హాకీ ప్రపంచకప్ కొడితే కోటి నజరానా

ఒడిషా వేదికగా ఈనెల 13 నుంచి జరిగే 2023 ప్రపంచకప్ హాకీలో భారత్ విజేతగా నిలిస్తే..భారీనజరానా ఇస్తామని ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రకటించారు...

Advertisement
Update: 2023-01-06 09:01 GMT

ఒడిషా వేదికగా ఈనెల 13 నుంచి జరిగే 2023 ప్రపంచకప్ హాకీలో భారత్ విజేతగా నిలిస్తే..భారీనజరానా ఇస్తామని ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రకటించారు...

భారత జాతీయ క్రీడ హాకీకి ఒడిషా ప్రభుత్వం గత కొన్నిసంవత్సరాలుగా అండగా నిలుస్తూ వస్తోంది. ఏటా కో్ట్ల రూపాయలు ఖర్చు చేస్తూ అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన హాకీ స్టేడియాలను నిర్మిస్తూ భారత హాకీకే చిరునామాగా నిలుస్తోంది.

భువనేశ్వర్ లో కళింగ ఇంటర్నేషనల్ హాకీ స్టేడియం, రూర్కెలాలో బిర్సాముండా హాకీ స్టేడియం కాంప్లెక్స్ లను నిర్మించింది. అంతర్జాతీయ పోటీలలో పాల్గొనే భారతహాకీ జట్లకు ప్రధాన స్పాన్సర్ గా వ్యవహరిస్తోంది.

2023 ప్రపంచకప్ కు వేదికగా....

జనవరి 13 నుంచి 29 వరకూ భువనేశ్వర్, రూర్కెలా నగరాలు వేదికలుగా జరిగే 2023 పురుషుల ప్రపంచకప్ హాకీ పోటీలకు ఒడిషా ప్రభుత్వం ఆతిథ్యమిస్తోంది.

ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ హాకీ క్రీడకు ఎనలేని ప్రోత్సాహం అందచేస్తున్నారు. కేవలం హాకీ క్రీడ కోసమే కోట్లాది రూపాయలు వ్యయం చేస్తున్నారు.

1975 ప్రపంచకప్ లో చివరిసారిగా విజేతగా నిలిచిన భారత్ ..ప్రస్తుత ప్రపంచకప్ లో చాంపియన్ గా నిలిస్తే జట్టులోని ఒక్కో ఆటగాడికి కో్టి రూపాయలు చొప్పున ప్రోత్సాహకంగా ఇస్తామని ప్రకటించారు.

రూర్కెలాలో అత్యాధునికి స్టేడియం...

ప్రస్తుత ప్రపంచకప్ కోసం రూర్కెలాలో కేవలం 9 మాసాల వ్యవధిలోనే ప్రపంచ ప్రమాణాలతో కూడిన బిర్సా ముండా హాకీ స్టేడియం కాంప్లెక్స్ ను నిర్మించారు. ఆటగాళ్లు, అధికారులు, శిక్షకుల కోసం 225 గదులను నిర్మించారు. ప్రపంచకప్ లో పాల్గొనే మొత్తం 16 జట్ల ఆటగాళ్లు, సిబ్బంది..బిర్సాముండా స్టేడియంలోనే విడిది చేయనున్నారు.

కొత్తగా నిర్మించిన ఈ స్టేడియాన్ని ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రపంచకప్ జట్టుకు ప్రోత్సాహక బహుమతి ఇస్తామంటూ అధికారికంగా ప్రకటించారు.

హాకీ ఇండియా చైర్మన్ దిలీప్ టిర్కే ప్రపంచకప్ ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. 2018లో జరిగిన హాకీ ప్రపంచకప్ కు తొలిసారిగా ఆతిథ్యమిచ్చిన ఒడిషా వరుసగా రెండోసారి నిర్వహణకు సిద్ధమయ్యింది.

Tags:    
Advertisement

Similar News