పాతబస్తీలో ఉద్రిక్త పరిస్థితులు...పోలీసుల ఫ్లాగ్ మార్చ్

మహ్మద్ ప్రవక్తపై బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో హైదరాబాద్ పాత బస్తీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దాంతో ఇవ్వాళ్ళ పోలీసు బలగాలు ఫ్లాగ్ మార్చ్ ను నిర్వహించాయి.

Advertisement
Update: 2022-08-24 13:49 GMT

బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో సోమవారం రాత్రి నుంచి హైదరాబాద్ పాత నగరంలో ఉద్రిక్తత కొనసాగుతోంది. అనేక చోట్ల యువత నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. సున్నిత ప్రాంతాల్లో పోలీసు బలగాలను పెద్ద ఎత్తున మోహరించినప్పటికీ ఉద్రిక్తతలు ఆగడం లేదు. షహలీబండ, చార్మినార్, మూసా బౌలి, గోషామహల్, మంగళ్‌హాట్, సైదాబాద్ తదితర‌ సున్నిత ప్రాంతాలలో సోమవారం రాత్రి నుంచే పోలీసులను మోహరించారు.

నిన్న కోర్టులో రాజా సింగ్ కు బెయిల్ లభించడంతో పాత బస్తీలో యువత మరింత రగిలిపోతున్నారు. దాంతో మంగళవారం రాత్రి అనేక చోట్ల వందల మంది నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. గత అర్ధరాత్రి నుంచి శాలిబండ చౌరస్తాలో ఆందోళన చేస్తున్న దాదాపు 30 మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని కంచన్‌బాగ్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

అనేక చోట్ల షాపులు, కార్యాలయాలు మూసేశారు. పెట్రోల్ బంక్ లు కూడా నిన్నటి నుంచి మూసేశారు. పోలీసులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అనేక ప్రాంతాల్లో యువత రాజాసింగ్ కు వ్యతిరేకంగా ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. దాంతో ఈ రోజుకీ ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. దాంతో పోలీసులు ఈ రోజు పాత బస్తీలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. సాయంత్రం 7 గంటల‌కల్లా అన్ని షాపులు, కార్యాలయాలు మూసేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఎలాంటి ప్రదర్శనలకు అనుమతి లేదని ప్రకటించారు.

Tags:    
Advertisement

Similar News