ఎగ్జిట్ పోల్స్ - బీజేపీ మూడు స్పందనలు

ఈటల రాజేందర్ వివరణ మరోలా ఉంది. తామెప్పుడూ 60, 70 స్థానాలు వస్తాయనుకోలేదని.. తెలంగాణలో బీజేపీకి 25నుంచి 30 స్థానాలు వస్తాయని చెప్పారు ఈటల.

Advertisement
Update: 2023-11-30 15:49 GMT

ఎగ్జిట్ పోల్స్ పై బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల స్పందన క్లియర్ కట్ గా ఉంది. మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ ని తాము నమ్మడంలేదని, ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ తామే అధికారంలోకి వస్తామని బీఆర్ఎస్ స్పష్టం చేసింది. ఎగ్జిట్ పోల్స్ తో తమ విజయం ఖాయమైపోయిందని, ఈరోజునుంచే సంబరాలు మొదలయ్యాయని కాంగ్రెస్ అంటోంది. అయితే బీజేపీ నుంచి మూడు రకాల స్పందనలు వచ్చాయి. ఒకరు మెజార్టీ స్థానాలు వస్తాయంటే, మరొకరు ప్రభుత్వం ఏర్పాటు చేస్తామన్నారు, ఇంకొకరు 25 నుంచి 30 స్థానాలు తమకి వస్తాయని సరిపెట్టుకున్నారు.

తెలంగాణ బీజేపీలో మూడు పవర్ సెంటర్లు ఉన్నాయి. కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఈటల రాజేందర్.. ముగ్గురూ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై తమదైన శైలిలో స్పందించారు. భారీ మెజారిటీతో గెలుస్తామన్న విశ్వాసం తమకు ఉంది అని చెప్పారు టీబీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి. ఈ ఎన్నికల్లో మంచి ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నట్లు తెలిపారు కిషన్ రెడ్డి. పోలింగ్ సరళి తమకు అనుకూలంగా ఉందన్నారు. పోలీస్ శాఖ కేసీఆర్ కనుసన్నల్లో పనిచేసిందని, డబ్బులు పంచుతుంటే పోలీసులు నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయారని చెప్పారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటీపడి డబ్బులు పంచాయని, కానీ యువత బీజేపీకి మద్దతు ఇచ్చారన్నారు కిషన్ రెడ్డి.


కార్యకర్తలదే ఈ గెలుపు అన్నారు బండి సంజయ్. ప్రజలందరికీ, కరీంనగర్ నియోజకవర్గ ఓటర్స్ అందరికీ కృతజ్ఞతలు అని చెప్పారు. మోదీని, బీజేపీని గెలిపించాలన్న కసితో ప్రజలంతా ఏకమయ్యారని, తమకు మెజార్టీ స్థానాలు వస్తాయని చెప్పారు. ఎగ్జిట్ పోల్స్ ని ఇప్పుడే విశ్వాసంలోకి తీసుకోలేమన్నారు. హంగ్ వస్తే తీసుకోవాల్సిన నిర్ణయం అధిష్టానం చేతుల్లో ఉంటుందని, తమది ఏక్ నిరంజన్ పార్టీ కాదని చెప్పారు బండి.


ఇక ఈటల రాజేందర్ వివరణ మరోలా ఉంది. తామెప్పుడూ 60, 70 స్థానాలు వస్తాయనుకోలేదని.. తెలంగాణలో బీజేపీకి 25నుంచి 30 స్థానాలు వస్తాయని చెప్పారు ఈటల. బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత ఈ ఎన్నికల్లో స్పష్టంగా కనపడిందని అన్నారు. ప్రతి నియోజకవర్గంలోనూ ప్రజలు బీఆర్ఎస్ వ్యతిరేక పార్టీలకే ఓట్లు వేశారన్నారు. తాను పోటీ చేసిన రెండు నియోజకవర్గాల్లోనూ విజయం తనదేనని చెప్పారు ఈటల. గజ్వేల్ లో కూడా మంచి మెజార్టీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు.

Tags:    
Advertisement

Similar News