ఈ వయసులో ఇదేం పని.. తండ్రిపై కేకే తనయుడి షాకింగ్ కామెంట్స్

ఇన్నేళ్లు తాము సంతోషంగా ఉన్నామని, ఇప్పుడు తమ తండ్రిని కాంగ్రెస్ లోకి పిలవడం ద్వారా రేవంత్ రెడ్డి తమ కుటుంబాన్ని విభజించారని చెప్పారు కేకే తనయుడు విప్లవ్ కుమార్.

Advertisement
Update: 2024-03-29 14:31 GMT

బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరుతున్నారు కె.కేశవరావు. ఆమె కుమార్తె హైదరాబాద్ నగర మేయర్ విజయలక్ష్మి కూడా కాంగ్రెస్ కండువా కప్పుకోడానికి సిద్ధమయ్యారు. అయితే కేకే తనయుడు విప్లవ్ కుమార్ మాత్రం ఇంకా బీఆర్ఎస్ లోనే ఉన్నారు. పైగా ఆయన బీఆర్ఎస్ లోనే ఉంటానని స్పష్టం చేయడం విశేషం. తండ్రిపైనే ఆయన ఘాటు వ్యాఖ్యలు చేయడం మరో విశేషం. అసలీవయసులో ఆయనకు ఇదేం పని అని అంటున్నారు కేకే తనయుడు విప్లవ్ కుమార్.

కేకే కూడా తన కొడుకు తనతోపాటు కాంగ్రెస్ లోకి రావడం లేదని గతంలోనే స్పష్టం చేశారు. తన వరకు తాను కాంగ్రెస్ లోకి వెళ్తున్నానని, తన కుమార్తె విడిగా పార్టీలో చేరతారని చెప్పారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ నేతగా ఉన్న కేకే కుమారుడు విప్లవ్ కుమార్ వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. తన తండ్రి బీఆర్‌ఎస్‌ పార్టీని వీడటం బాధగా ఉందని విప్లవ్ అన్నారు. అసలీవయసులో పార్టీ మారడం ఏంటని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్‌ కష్టకాలంలో ఉన్నప్పుడు ఒక సీనియర్‌ నాయకుడిగా అధినేత కేసీఆర్‌కు అండగా ఉండాల్సిందిపోయి.. పార్టీని వీడటం సరికాదని సూచించారు.

సీఎం రేవంత్ రెడ్డి తమ కుటుంబాన్ని విభజించాలనుకుంటున్నారని కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు విప్లవ్ కుమార్. ఇన్నేళ్లు తాము సంతోషంగా ఉన్నామని, ఇప్పుడు తన తండ్రిని కాంగ్రెస్ లోకి పిలవడం ద్వారా రేవంత్ రెడ్డి తమ కుటుంబాన్ని విభజించారని చెప్పారు. కేశవరావు పదవుల కోసం కాంగ్రెస్‌లోకి వెళ్తున్నారని తాను అనుకోవడం లేదని చెప్పారు విప్లవ్‌. ఈ వయసులో తన తండ్రికి ఎలాంటి పోస్టులు అవసరం లేదని.. తన జీవితంలో ఎన్నో పదవులను ఆయన అందుకున్నారని అన్నారు. ప్రస్తుతం బీఆర్‌ఎస్‌ పార్టీకి ఆయన అవసరం ఉందని చెప్పారు విప్లవ్‌కుమార్‌. తన తండ్రి పార్టీ మారడం తనకు ఇష్టం లేదని, ఆయన వెనక్కు రావాలని కోరారు. పార్టీ మారే ఆలోచనపై పునరాలోచన చేయాలని తండ్రికి సూచించారు విప్లవ్ కుమార్. సోదరి విజయలక్ష్మిపై కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ తోనే ఆమె రాజకీయ జీవితం మొదలైందని, పార్టీ ఆమెకు హైదరాబాద్ మేయర్ పీఠం ఇచ్చి గౌరవించిందని, ఆత్మగౌరవం ఉంటే పార్టీ ఇచ్చిన పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్‌లోకి వెళ్లాలని సోదరి విజయలక్ష్మిని డిమాండ్‌ చేశారు విప్లవ్ కుమార్.

Tags:    
Advertisement

Similar News