భారత గోల్డెన్ లిఫ్టర్ మీరాబాయి చాను.. కామన్వెల్త్ గేమ్స్ రెండోరోజు 4 పతకాలు

ప్రస్తుత 2022 గేమ్స్ లో సైతం..తిరిగి అదే ఘనతను సొంతం చేసుకోగలిగింది. స్నాచ్ విభాగంలో 88 కిలోలు, క్లీన్ అండ్ జెర్క్ లో 113 కిలోలు..మొత్తం 203 కిలోలతో సరికొత్త రికార్డు నమోదు చేయడం ద్వారా స్వర్ణ పతకం సాధించింది.

Advertisement
Update: 2022-07-31 03:15 GMT

బర్మింగ్ హామ్ వేదికగా జరుగుతున్న 2022 కామన్వెల్త్ గేమ్స్ రెండోరోజు పోటీలలో భారత్ కు స్వర్ణోదయమయ్యింది. మహిళల 49 కిలోల విభాగంలో స్టార్ లిఫ్టర్ మీరాబాయి చాను మరోసారి బంగారు పతకంతో మెరిసి మురిసింది. వెయిట్ లిఫ్టింగ్ పురుషుల, మహిళల విభాగంలో భారత్ పోటీల తొలిరోజునే 4 పతకాలు సాధించడం ద్వారా పతకాల పట్టికలో సగర్వంగా నిలిచింది.

టైటిల్ నిలుపుకున్న చాను..

వెయిట్ లిఫ్టింగ్ ప్రపంచ మహిళల 49 కిలోల విభాగంలో ప్రపంచ మేటి లిఫ్టర్లలో ఒకరిగా పేరుపొందిన మణిపూర్ వండర్ మీరాబాయి చాను స్థాయికి తగ్గట్టుగా రాణించింది. నాలుగేళ్ల క్రితం గోల్డ్ కోస్ట్ వేదికగా ముగిసిన 2018 కామన్వెల్త్ గేమ్స్ లో భారత్ కు తొలి బంగారు పతకం అందించిన చాను..ప్రస్తుత 2022 గేమ్స్ లో సైతం..తిరిగి అదే ఘనతను సొంతం చేసుకోగలిగింది. స్నాచ్ విభాగంలో 88 కిలోలు, క్లీన్ అండ్ జెర్క్ లో 113 కిలోలు..మొత్తం 203 కిలోలతో సరికొత్త రికార్డు నమోదు చేయడం ద్వారా స్వర్ణ పతకం సాధించింది.

వింధ్యారాణికి రజతం..

మహిళల 55 కిలోల విభాగంలో భారత లిఫ్టర్ వింధ్యారాణి రజత పతకం సంపాదించింది. వింధ్య స్నాచ్ లో 86 కిలోలు, క్లీన్ అండ్ జెర్క్ లో 116 కిలోలు నమోదు చేయడం ద్వారా రజతం ఖాయం చేసుకొంది. వింధ్య తన మొదటి రెండు ప్రయత్నాలలో విఫలమైనా..మూడో ప్రయత్నంలో సఫలం కాగలిగింది.

తొలిపతక విజేత సంకేత్..

అయితే.. బర్మింగ్ హామ్స్ లో భారత్ కు తొలి పతకం అందించిన ఘనతను మాత్రం.. మహారాష్ట్ర‌ కుర్రాడు సంకేత్ సర్గార్ దక్కించుకొన్నాడు. పురుషుల 55 కిలోల విభాగంలో సంకేత్ గట్టి పోటీ ఎదుర్కొని తన దేశం పతకాలకు రజతంతో బోణీ కొట్టగలిగాడు. అంతేకాదు..పురుషుల 61 కిలోల విభాగంలో గురురాజ్ పూజార్యా సైతం భారత్ కు కాంస్య పతకం సంపాదించి పెట్టాడు. గత క్రీడల్లో రజత విజేతగా నిలిచిన గురురాజ్ ఈసారి మాత్రం కాంస్యంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. గత క్రీడల్లో భారత లిఫ్టర్లు పురుషుల, మహిళల విభాగాలలో మొత్తం 9 పతకాలు సాధించారు. ఇందులో 5 స్వర్ణ, రెండేసి రజత, కాంస్య పతకాలు ఉన్నాయి. అయితే..ప్రస్తుత క్రీడల వెయిట్ లిఫ్టింగ్ తొలిరోజునే భారత్ 4 పతకాలు సాధించగలిగింది. మిగిలిన వెయిట్ విభాగాలలో భారత్ మరిన్ని పతకాలు గెలుచుకొనే అవకాశం ఉంది.

హాకీలో మరో విజయం..

హాకీ మహిళల గ్రూప్- ఏ లీగ్ పోటీలలో భారత్ వరుసగా రెండో విజయం నమోదు చేసింది. గ్రూప్ ప్రారంభ మ్యాచ్ లో ఘనాను 5-0 గోల్స్ తో చిత్తు చేసిన భారత్..రెండోరౌండ్ పోరులో వేల్స్ నుంచి గట్టి పోటీ ఎదుర్కొని 3-1 గోల్స్ తో విజేతగా నిలిచింది. కెప్టెన్ గుర్జీత్ కౌర్..భారత్ విజయంలో ప్రధానపాత్ర వహించింది.

బ్యాడ్మింటన్లో విజయ పరంపర..

బ్యాడ్మింటన్ మిక్సిడ్ టీమ్ విభాగంలో భారత్ మరో రెండు కీలక విజయాలు సాధించడం ద్వారా పతకం రౌండ్ కు చేరువయ్యింది. పోటీల తొలిరోజున రెండు విజయాలు సాధించిన భారతజట్టు..రెండోరోజున శ్రీలంకను 5-0తోనూ, ఆస్ట్రేలియాను 4-1తోను ఓడించింది.

మహిళా బాక్సింగ్ లో లవ్లీనా..

మహిళల బాక్సింగ్ లో భారత బాక్సర్ లవ్లీనా బోర్గెయిన్ తన పతకం వేట మొదలు పెట్టింది. తొలిరౌండ్లో అరియేన్ నికోల్సన్ పై తిరుగులేని విజయంతో రెండోరౌండ్లో అడుగుపెట్టింది. స్క్వాష్ పురుషుల, మహిళల వ్యక్తిగత విభాగాలలో భారత క్రీడాకారులు సౌరవ్ గోశల్, జోశ్న చిన్నప్ప తొలివిజయాలు నమోదు చేశారు. పురుషుల సింగిల్స్ తొలిరౌండ్లో శ్రీలంక ప్లేయర్ షమీల్ వకీల్ ను సౌరవ్ 3-0తోనూ, మహిళల సింగిల్స్ లో బార్బొడోస్ కు చెందిన మేఘాను జోశ్న 3-0 తోనూ అలవోకగా ఓడించారు.

Tags:    
Advertisement

Similar News