పతకాల పట్టిక ఆరోస్థానంలో భారత్..ఐదోరోజున మరో రెండు స్వర్ణాలు

కామన్వెల్త్ గేమ్స్ ఐదోరోజు పోటీలలో భారత అథ్లెట్లు రెండు స్వర్ణాలతో సహా నాలుగు పతకాలు సాధించారు.

Advertisement
Update: 2022-08-03 06:22 GMT

కామన్వెల్త్ గేమ్స్ ఐదోరోజు పోటీలలో భారత అథ్లెట్లు రెండు స్వర్ణాలతో సహా నాలుగు పతకాలు సాధించారు. బ్యాడ్మింటన్ మిక్సిడ్ టీమ్ విభాగంలో స్వర్ణం చేజారినా..టేబుల్ టెన్నిస్ పురుషుల టీమ్ విభాగంలో భారత్ బంగారు పతకం నిలుపుకోగలిగింది.

మహిళల టీమ్ లాన్ బౌల్స్ విభాగంలో భారత్ అనూహ్యంగా స్వర్ణం నెగ్గి సరికొత్త చరిత్ర సృష్టిస్తే...పురుషుల వెయిట్ లిఫ్టింగ్ హెవీవెయిట్ విభాగంలో వికాస్ ఠాకూర్ రజత పతకంతో సరిపెట్టుకొన్నాడు.

ఐదోరోజు పోటీలు ముగిసే సమయానికి పతకాల పట్టిక ఆరోస్థానంలో భారత్ కొనసాగుతోంది.

బంగారు పతకంతో బోణీ...

ఐదోరోజు పోటీలలో భాగంగా జరిగిన మహిళల లాన్ బౌల్స్ ఫైనల్ బరిలోకి ఏమాత్రం అంచనాలు లేకుండా దిగిన భారతజట్టు అంచనాలకు మించి రాణించడం ద్వారా తొలిసారిగా స్వర్ణపతకం కైవసం చేసుకొంది.

లవ్లీ చుబే, రూపారాణి టిర్కే, పింకీ, నయన్ మోనీ సైకియాలతో కూడిన భారతజట్టు...గోల్డ్ మెడల్ సమరంలో దక్షిణాఫ్రికా పై 17-10 విజయంతో సరికొత్త చరిత్ర సృష్టించింది.

ఒకదశలో 10-7తో వెనుకబడిన భారతజట్టు..ఆఖరి రౌండ్లో అనూహ్యంగా పు్ంజుకొని ఏకంగా 10 పాయింట్లు సాధించడం ద్వారా స్వర్ణపతకం ఖాయం చేసుకొంది.

కామన్వెల్చ్ గేమ్స్ చరిత్రలో భారత్...లాన్ బౌల్స్ క్రీడలో బంగారు పతకం సాధించడం ఇదే మొదటిసారి.

టీటీలో తిరుగులేని భారత్...

టేబుల్ టెన్నిస్ పురుషుల టీమ్ విభాగంలో భారతజట్టు బంగారు పతకం నిలుపుకొంది. గోల్డ్ కోస్ట్ వేదికగా నాలుగేళ్ల క్రితం ముగిసిన 2018 గేమ్స్ లో తొలిసారిగా స్వర్ణపతకం అందుకొన్న భారతజట్టు..ప్రస్తుత 2022 గేమ్స్ ఫైనల్లో సైతం స్థాయికి తగ్గట్టుగా ఆడి విజేతగా నిలిచింది.

సింగపూర్ తో ముగిసిన బంగారు పతకం పోరులో భారత్ 3-1తో విజయం సాధించింది. తెలుగుతేజం శరత్ కమల్, సత్యన్ ప్రధాన ఆటగాళ్లుగా ఉన్న భారత్..సింగిల్స్, డబుల్స్ లో విజయాలు సాధించడం ద్వారా తన ఆధిక్యం చాటుకొంది.

బ్యాడ్మింటన్ ఫైనల్లో షాక్...

