తెలంగాణ కాంగ్రెస్ లో రచ్చ : ఒక జిల్లా అధ్యక్షుణ్ణి పార్టీ నుంచి తొలగించిన మరో జిల్లా అధ్యక్షుడు

హన్మకొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి, జనగాం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డిని పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుండి ఈ రోజు సస్పెండ్ చేశారు.

Advertisement
Update: 2023-03-27 09:47 GMT

కాంగ్రెస్ పార్టీలో రోజుకో రచ్చ జరుగుతూనే ఉంటుంది. పార్టీ బలహీనపడినా అందులోని వర్గాలు మాత్రం బలంగా కొట్టుకు‍ంటూ ఉంటాయి. వరంగల్ ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ లో ఉన్న గ్రూపు తగాదాలు ఈ రోజు విచిత్ర‌మైన మలుపు తిరిగాయి.

హన్మకొండ జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి, జనగాం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డిని పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుండి ఈ రోజు సస్పెండ్ చేశారు.

చాలాకాలంగా హన్మకొండ జిల్లాలో ఉన్న వరంగల్ పశ్చిమ నియోజ‌కవర్గం సీటు కోసం నాయిని రాజేందర్ రెడ్డి, జంగా రాఘవరెడ్డి ల మధ్య కొంత కాలంగా ఘర్షణ జరుగుతోంది. జనగాంజిల్లా అధ్యక్షుడిగా ఉన్న జంగా రాఘవరెడ్డి వరంగల్ పశ్చిమ నియోజ‌కవర్గం సీటును ఆశించడమేంటని రాజేంధర్ రెడ్డి వాదనగా ఉంది.

ఆ సీటు విషయంలో అధిష్టానం ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోయినప్పటికీ, నాయిని రాజేందర్ రెడ్డి, జంగా రాఘవరెడ్డిలు ఇద్దరు కూడా అధిష్టానం తమకే ఆ సీటు ఇస్తుందని ప్రచారం చేసుకుంటున్నారు. ఇద్దరూ ఒకరికి పోటీగా ఒకరు ఆ నియోజకవర్గంలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

జంగా రాఘవరెడ్డి జనగాంను వదిలేసి హన్మకొండకు రావడాన్ని వ్యతిరేకిస్తున్న రాజేంధర్ రెడ్డి ఆయనపై అధిష్టానానికి అనేక సార్లు పిర్యాదు చేశారు. ఆ విషయంలో అధిష్టానం రాఘవరెడ్డికి షోకాజ్ నోటీసులు కూడా ఇచ్చిందని రాజేందర్ రెడ్డి వాదన.

అయితే రాజేందర్ రెడ్డి బీఆరేస్ ఎమ్మెల్యే వినయ భాస్కర్ కు తొత్తుగా వ్యవహరిస్తున్నాడని బహిరంగంగానే రాఘవరెడ్డి ఆరోపిస్తుండగా, జంగా రాఘవరెడ్డి మంత్రి దయాకర్ రావుకు తొత్తుగా వ్యవ‌హరిస్తునాడని రాజేంధర్ రెడ్డి ఆరోపిస్తున్నాడు.

ఒకరిపై ఒకరి ఆరోపణలు, ఘర్షణల నేపథ్యంలో ఈ రోజు ఏకంగా రాఘవరెడ్డిని పార్టీనుంచి బహిష్కరిస్తూ రాజేందర్ రెడ్డి ప్రకటన చేయడం సంచలనం సృష్టిస్తోంది.

వీరిద్దరి వ్యవహారాన్ని అధిష్టానం ఎప్పటిలాగే చూసీ చూడనట్టు వదిలేస్తుందా లేక ఏవైనా చర్యలు చేపడుతుందా అనేది వేచి చూడాలి.

Tags:    
Advertisement

Similar News