హెచ్‌సీఏ కమిటీ రద్దు.. జస్టిస్ లావు నాగేశ్వరరావును పర్యవేక్షకుడిగా నియమించిన సుప్రీంకోర్టు

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌కు చార్మినార్ క్రికెట్ క్లబ్, ఇతరులకు మధ్య ఉన్న కేసులో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకున్నది. హెచ్‌సీఏ కమిటీని రద్దు చేస్తున్నామని తెలిపింది.

Advertisement
Update: 2023-02-14 13:16 GMT

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌లో నెలకొన్న వివాదాలకు సుప్రీంకోర్టు ఫుల్ స్టాప్ పెట్టింది. గత కొంత కాలంగా పాలకమండలిలో అనేక వివాదాలు నెలకొన్నాయి. మాజీ అధ్యక్షుడు మహ్మద్ అజారుద్దీన్‌కు పాలక మండలి సభ్యులకు ఉన్న మనస్పర్థల కారణంగా ఎన్నికలు కూడా నిర్వహించడం లేదు. గతేడాది సెప్టెంబర్‌లోనే పాలక మండలి గడువు తీరిపోయిందని.. జనవరి మొదటి వారంలో ఎన్నికలు నిర్వహించాలని పాలక మండలి సభ్యులు ఓ మాజీ న్యాయమూర్తిని పర్యవేక్షకుడిగా నియమించారు. అయితే సుప్రీంకోర్టు నియమించిన కమిటీ ఆ ఎన్నికల నిర్వహణను అడ్డుకున్నది.

మరోవైపు తెలంగాణ ప్రభుత్వం కూడా హెచ్‌సీఏ జరుగుతున్న అవకతకవలపై సుప్రీంకోర్టు కమిటీకి నివేదిక సమర్పించింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌కు చార్మినార్ క్రికెట్ క్లబ్, ఇతరులకు మధ్య ఉన్న కేసులో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకున్నది. హెచ్‌సీఏ కమిటీని రద్దు చేస్తున్నామని.. సాధ్యమైనంత త్వరలో ఎన్నికలు నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, మనోజ్ మిశ్రా, అరవింద్ కుమార్‌ల త్రిసభ్య ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది.

ఇప్పటికే వాయిదా పడిన ఎన్నికలను సాధ్యమైనంత త్వరగా నిర్వహించాలని.. దీనికి రిటైర్డ్ జస్టిస్ లావు నాగేశ్వరరావును పర్యవేక్షకుడిగా నియమిస్తున్నట్లు పేర్కొన్నది. గతంలో సుప్రీంకోర్టు నియమించిన కమిటీ రద్దు చేసి ఏక సభ్యుడిగా జస్టిస్ లావు నాగేశ్వరరావును నియమిస్తున్నట్లు పేర్కొన్నది.

లావు నాగేశ్వరరావు ఎన్నికల నిర్వహణకు పూర్తిగా సహకరిస్తారని.. అందుకే అవసరమయ్యే ఖర్చులను హెచ్‌సీఏ భరించాలని సుప్రీంకోర్టు వెల్లడించింది. ఈ కోర్టు నుంచి ఇంకా ఏవైనా మార్గదర్శకాలు కావాలని ఏక సభ్యుడు భావిస్తే కోర్టు ముందుకు రావొచ్చని తెలిపింది. కాగా, అన్ని క్రీడా అసోసియేషన్లను సుప్రీంకోర్టు మానిటర్ చేయలేదని స్పష్టం చేసింది. హెచ్‌సీఏ కేసును మార్చి 2కు వాయిదా వేసింది.

హెచ్‌సీఏకు అంబుడ్స్‌మన్, ఎథిక్స్ అధికారిగా సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్ దీపక్ వర్మను నియమించారు. కాగా, ఆయన నియామకంపై హెచ్‌సీఏకు అనుబంధంగా ఉన్న కొన్ని క్లబ్స్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించాయి. అయితే తెలంగాణ హైకోర్టు వర్మ నియామకాన్ని సమర్థించింది. ఈ తీర్పుపై క్లబ్స్ సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. మంగళవారం త్రిసభ్య ధర్మాసనం విచారించింది.

ఇప్పటి వరకు ఉన్న కమిటీని రద్దు చేసి.. రిటైర్డ్ జస్టిస్ లావు నాగేశ్వరరావును ఏక సభ్యుడిగా నియమించింది. నాగేశ్వరరావు హైదరాబాద్‌కు చెందిన వ్యక్తే కాబట్టి ఆయనే ఈ వివాదాన్ని పరిష్కరిస్తారని, ఎలక్టోరల్ కాలేజీకి సంబంధించిన విషయాలు కూడా ఆయనే చూసుకుంటారని సుప్రీంకోర్టు ఆదేశించింది. గతంలో ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్‌లో ఎలక్టోరల్ కాలేజీకి సంబంధించిన వివాదాన్ని జస్టిస్ లావు నాగేశ్వరరావు పర్యవేక్షించిన అనుభవం ఉంది. ఐవోయే కేసు ఇంకా లావు నాగేశ్వరావు చూస్తున్నారు. ఇప్పుడు అదనంగా హెచ్‌సీఏ కేసును పర్యవేక్షించనున్నారు.

Tags:    
Advertisement

Similar News