గౌరవనీయులైన గవర్నర్ గారూ.. ఇదేం పద్ధతి!

బాసర RJUKT విషయంలో తెలంగాణ గవర్నర్ శ్రీమతి తమిళి సై సౌందర్ రాజన్ వ్యవహారశైలి విద్యాబుద్ధులు, ఉన్నత విలువలు నేర్పే యునివర్సిటీలను ఫక్తు రాజకీయాలకు, రాజకీయ లబ్ది కోసం వాడుకునే దుస్సాంప్రదాయనికి తెర తీసింది అని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Advertisement
Update: 2022-08-05 13:44 GMT

రాష్ట్రంలో ఉండే యూనివర్సిటీలన్నింటికీ ఆ రాష్ట్ర గవర్నర్ ఛాన్స్‌ల‌ర్‌గా ఉంటారు. ఆయా యూనివర్సిటీల వ్యవహారాల్లో గవర్నర్ పాలు పంచుకోవడం మామూలు విషయమే!

అయితే, బాసర RJUKT విషయంలో తెలంగాణ గవర్నర్ శ్రీమతి తమిళి సై సౌందర్ రాజన్ వ్యవహారశైలి విద్యాబుద్ధులు, ఉన్నత విలువలు నేర్పే యునివర్సిటీలను ఫక్తు రాజకీయాలకు, రాజకీయ లబ్ది కోసం వాడుకునే దుస్సాంప్రదాయనికి తెర తీసింది అని పలువురు అభిప్రాయపడుతున్నారు.

గత నెలలో విద్యార్థులు తమ సమస్యల పరిష్కారానికి ఆందోళన బాటపట్టారు. సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం తక్షణం స్పందించింది. విద్యా శాఖ మంత్రి, అధికారులు అవసరమైన చర్యలు చేపట్టారు. మొదట సమర్థుడయిన ఒక ఇంఛార్జి VC ని నియమించారు. సమస్యలు ఒకదాని తరువాత ఒకటి పరిష్కారం అవుతున్న సమయంలో గవర్నర్ తమిళి సై తన రాజకీయ అవసరాల కోసం యూనివర్సిటీ విద్యార్థులను పావులుగా వాడుకోవడం సర్వత్రా చర్చకు దారితీస్తోంది.

విశ్వసనీయ సమాచారం మేరకు బాసర RJUKT కి చెందిన 20 మంది విద్యార్థులను గవర్నర్ హైదరాబాద్ కి పిలిపించుకున్నట్టు తెలిసింది. అదీ, యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కు గానీ, ఇతర అధికారులకు, సిబ్బందికి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా విద్యార్థులు గవర్నర్ ని కలవడానికి హైదరాబాద్ కి వచ్చారు. పాస్పోర్ట్ కి అప్లై చేసుకోవాలి అని ఒకరు, అమ్మకి అనారోగ్యంగా ఉందని ఒకరు, ఇంటర్వ్యూ అని ఇంకొకరు.. ఇలా తలా ఒక తప్పుడు కారణంతో లీవ్ లెటర్లు రాసి బాసర నుండి హైదరాబాద్ వచ్చారు.

నిజానికి బాసర యూనివర్సిటీ రెసిడెన్షియల్ పద్ధతిలో నడుస్తుంది. విద్యార్థుల పూర్తి బాధ్యత వైస్ ఛాన్స్‌ల‌ర్‌, అధికారులదే. అలాంటిది, క్యాంపస్ లో ఉండాల్సిన విద్యార్థులు తప్పుడు కారణాలు చెప్పి యూనివర్సిటీ బయటికి వెళ్ళడం ఎంత ప్రమాదకరం. ఏదన్నా జరిగితే ఎవరు బాధ్యులు? విద్యార్థులు ఇలాంటి పనులు చేయడానికి ప్రేరేపిస్తున్న గవర్నర్ ఎలాంటి విలువలు పాటిస్తున్నారు? అని విద్యావేత్తలు, విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు.

తెలంగాణ గవర్నర్ ఇప్పటికే పలుమార్లు రాజకీయాలకు సంబంధించిన ప్రకటనలు చేసినప్పటికీ, భావితరాల ప్రతినిధులను ఇలా తన రాజకీయ లబ్ది కోసం వాడుకోవడం ఏంటని యూనివర్సిటీలో గత కొంత కాలంగా జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్న వాళ్ళు వ్యాఖ్యానిస్తున్నారు.

టీఆర్ఎస్ ప్రభుత్వానికి సమస్యలు సృష్టించడమే అజెండాగా పెట్టుకున్న గవర్నర్ తన పార్టీ ప్రయోజనాల కోసం విద్యార్థులను సమిధలుగా వాడుకోవడం సమంజసం కాదు అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Tags:    
Advertisement

Similar News