు లెక్కబెట్టి.. బీజేపీ పంచన చేరిన ఈటల ఇప్పుడు బానిసలా బతుకుతున్నాడని మండిపడ్డారు. ఆరోగ్య, ఆర్థిక మంత్రిగా పని చేసిన సమయంలో ఈటల భారీ అవినీతికి పాల్పడ్డారని సుమన్ ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో ఈటలకు హుజూరాబాద్‌లో ఓటమి ఖాయం. అందుకే గజ్వేల్‌లో కేసీఆర్‌పై పోటీ చేస్తానంటూ ప్రగల్భాలు పలుకుతున్నారని ఎద్దేవా చేశారు. పబ్లిసిటీ కోసం ఈటల చాలా తంటాలు పడుతున్నారని.. ఆయన కేసీఆర్‌పై పోటీ చేసే సిపాయి కాదు.. చెల్లని రూపాయి అని విమర్శించారు. రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సహాయం చేస్తేనే హుజూరాబాద్‌లో ఈటల గెలిచాడని సుమన్ అన్నారు.

పేదల భూములను కబ్జా చేసిన చరిత్ర ఈటలదని.. ఆ భూములన్నింటినీ పేదలకు తిరిగి పంచుతామని బాల్క సుమన్ స్పష్టం చేశారు. దేశంలోని క్రిమినల్స్ అందరికీ బీజేపీ అడ్డాగా మారింది. తప్పులు చేయాలె.. కాషాయ కండువా కప్పుకోవాలె.. గంగలో మునిగినట్లు పునీతులై పోవాలె అనే సిద్ధాంతం దేశంలో నడుస్తోందని సుమన్ విమర్శించారు. 20 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నట్లు ఈటల చెప్తున్నారు. కానీ ఒక్క వార్డు మెంబర్ కూడా ఆయనతో మాట్లాడలేదని సుమన్ ఎద్దేవా చేశారు. బీజేపీ నుంచి టీఆర్ఎస్‌లోకే చేరికలు ఉంటాయని సుమన్ స్పష్టం చేశారు.

గవర్నర్ తమిళిసై ఇటీవల ఢిల్లీలో చేసిన వ్యాఖ్యలపై కూడా బాల్క సుమన్ మండిపడ్డారు. తమిళిసై బీజేపీ కండువా కప్పుకొని రాజకీయాలు మాట్లాడితే మంచిదని సుమన్ సూచించారు. కేసీఆర్ జాతీయ రాజకీయాల గురించి మాట్లాడటానికి గవర్నర్ ఎవరు అని ఆయన నిలదీశారు. గతంలో గవర్నర్లు చాలా హుందాగా ప్రవర్తించేవారు. కానీ ఇప్పుడు రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. క్లౌడ్ బరస్ట్ గురించి మాట్లాడటానికి గవర్నర్ ఏమైనా సైంటిస్టా అని ప్రశ్నించారు. గవర్నర్ రాజకీయం చేస్తున్న తీరును మీడియా కూడా ఖండించాలని సూచించారు.

Advertisement

Similar News