సచిన్‌ను మించిన గిల్, భారత్ రికార్డుల మోత!

హరారే వేదికగా జింబాబ్వేతో ముగిసిన సిరీస్‌లోని మూడుకు మూడు మ్యాచ్‌లు నెగ్గడం ద్వారా భారత జట్టు ఓ అరుదైన ప్రపంచ రికార్డు నెలకొల్పింది. క్రికెట్ చరిత్రలోనే..ఒకే వేదిక (హరారే స్పోర్ట్స్ క్లబ్ )లో వరుసగా 12 మ్యాచ్‌లు నెగ్గడం ద్వారా ఈ ఘనత సాధించిన తొలి జట్టుగా నిలిచింది.

Advertisement
Update: 2022-08-23 05:50 GMT

జింబాబ్వే గడ్డపై భారత్ ప్రపంచ రికార్డుల మోత మోగించింది. జింబాబ్వే గడ్డపై అత్యధిక స్కోరు సాధించిన క్రికెటర్‌గా సచిన్ పేరుతో ఉన్న రికార్డును యువ ఆటగాడు శుబ్ మన్ గిల్ అధిగమించాడు.వన్డే క్రికెట్ 13వ ర్యాంకర్ జింబాబ్వేతో జరిగిన తీన్నార్ వన్డే సిరీస్‌లో మూడో ర్యాంకర్ భారత్ అలవోక విజయం సాధించింది. కెఎల్ రాహుల్ నాయకత్వంలోని భారత జట్టు తీన్మార్ వన్డే సిరీస్‌లో క్లీన్ స్వీప్ విజయంతో సంపూర్ణ ఆధిక్యం ప్రదర్శించింది.

హరారేలో భారత్ ప్రపంచ రికార్డు..

హరారే వేదికగా జింబాబ్వేతో ముగిసిన సిరీస్‌లోని మూడుకు మూడు మ్యాచ్‌లు నెగ్గడం ద్వారా భారతజట్టు ఓ అరుదైన ప్రపంచ రికార్డు నెలకొల్పింది. క్రికెట్ చరిత్రలోనే..ఒకే వేదిక (హరారే స్పోర్ట్స్ క్లబ్ )లో వరుసగా 12 మ్యాచ్‌లు నెగ్గడం ద్వారా ఈ ఘనత సాధించిన తొలి జట్టుగా నిలిచింది. హోరాహోరీగా సాగిన ఆఖరి వన్డేలో భారత్ 13 పరుగుల తేడాతో విజయం నమోదు చేసింది. స్టార్ బ్యాటర్ సికిందర్ రాజా ఫైటింగ్ సెంచరీ సాధించినా భారత్ విజయాన్ని జింబాబ్వే అడ్డుకోలేకపోయింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 50 ఓవర్లలో 8 వికెట్లు 289 పరుగుల భారీస్కోరు సాధించింది. యువ ఆటగాడు శుబ్ మన్ గిల్ కేవలం 97 బాల్స్ లోనే 15 బౌండ్రీలు, ఓ సిక్సర్‌తో 130 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. సమాధానంగా..మ్యాచ్ నెగ్గాలంటే 290 పరుగులు చేయాల్సిన జింబాబ్వే 49.3 ఓవర్లలోనే 276 పరుగులకే ఆలౌటయ్యింది. మిడిలార్డర్ ఆటగాడు సికిందర్ రాజా 95 బంతుల్లో 9 బౌండ్రీలు, 3 సిక్సర్లతో 115 పరుగుల ఫైటింగ్ సెంచరీ సాధించినా ప్రయోజనం లేకపోయింది. శుభ్ మన్ గిల్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు దక్కాయి.

జింబాబ్వే పై భారత్ తిరుగులేని రికార్డు..

