సానియాకు 20రోజులు..విరాట్ కు 20 నిముషాలు!

మహిళా ఐపీఎల్ లో బెంగళూరు ఫ్రాంచైజీకి మాజీ టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జాను మెంటార్ గా నియమించడం చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియాలో అతిపెద్ద జోక్ గా నిలిచింది

Advertisement
Update: 2023-03-17 05:56 GMT

మహిళా ఐపీఎల్ లో బెంగళూరు ఫ్రాంచైజీకి మాజీ టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జాను మెంటార్ గా నియమించడం చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియాలో అతిపెద్ద జోక్ గా నిలిచింది.....

భారత క్రికెట్ బోర్డు మహిళల కోసం తొలిసారిగా నిర్వహిస్తున్న 2023 మహిళా ఐపీఎల్ లో బెంగళూరు ఫ్రాంచైజీకి టెన్నిస్ మాజీ స్టార్ సానియా మీర్జాను మెంటార్ (స్ఫూర్తి ప్రదాత)గా నియమించడం ఈ ఏడాదికే అతిపెద్ద జోక్ గా సోషల్ మీడియా వర్గాలు అభివర్ణిస్తున్నాయి.

అంతర్జాతీయ క్రికెట్ ప్లేయర్లకు ఓ మాజీ టెన్నిస్ ప్లేయర్ ఏవిధంగా మార్గదర్శనం చేయగలదు, వారిలో ఎలా స్ఫూర్తినింపగలదని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. క్రికెట్ లోతుపాతులు తెలియని ఓ టెన్నిస్ ప్లేయర్..ఏ విధంగా మెంటారింగ్ చేయగలదని అంటున్నారు.

బెంగళూరుకు వరుసగా 5 పరాజయాలు..

సానియా మెంటార్ గా బెంగళూరు రాయల్ చాలెంజర్స్ జట్టు ప్రస్తుత 5 జట్ల లీగ్ లో వరుస పరాజయాలు చవిచూసింది. ఆర్థిక ఆవకతవకలతో ఇంగ్లండ్ కు పారిపోయి ..ప్రస్తుతం లండన్ లో తలదాచుకొంటున్న విజయ్ మాల్యాకు చెందిన బెంగళూరు ఫ్రాంచైజీ..మహిళా ఐపీఎల్ హక్కులను ఐదేళ్ల కాలానికి వేలం ద్వారా దక్కించుకొంది.

బీసీసీఐకి 901 కోట్ల రూపాయలు చెల్లించింది. అంతేకాదు..మహిళా ఐపీఎల్ చరిత్రలోనే అత్యధికంగా 3 కోట్ల 40 లక్షల రూపాయల రికార్డు ధరకు ఓపెనర్ స్మృతి మందనను దక్కించుకొని జట్టు పగ్గాలు అప్పజెప్పింది.

న్యూజిలాండ్ క్రికెట్ సూపర్ కోచ్, క్రికెట్ మేధావి మైక్ హెస్సెన్ డైరెక్టర్ గా, సానియా మీర్జా మెంటార్ గా బెంగళూరు రాయల్ చాలెంజర్స్ జట్టు బాధ్యతలు తీసుకొన్నారు.

అయితే..కెప్టెన్ స్మృతి మందన వరుస వైఫల్యాలు, జట్టుగా పేలవమైన ఆటతీరుతో బెంగళూరు మొదటి ఐదుమ్యాచ్ ల్లో వరుసగా ఐదు పరాజయాలతో లీగ్ టేబుల్ అట్టడుగుకు పడిపోయింది.

విరాట్ మెంటారింగ్ తో తొలిగెలుపు...

ఐదుకు ఐదుమ్యాచ్ లు ఓడి దిక్కుతోచని స్థితిలో పడిపోయిన బెంగళూరుజట్టుకు మెంటార్ గా సానియా ఓ అలంకరణగా మిగిలిపోయింది. చేష్టలుడిగి చూస్తూ ఉండటం మినహా సానియా చేయగలిగింది ఏమీలేకపోడంతో..బెంగళూరు పురుషుల జట్టు మాజీ కెప్టెన్, దిగ్గజ ఆటగాడు విరాట్ కొహ్లీ మెంటార్ గా రంగం లోకి దిగాడు.

ఉత్తరప్రదేశ్ వారియర్స్ తో ఆరవ రౌండ్ మ్యాచ్ ఆడటానికి ముందు స్మృతి మందన నాయకత్వంలోని బెంగళూరు జట్టు సభ్యులతో విరాట్ కొహ్లీ కేవలం 20 నిముషాలుపాటు మాట్లాడాడు. ఆత్మవిశ్వాసంతో పరువుకోసం ఆడాలంటూ ప్రభోదించాడు. ఓడినా పోయేదేమీ లేదని, పోరాడి ఓడమంటూ స్ఫూర్తిని నింపాడు.

వరుస విజయాలతో దూకుడుమీదున్న యూపీ వారియర్స్ తో జరిగిన పోరులో బెంగళూరు 5 వికెట్ల విజయంతో తొలివిజయాన్ని నమోదు చేయగలిగింది.

కెప్టెన్ స్మృతి మందన వరుసగా ఆరోసారి విఫలమైనా..మిడిలార్డర్ బ్యాటర్లు కనిక అహూజా ( 30 బంతుల్లో 46 పరుగులు), రిచా ఘోష్ (30 నాటౌట్ ) కీలక భాగస్వామ్యంతో ఆదుకోడంతో బెంగళూరు చేజింగ్ విజయంతో పరువు దక్కించుకోగలిగింది.

న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ సోఫీ డివైన్, ఆస్ట్ర్ర్రేలియా సూపర్ ఆల్ రౌండర్ ఎల్సీ పెర్రీ, భారత ఓపెనర్ స్మృతి మందన లాంటి ప్రపంచమేటి ప్లేయర్లున్నా..బెంగళూరుజట్టు తన తొలివిజయం నమోదు చేయటానికి మొదటి ఐదుమ్యాచ్ ల్లో పరాజయాలు చవిచూడక తప్పలేదు.

బెంగళూరు రాయల్ చాలెంజర్స్ మెంటార్ గా టెన్నిస్ మాజీ ప్లేయర్ సానియా మీర్జా గత 20 రోజులుగా చేయలేని పనిని..క్రికెట్ సూపర్ స్టార్ విరాట్ కొహ్లీ కేవలం 20 నిముషాల మాటలతో సాధించడం గురించే ఇప్పుడు క్రికెట్ వర్గాలు ప్రధానంగా చర్చించుకొంటున్నాయి.

ఓ టెన్నిస్ ప్లేయర్ ను తెచ్చి క్రికెట్ జట్టుకు మెంటార్ గా నియమించడం ఏంటంటూ బెంగళూరు ఫ్రాంచైజీని పలురకాలుగా ట్రోలింగ్ చేస్తున్నారు. సానియా అడుగుపెడితే జరిగేది అదేనంటూ రకరకాల మీమ్ లతో విమర్శకులు ఓ ఆటాడుకొంటున్నారు..

Tags:    
Advertisement

Similar News