అభిమానులకు సూర్య..సారీ!

ప్రపంచకప్ సెమీఫైనల్లో భారతజట్టు ఓటమి బాధాకరమంటూ నయాసంచలనం సూర్యకుమార్ యాదవ్ ఆవేదన వ్యక్తం చేశాడు. అభిమానులను క్షమాపణ కోరుతూ ఓ సందేశాన్నిపంపాడు.

Advertisement
Update: 2022-11-11 13:30 GMT

అభిమానులకు సూర్య..సారీ!

ప్రపంచకప్ సెమీఫైనల్లో భారతజట్టు ఓటమి బాధాకరమంటూ నయాసంచలనం సూర్యకుమార్ యాదవ్ ఆవేదన వ్యక్తం చేశాడు. అభిమానులను క్షమాపణ కోరుతూ ఓ సందేశాన్నిపంపాడు.

2022 టీ-20 ప్రపంచకప్ లో భారత్ టైటిల్ వేట సెమీఫైనల్స్ ఓటమితో ముగిసింది. ఇంగ్లండ్ తో జరిగిన ఏకపక్షపోరులో రోహిత్ శర్మ నాయకత్వంలోని భారతజట్టు పరాజయం పొందినతీరు చర్చనీయాంశంగా మారింది.

ఆస్ట్ర్రేలియాలోని మెల్బోర్న్, పెర్త్, పెర్త్, అడిలైడ్ నగరాలు వేదికలుగా జరిగిన ఐదు సూపర్ -12 రౌండ్ మ్యాచ్ ల్లో నాలుగు విజయాలు ఓ ఓటమి చవిచూసిన భారత్..ఇంగ్లండ్ తో జరిగిన రెండో సెమీఫైనల్లో 10 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడి టోర్నీ నుంచి నిష్క్ర్రమించింది. 168 పరుగుల భారీస్కోరు సాధించినా రోహిత్ సేన ఇంగ్లండ్ ఓపెనర్లను కట్టడి చేయలేకపోయింది. కనీసం ఒక వికెట్టూ పడగొట్టలేకపోయింది.

బ్యాటర్లు పర్వాలేదనిపించినా...బౌలర్లు మాత్రం దారుణంగా విఫలమయ్యారు. ప్రపంచ కప్ టోర్నీ హాట్ ఫేవరెట్ జట్లలో ఒకటిగా నిలిచిన ప్రపంచ నంబర్ వన్ జట్టు భారత్ చివరకు పేలవమైన ఆటతీరుతో విఫలం కావడంతో పలు వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

స్టార్ క్రికెటర్ల సందేశాలు....

ప్రపంచకప్ లో తాము ఆడిన మ్యాచ్ లకు అభిమానులు భారీసంఖ్యలో తరలిరావడం, స్టేడియాలు కిటకిటలాడటం అంతులేని సంతృప్తినిచ్చిందని, ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమంది టీవీల ముందు కూర్చొని తమ మ్యాచ్ లను వీక్షించడం ద్వారా తమ అభిమానం చాటుకొన్నారని, వారి రుణం తీర్చుకోలేనిదంటూ స్టార్ బ్యాటర్ విరాట్ కొహ్లీ, స్టార్ ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా తమ కృతజ్ఞతా సందేశాల ద్వారా తెలిపారు.

సెమీఫైనల్లోనే తమ పోటీ ముగియడం బాధాకరమంటూ పేర్కొన్నారు. మరోవైపు..నయాసంచలనం సూర్యకుమార్ యాదవ్ సైతం కృతజ్ఞత, క్షమాపణలతో కూడిన సందేశాన్ని పంచుకొన్నాడు.

మరింత బలంగా దూసుకొస్తాం...

ప్రపంచకప్ లో తమ ఓటమి అభిమానులను బాధపెట్టే విధంగా సాగిందని, ఇదీ అందరికీ బాధాకరమేనని..అయితే భారతజట్టు ఎక్కడ మ్యాచ్ లు ఆడినా అక్కడి స్టేడియాలు కిటకిటలాడటం తమపట్ల వారికున్న అభిమానానికి నిదర్శనమని సూర్య తన సందేశంలో పేర్కొన్నాడు. అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుకొంటున్నానని చెప్పాడు.

తమ ప్రపంచకప్ టైటిల్ వేట ఇంతటితో ముగిసే పోలేదని, మరో రెండేళ్లలో జరిగే ప్రపంచకప్ నాటికి మరింత బలంగా, శక్తిమంతంగా తయారై వస్తామని తెలిపాడు.

తన కెరియర్ లో మొట్టమొదటిసారి ప్రపంచకప్ బరిలో నిలిచిన 31 సంవత్సరాల సూర్యకుమార్ మొత్తం ఆరుమ్యాచ్ ల్లో మూడు హాఫ్ సెంచరీలతో సహా 239 పరుగులు సాధించాడు.

నెదర్లాండ్స్, దక్షిణాఫ్రికా, జింబాబ్వే జట్లపైన మెరుపు అర్థశతకాలు నమోదు చేశాడు. కళ్లు చెదిరే స్థాయిలో 185.71 స్ట్రయిక్ రేట్ సాధించాడు. 2022 క్యాలెండర్ ఇయర్ లో ఆడిన 29 ఇన్నింగ్స్ లోనే సూర్యకుమార్ యాదవ్ 1040 పరుగులతో టీ-20లో నంబర్ వన్ ర్యాంక్ బ్యాటర్ గా నిలిచాడు.

ఇంగ్లండ్ తో సెమీఫైనల్లో 10 బంతుల్లో ఒక్కో బౌండ్రీ, సిక్సర్ తో 14 పరుగుల మాత్రమే సాధించిన సూర్యను లెగ్ స్పిన్నర్ అదిల్ రషీద్ పడగొట్టాడు.

Tags:    
Advertisement

Similar News