బ్యాడ్మింటన్ ర్యాలీలలో సరికొత్త ప్రపంచ రికార్డు!

గ్లోబల్ గేమ్స్ లో ఒకటైన బ్యాడ్మింటన్లో సరికొత్త ప్రపంచ రికార్డు నమోదయ్యింది,మలేసియన్ మాస్టర్స్-2023 మహిళల డబుల్స్ మ్యాచ్ లో ఈ అరుదైన రికార్డు చోటు చేసుకొంది.

Advertisement
Update: 2023-05-27 13:30 GMT

Badminton rally record: బ్యాడ్మింటన్ ర్యాలీలలో సరికొత్త ప్రపంచ రికార్డు!

గ్లోబల్ గేమ్స్ లో ఒకటైన బ్యాడ్మింటన్లో సరికొత్త ప్రపంచ రికార్డు నమోదయ్యింది,మలేసియన్ మాస్టర్స్-2023 మహిళల డబుల్స్ మ్యాచ్ లో ఈ అరుదైన రికార్డు చోటు చేసుకొంది....

క్రీడాప్రపంచంలోనే అత్యంతవేగంగా సాగిపోయే క్రీడల్లో బ్యాడ్మింటన్ ఒకటి. పురుషుల, మహిళల సింగిల్స్, డబుల్స్, మిక్సిడ్ డబుల్స్ విభాగాలలో ప్రపంచ వ్యాప్తంగా..ఏడాదిగా పొడవునా వివిధ దేశాలు వేదికలుగా పోటీలు జరుగుతూనే ఉంటాయి.

మెరుపువేగంతో సాగిపోయే ఈ క్రీడలో దమ్ముపట్టే శక్తి, గంటల తరబడి అలుపుసొలుపు లేకుండా ఆడే దమ్మున్న క్రీడాకారులే విజేతలుగా నిలువగలుగుతారు.

అంతర్జాతీయస్థాయిలో సింగిల్స్ మ్యాచ్ లు 30 నిముషాల నుంచి 75 లేదా 90 నిముషాలలోనే తేలిపోతూ ఉంటాయి.

అదే డబుల్స్ లో మాత్రం సమానబలం కలిగిన రెండుజట్లు తలపడితే మాత్రం గంట నుంచి రెండు గంటల వరకూ సుదీర్ఘర్యాలీలతో మ్యాచ్ లు సాగిన సందర్భాలు లేకపోలేదు.

శక్తిమంతమైన షాట్లతో...

అత్యంత శక్తిమంతమైన షాట్లతో సాగే క్రీడల్లో బ్యాడ్మింటన్ నే ముందుగా చెబుతారు. పురుషులు లేదా మహిళల సింగిల్స్ లో కొందరు క్రీడాకారులు గాల్లోకి ఎగిరి కొట్టే జంప్ షాట్లు లేదా స్మాష్ ల వేగం గంటకు 250 నుంచి 290 కిలోమీటర్ల వరకూ నమోదైన రికార్డులు ఉన్నాయి.

పవర్ గేమ్ తో తలపడే ఇద్దరు క్రీడాకారులు తలపడితే..ఆ గేమ్ ను చూడటానికి రెండు కళ్లూ చాలవనటంలో అతిశయోక్తి లేదు. అదే మెరుపువేగంతో..సుదీర్ఘ ర్యాలీలతో..బలమైన షాట్లు, స్మాష్ లతో సాగిపోయే డబుల్స్ మ్యాచ్ ల్లోనే బ్యాడ్మింటన్ లోని అసలు మజా ఏమిటో తెలిసి వస్తుంది.

211 ర్యాలీలతో ప్రపంచ రికార్డు...

2023 మలేసియన్ మాస్టర్స్ టోర్నీ మహిళల డబుల్స్ విభాగంలో...జపాన్ జోడీ రెనా మియావురా- అయాకో సకురామోటో తో మలేసియా జంట పియర్లీ టాన్- థినా మురళీధరన్ తలపడిన మ్యాచ్ లో ప్రపంచ రికార్డు ర్యాలీ చోటు చేసుకొంది.

అప్పటికే..రెండుజట్లూ చెరో గేమ్ నెగ్గి 1-1తో సమఉజ్జీలుగా నిలిచిన ఈ పోరులో విజేతను నిర్ణయించటానికి ఆడిన మూడో (ఆఖరి) గేమ్ లో ఒక్క పాయింట్ కోసం..ఈ రెండుజట్ల ప్లేయర్లు అఫెన్స్, డిఫెన్స్ కలిపి బ్యాక్ హ్యాండ్, ఫోర్ హ్యాండ్ షాట్లతో 211 ర్యాలీలు ఆడి చరిత్ర సృష్టించారు.

రెండుజట్లకు చెందిన నలుగురు ప్లేయర్లు చెమటలు కక్కుతూ, లేని ఓపికను తెచ్చుకొని షాట్ కు షాట్, డిఫెన్స్ కు డిఫెన్స్ ఆడుతుంటే...గ్యాలరీలలోని అభిమానులు..

తమ రెండుకళ్ళనూ ఆ కోర్టు నుంచి ఈ కోర్టుకూ..ఈ కోర్టు నుంచి ఆకోర్టుకూ తిప్పుతూ తీవ్రఉత్కంఠకు లోనయ్యారు. మెడలు నొప్పి పట్టినా.. ఊపిరిబిగబట్టి మరీ

సుదీర్ఘంగా సాగిన ఈ మారథాన్ ర్యాలీని చూస్తూ..వారేవ్వా అనుకొన్నారు. చివరకూ మలేసియా జోడీ ఆడిన షాట్ ను తిప్పికొట్టడంలో జపాన్ జోడీ విఫలం కావడంతో ..211 ర్యాలలీ దగ్గర పోరు ముగిసింది.

ఈ కీలక పాయింట్ ను మలేసియా జంట టాన్- థినా మురళీధరన్ జోడీ సొంతం చేసుకోగలిగారు. అంతేకాదు.. మ్యాచ్ ను సైతం 21-17, 18-21, 21- 19తో గెలుచుకొని విజేతగా నిలిచారు.

మ్యాచ్ గెలిచిన ఆనందం కంటే ..ఓ పాయింటు కోసం 211 ర్యాలీలపాటు రెండుజట్ల ప్లేయర్లు పోరాడటం హైలైట్ గా మిగిలిపోతుంది.

బ్యాడ్మింటన్ చరిత్రలోనే అత్యంత సుదీర్ఘంగా..211 ర్యాలీల పాటు సాగిన ఈ పాయింటు సరికొత్త ప్రపంచ రికార్డుగా వచ్చి చేరింది.



Tags:    
Advertisement

Similar News