మళ్లీ భారీ వర్షాలు.. అప్రమత్తంగా ఉండండి : సీఎం కేసీఆర్

గోదావరి పరివాహక జిల్లాల మంత్రులు, ప్రజా ప్రతినిధులు అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సీఎం సూచించారు

Advertisement
Update: 2022-07-23 11:46 GMT

తెలంగాణలో మూడు నాలుగు రోజుల పాటు మ‌ళ్లీ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇప్పటికే గోదావరి వరదల కారణంగా ఐదు జిల్లాలు తీవ్రంగా నష్టపోయాయి. ఈసారి అలా జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. శనివారం ప్రగతిభవన్‌లో వరద సహాయక చర్యలపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు సీఎం కేసీఆర్‌. రాష్ట్ర మంత్రులు, అధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు.

రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలు, వరదల పరిస్థితిపై సీఎం కేసీఆర్ ఆరా తీశారు. జిల్లాల వారీగా ఎంత వర్షపాతం నమోదైందో సీఎం తెలుసుకున్నారు. ఇప్పటికే గోదావరి క్యాచ్‌మెంట్ ఏరియాల్లో భారీగా వర్షాలు పడుతున్నాయి. మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాల కారణంగా ఏ స్థాయిలో వరద వచ్చే అవకాశం ఉందనే విషయాన్ని కేసీఆర్ విశ్లేషించారు. అంతే కాకుండా ఇతర అంశాలపై కూడా అధికారులతో సమీక్షించారు.

గోదావరి నదికి మరోసారి వరదలు వచ్చే అవకాశం ఉన్నది. ఎగువ నుంచి ఇప్పటికే భారీగా వరద వస్తోంది. దీంతో గోదావరి పరివాహక జిల్లాల మంత్రులు, ప్రజా ప్రతినిధులు అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సీఎం సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా అధికార యంత్రాంగమంతా అలర్ట్‌గా ఉండాలని ఆదేశించారు. ఇప్పటికే కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులను అందుబాటులో ఉండాలని ఆదేశించినట్లు సీఎం కేసీఆర్‌కు ప్రధాన కార్యదర్శి సోమేష్ తెలిపారు.

వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఇప్పటికే నాలుగు జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. మహబూబాబాద్, జనగామ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాలకు రెడ్ అలర్ట్.. ఖమ్మం, వరంగల్, నల్గొండ, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. హైదరాబాద్ సహా పరిసర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, ఇప్పటికే సాధారణం కంటే అత్యధిక వర్షపాతం కురిసినట్లు వాతావరణ శాఖ తెలిపింది. నగరవాసులు బయటకు వెళ్లొద్ద‌ని, అత్యవసరం అయితే తప్ప ఇంటి నుంచి రావొద్దని జీహెచ్ఎంసీ హెచ్చరించింది.

Tags:    
Advertisement

Similar News