ఉబ్బసాన్ని జయించి, మహాసముద్రాలు ఈదిన మొనగాడు!

మహాసముద్రాలు ఈదటం భారత ఈతగాళ్లకు కొత్తేంకాదు. అలనాటి మిహిర్ సేన్ , ఆరతీ సాహాల నుంచి నేటితరం స్విమ్మర్లు రోహన్ మోరే, భక్తీ శర్మ వరకూ ఎందరో మహా సముద్రాలను ఈదినవారే. అయితే సప్తసముద్రాలను ఈదటంలో ముంబై యువకుడు శుభం వనమాలీ తర్వాతే ఎవరైనా.

Advertisement
Update: 2023-03-14 04:28 GMT

ఉబ్బసాన్ని జయించి, మహాసముద్రాలు ఈదిన మొనగాడు!

మహాసముద్రాలు ఈదటం భారత ఈతగాళ్లకు కొత్తేంకాదు. అలనాటి మిహిర్ సేన్ , ఆరతీ సాహాల నుంచి నేటితరం స్విమ్మర్లు రోహన్ మోరే, భక్తీ శర్మ వరకూ ఎందరో మహా సముద్రాలను ఈదినవారే. అయితే సప్తసముద్రాలను ఈదటంలో ముంబై యువకుడు శుభం వనమాలీ తర్వాతే ఎవరైనా....

సాహసాలు చేయటం, సాహసమే ఊపిరిగా సాహసక్రీడల్లో పాల్గొనటం అందరికీ సాధ్యం కాదు. ప్రధానంగా ఈ భూఖండంలోని ఏడు మహాసముద్రాలను ఈదాలనుకోడం గొప్పసాహసమే మరి.

మహాసముద్రాల ఈత అనగానే అలనాటి భారత దిగ్గజ స్విమ్మర్లు మిహిర్ సేన్, ఆర్తీ సాహా మాత్రమే గుర్తుకు వస్తారు. మిహర్ సేన్ లాంటి గజ ఈతగాడు ఓ ఏడాదిలో

ఐదు మహాసముద్రాలు మాత్రమే ఈదితే..నవీముంబైకి చెందిన 26 సంవత్సరాల శుభం వనమాలీ ఏకంగా సప్తసముద్రాలు ఈది తనకుతానే సాటిగా నిలిచాడు.

స్విమ్మింగే ఊపిరిగా...

నవీముంబైలోని నెరుల్ కు చెందిన ఓ క్రీడాకారుల కుటుంబం నుంచి వచ్చిన శుభం వనమాలికి బాల్యం నుంచే ఉబ్బసం వ్యాధితో పాటు చదువులోనూ వెనుకబాటు తనం ఉండేది. తండ్రి ధనుంజయ జాతీయ మాజీ వాలీబాల్ క్రీడాకారుడు, తల్లి దీపిక జాతీయ మాజీ కబడ్డీ క్రీడాకారిణి కావడంతో శుభం ఆరేళ్ల ప్రాయం నుంచే

ఈత పట్ల ఆకర్షితుడయ్యాడు. ఉబ్బసం వ్యాధిని జయించడం కోసం ఈత అలవాటు చేసుకొన్న శుభమ్ కు మహాసముద్రాలలో ఈత కొట్టాలన్న కోరిక కలిగింది.

పుట్టుకతో వచ్చిన వైకల్యంతో తాను చదువులో రాణించే అవకాశం లేకపోడంతో ఈత కొట్టడమే తన జీవితంగా, ఊపిరిగా శుభం మార్చుకొన్నాడు.

జాతీయ, అంతర్జాతీయ క్రీడల్లో భారత క్రీడాకారులు పతకాలు సాధించిన సమయంలో జాతీయగీతాలాపన కార్యక్రమాలు చూసి ఉత్తేజం పొందిన శుభం..తాను సైతం అంతర్జాతీయస్థాయిలో దేశానికి గుర్తింపు తీసుకురావాలని, తన విజయాలను టీవీ ప్రసారాల ద్వారా తన తల్లిదండ్రులు చూడాలని తపన పడుతూ ఉండేవాడు.

అంతర్జాతీయ స్విమ్మర్ గా...