వన్డే క్రికెట్లో భారత్, జింబాబ్వేజట్ల మధ్య పది ర్యాంకుల అంతరం ఉంది. భారత్ మూడో ర్యాంకర్ గా ఉంటే..జింబాబ్వే 13వ ర్యాంక్ జట్టు. రెండు జట్ల ఫేస్ టు ఫేస్ రికార్డుల్లో సైతం అంతే తేడా ఉంది. ఈ రెండు జట్లూ ప్రస్తుత సిరీస్ వరకూ 64 సార్లు తలపడితే భారత్ 54, జింబాబ్వే 10 విజయాలతో ఉన్నాయి. మరోవైపు..జింబాబ్వే గడ్డపై అత్యధిక స్కోరు సాధించిన భారత క్రికెటర్‌గా సచిన్ పేరుతో ఉన్న 127 పరుగుల నాటౌట్ రికార్డును 22 సంవత్సరాల శుభ్ మన్ గిల్ 130 పరుగుల స్కోరుతో అధిగమించాడు. సచిన్ 1998లో బులావాయోలోని క్వీన్స్ పార్క్ స్టేడియంలో 127 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. వన్డే క్రికెట్లో తన తొలి శతకాన్ని శుభ్ మన్ గిల్ కేవలం 82 బాల్స్ లోనే సాధించడం విశేషం. జింబాబ్వే గడ్డపై గతంలో శతకాలు బాదిన భారత బ్యాటర్లలో అంబటి రాయుడు (124 నాటౌట్ ), యువరాజ్ సింగ్ (120 ), శిఖర్ ధావన్ (116 ), విరాట్ కొహ్లీ (108 ) ఉన్నారు.

దీపక్ హుడా అరుదైన ఘనత....

ఇదే సిరీస్‌లో భారత జట్టులో సభ్యుడిగా పాల్గొన్న మరో యువ ఆటగాడు దీపక్ హుడా సైతం ఓ అరుదైన రికార్డు సాధించాడు. ప్రస్తుత జింబాబ్వే సిరీస్ వరకూ దీపక్ ఆడిన మొత్తం 17 మ్యాచ్‌ల్లోనూ భారత్ విజేతగా నిలవడం విశేషం. దీపక్ హుడా జట్టులో ఉంటే భారత్ విజయం ఖాయమన్న నమ్మకం జట్టుకు ఓ సెంటిమెంట్‌గా స్థిరపడిపోయింది.

8 వన్డేలు...9 టీ-20లు..

వెస్టిండీస్ ప్రత్యర్థిగా 2022 ఫిబ్రవరి 6న వన్డే క్యాప్‌తో అరంగేట్రం చేసిన దీపక్ హుడా..ప్రస్తుత జింబాబ్వే సిరీస్‌లోని మొదటి రెండు వన్డేలు ముగిసే వరకూ ఆడిన ఏడుకు ఏడు వన్డేలలోనూ భారత జట్టు అజేయంగా నిలిచింది. అంతేకాదు..2022 ఫిబ్రవరి 24న శ్రీలంక ప్రత్యర్థిగా తొలి అంతర్జాతీయ టీ-20 మ్యాచ్ ఆడిన దీపక్ హుడా...ఇప్పటి వరకూ ఆడిన తొమ్మిదికి తొమ్మిది టీ-20 మ్యాచ్‌ల్లోనూ భారత్ విజేతగా నిలిచింది. గత ఏడు మాసాలలో దీపక్ హుడా ఆడిన 17 మ్యాచ్‌ల్లోనూ భారత్ విజయాలు సాధించడం విశేషం. ఇప్పటి వరకూ రొమానియా ఆటగాడు సాత్విక్ నడిగోట్ల పేరుతో ఉన్న 15 వరుస విజయాల రికార్డును దీపక్ హుడా 16 విజయాలతో అధిగమించాడు.

దక్షిణాఫ్రికా మిడిలార్డర్ ఆటగాడు డేవిడ్ మిల్లర్, రొమానియాకే చెందిన శాంతనూ వశిష్ట్ పేరుతో 13 వరుస విజయాల రికార్డుతో తర్వాతిస్థానంలో ఉన్నారు. క్రికెట్ చరిత్రలోనే 16 వరుస విజయాలతో భారతపాలిట లక్కీప్లేయర్‌గా దీపక్ హుడా చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్‌లో 40 లక్షల రూపాయల కనీస ధరతో తన ప్రస్థానం కొనసాగించిన దీపక్ హుడాను గత సీజన్ వేలంలో లక్నో సూపర్ జెయంట్స్ జట్టు 5 కోట్ల 75 లక్షల రూపాయలకు దక్కించుకొంది. ఐపీఎల్‌లో అసాధారణంగా రాణించడం ద్వారా సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించిన దీపక్ హుడా భారత జట్టులో సైతం చోటు దక్కించుకోడమే కాదు..స్థాయికి మించి రాణిస్తూ తన స్థానం పదిలం చేసుకుంటూ వస్తున్నాడు. మొత్తం మీద..జింబాబ్వే ప్రస్తుత సిరీస్‌ను భారత్ క్లీన్ స్వీప్ విజయాలతో, ప్రపంచ రికార్డులతో ముగించగలిగింది.

Tags:    
Advertisement

Similar News