బ్యాడ్మింటన్ మిక్సిడ్ టీమ్ ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ హోదాలో పాల్గొన్న భారత్ టైటిల్ నిలబెట్టుకోలేకపోయింది. బంగారు పతకం కోసం మలేసియాతో జరిగిన పోరులో 1-3తో ఘోరపరాజయం చవిచూసింది.

మహిళల సింగిల్స్ లో సింధు మాత్రమే విజయం సాధించగా..పురుషుల సింగిల్స్ లో కిడాంబీ శ్రీకాంత్, డబుల్స్ లో సాయి సాత్విక్, అశ్విని పొన్నప్పల జోడీలు పరాజయాలు పొందాయి.

సెమీస్ వరకూ అలవోకగా నెగ్గుతూ వచ్చిన భారత్ ఫైనల్లో మాత్రం దారుణంగా విఫలమయ్యింది. బంగారు పతకం ఖాయమనుకొన్న ఈ టైటిల్ సమరంలో చివరకు రజత పతకంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.



వికాస్ ఠాకూర్ కు రజతం...

వెయిట్ లిఫ్టింగ్ పురుషుల హెవీవెయిట్ ( 96 కిలోల ) విభాగంలో భారత వెటరన్ లిఫ్టర్ వికాస్ ఠాకూర్ రజత పతకం సాధించాడు. మొత్తం 346 కిలోల బరువెత్తి రెండోస్థానంలోనిలిచాడు. స్నాచ్ లో 155 కిలోలు, క్లీన్ అండ్ జెర్క్ లో 191 కిలోల బరువుతో వికాస్ పతకం అందుకొన్నాడు.

గత రెండు కామన్వెల్త్ గేమ్స్ లో పతకాలు సాధిస్తూ వచ్చిన వికాస్..ప్రస్తుత గేమ్స్ లో సైతం రజతం సాధించడం ద్వారా హ్యాట్రిక్ పూర్తి చేశాడు. 2014 గేమ్స్ లో రజత, 2018 క్రీడల్లో కాంస్య పతకాలు అందుకొన్న వికాస్..ప్రస్తుత బర్మింగ్ హామ్ క్రీడల్లో మరోసారి రజతం సాధించాడు.



మహిళా హాకీలో తొలి ఓటమి...

మహిళల హాకీ గ్రూప్- ఏ లీగ్ పోటీలో భారత్ తొలి ఓటమి చవిచూసింది. ఆతిథ్య ఇంగ్లండ్ తో జరిగిన కీలక పోరులో భారత్ 1-3 గోల్స్ తో పరాజయం పాలయ్యింది. గ్రూప్ ప్రారంభ మ్యాచ్ లో ఘనాను చిత్తు చేసిన భారత మహిళలు పటిష్టమైన ఇంగ్లండ్ కు సరిజోడీ కాలేకపోయింది.

ట్రాక్ అండ్ ఫీల్డింగ్ పురుషుల లాంగ్ జంప్ ఫైనల్స్ కు భారత అథ్లెట్లు మురళీ శ్రీశంకర్, మహ్మద్ అనీస్ యాహ్యా అర్హత సంపాదించారు. మహిళల షాట్ పుట్ ఫైనల్స్ కు మన్ ప్రీత్ కౌర్ అలవోకగా చేరుకొంది.

స్క్వాష్ పురుషుల సింగిల్స్ లో సెమీఫైనల్లో న్యూజిలాండ్ కు చెందిన పాల్ కోల్ తో భారత స్టార్ ప్లేయర్ సౌరవ్ గోశాల్ తలపడాల్సి ఉంది.

కామన్వెల్త్ దేశాలకే జనాభాపరంగా అతిపెద్ద దేశంగా ఉన్న భారత్...పతకాల పట్టిక వరుసలో మాత్రం 6వ స్థానంలో నిలవడం చర్చనీయాంశంగా మారింది.

Tags:    
Advertisement

Similar News