తొమ్మిదేళ్ల చిన్నవయసుకే జిల్లా స్థాయి నుంచి జాతీయ స్విమ్మర్ స్థాయికి ఎదిగిన శుభమ్ 18 సంవత్సరాల వయసుకే అంతర్జాతీయ స్విమ్మర్ గా గుర్తింపు పొందాడు. 2014 లోనే ఇంగ్లీష్ చానెల్, జిబ్రాల్టర్ జలసంధులను ఈదిన అత్యంత పిన్నవయస్కుడైన స్విమ్మర్ గా, తొలి ఆసియా స్విమ్మర్ గా శుభం రికార్డులు నెలకొల్పాడు.

పలుమార్లు లిమ్కా బుక్ ఆఫ్ ఇండియన్ రికార్డుల్లో చోటు సంపాదించాడు. గిన్నెస్ బుక్ లో చోటు కోసం త్వరలో మరిన్ని సాహసాలు చేయబోతున్నాడు. జాతీయ, అంతర్జాతీయస్థాయి ఈత పోటీలలో శుభమ్ డజన్ల కొద్దీ రికార్డులు సాధించాడు.

ముంబైలోని గేట్ వే ఆఫ్ ఇండియా నుంచి ధరమ్ తార్ వరకూ అరేబియా సముద్రాన్ని ఈదడం ద్వారా తన ఘనవిజయాలకు తెరతీసిన శుభమ్ ఆ తర్వాత మరి వెనుదిరిగి చూసింది లేదు.

26 ఏళ్ల వయసులో అరుదైన పురస్కారం..

అంతర్జాతీయస్థాయిలో ఇంగ్లీష్ చానెల్,జిబ్రాల్టర్ జలసంధి, కాటాలినా చానెల్, మన్ హట్టన్ మారథాన్ స్విమ్, గేట్ వే ఆఫ్ ఇండియా నుంచి దహాను బీచ్ ఈత లో పాల్గొని రికార్డుల్లో చోటు సంపాదించాడు.

సాహసక్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరచిన క్రీడాకారులకు భారత ప్రభుత్వం ఇచ్చే టెన్జింగ్ నార్గే అవార్డును 2022 సంవత్సరానికి శుభం వనమాలీ అందుకొన్నాడు.

రాష్ట్ర్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా రాష్ట్ర్రపతి భవన్ లో గత నెలలో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ పురస్కారం స్వీకరించాడు.

గత పుష్కరకాలంగా తాను పడిన కష్టం, చేసిన సాధన, అంకితభావాలకు తగిన గుర్తింపే భారత ప్రభుత్వ అవార్డు అంటూ శుభం పొంగిపోతున్నాడు. అంతర్జాతీయంగా ఎన్ని అవార్డులు, పురస్కారాలు అందుకొన్నా, ఘనతలు సాధించినా...భారతప్రభుత్వం ఇచ్చిన అవార్డుకు ఏదీ సరికాదని ఈ మహాస్విమ్మర్ చెబుతున్నాడు.

ఈతతో సమాజసేవ......

ఈత ద్వారా తనవంతుగా సమాజ సేవలో పాలుపంచుకోవాలని శుభం నిర్ణయించాడు. దేశంలోని కోట్లాదిమంది బాలలు చదువుకొనే సమయంలో ఎదురవుతున్న వైకల్యాల గురించి సమాజంలో స్పృహ పెంచడం కోసం, నిధుల సమీకరణ కోసం గోవా నుంచి ముంబై వరకూ అరేబియా సముద్రంలో గల 413 కిలోమీటర్ల దూరాన్ని 15 రోజులపాటు ఈదాలని ఈ నవీముంబై స్విమ్మర్ నిర్ణయించాడు. తన ఈ సాహసఈత ద్వారా సమీకరించిన నిధులను బాలల సంక్షేమం కోసం పాటుపడుతున్న

ఓ స్వచ్చంధ సంస్థకు అందచేయాలని నిర్ణయించాడు.

పుట్టకతోనే రకరకాల వైకల్యాల ఎదుర్కొంటున్న బాలల్లో ఏదో ఒక నైపుణ్యం, కళ దాగి ఉంటాయన్నది తన ప్రగాఢ విశ్వాసమని, తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు, స్నేహితుల ప్రోత్సాహం, ఆదరణ, అండదండలు లేకుంటే జీవితంలో ఏదీ సాధించలేమని శుభం అంటున్నాడు. రానున్నకాలంలో మహాసముద్రాల ఈతలో మరిన్ని సాహసాలు చేయాలన్నదే తన లక్ష్యమని ప్రకటించాడు.

Tags:    
Advertisement

Similar News