మునుగోడులో బీజేపీకి మరో షాక్.. మర్రిగూడలో కమలం ఖాళీ..

బీజేపీకి అభ్యర్థి ఉన్నాడు, కానీ ఎన్నికల నాటికి క్యాడర్ అంతా చేజారేలా ఉంది. టీఆర్ఎస్, అభ్యర్థిని అధికారికంగా ప్రకటించకపోయినా ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకు ముందే వలసలతో బలం పుంజుకుంటోంది.

Advertisement
Update: 2022-09-30 09:40 GMT

మేం అభ్యర్థిని ప్రకటించాం, టీఆర్ఎస్‌కి కనీసం అభ్యర్థి ఎవరో తెలియదంటూ మునుగోడు ఉప ఎన్నికలపై బీజేపీ సవాళ్లు వింటూనే ఉన్నాం. కానీ టీఆర్ఎస్ మాటలతో కాకుండా చేతలతో సమాధానం చెబుతోంది. బీజేపీకి అభ్యర్థి ఉన్నాడు, కానీ ఎన్నికల నాటికి క్యాడర్ అంతా చేజారేలా ఉంది. టీఆర్ఎస్, అభ్యర్థిని అధికారికంగా ప్రకటించకపోయినా ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకు ముందే వలసలతో బలం పుంజుకుంటోంది. తాజాగా మునుగోడు నియోజకవర్గ పరిధిలోని మర్రిగూడలో బీజేపీకి పెద్ద షాక్ తగిలింది.

మర్రిగూడ మండలంలో బీజేపీకి కాస్త పట్టుందని అంటారు. కానీ ఇప్పుడు ఆ మండలంలోనే కమలం ఖాళీ అయిపోయింది. ఆ పార్టీ మండల అధ్యక్షుడు చెరుకు శ్రీరాములు, కార్యదర్శి కొత్తమల్లయ్య సహా కార్యకర్తలంతా టీఆర్ఎస్‌లో చేరారు. బీజేపీ నేతలకు టీఆర్ఎస్‌ పార్టీ కండువాలు కప్పి, వారిని పార్టీలోకి ఆహ్వానించారు మంత్రి జగదీష్‌ రెడ్డి. పోలింగ్ జరిగే వరకు ఈ చేరికలు నిరంతర ప్రక్రియ అంటున్న జగదీష్ రెడ్డి, కమలదళానికి పెద్ద షాకిచ్చారు.

కాంగ్రెస్ నుంచి రాజగోపాల్ రెడ్డిని చేర్చుకున్నా, కాంగ్రెస్ కార్యకర్తలెవరూ బీజేపీలో చేరలేదు. ఇటు బీజేపీకి ఉన్నవారిని కూడా టీఆర్ఎస్ తరలించుకుపోతోంది. ఎన్నికల నాటికి బీజేపీలో రాజగోపాల్ రెడ్డి మినహా ఇంకెవరూ మిగిలేలా లేరంటూ స్థానికంగా జోకులు పేలుతున్నాయి. మర్రిగూడలో బీజేపీ మొత్తం ఖాళీ కాగా, నాంపల్లి మండలం మహ్మదాపురం ఎంపీటీసీ, గట్టుప్పల్ ఎంపీటీసీ కూడా టీఆర్ఎస్ లోచేరారు. మహ్మదాపేట ఎంపీటీసీ సహా మరికొందరు సందిగ్ధంలో ఉన్నారని, వారు కూడా త్వరలో టీఆర్ఎస్ గూటికి వచ్చేస్తారనే అంచనాలున్నాయి. ఉప ఎన్నికకు ముందే ఈ స్థాయిలో కూడికలు, తీసివేతలు ఉంటే, ఇక నోటిఫికేషన్ విడుదలైతే మునుగోడులో పొలిటికల్ హీట్ మరింత పెరిగే అవకాశముంది. వలసల‌తో టీఆర్ఎస్ బలం పెంచుకుంటోంది. అదే సమయంలో బీజేపీ అయోమయంలో పడిపోతోంది.

Tags:    
Advertisement

Similar News