ప్రపంచ క్రికెట్లో భారత బుల్లెట్!

అతివేగం ప్రాణాంతకం..

Advertisement
Update: 2023-01-12 04:00 GMT

అతివేగం ప్రాణాంతకం...ఈ మాట క్రికెట్ కు మాత్రం వర్తించదు. ప్రస్తుత భారత క్రికెట్లో మాత్రమే కాదు..ప్రపంచ క్రికెట్లోనే అత్యంత వేగంగా బంతులు విసిరే ఫాస్ట్ బౌలర్లలో ఒకడిగా భారత యువఫాస్ట్ బౌలర్, జమ్మూ ఎక్స్ ప్రెస్.. ఉమ్రాన్ మాలిక్ గుర్తింపు తెచ్చుకొన్నాడు....

ప్రపంచ క్రికెట్ ను శాసించాలంటే ఏజట్టుకైనా మెరికల్లాంటి ఫాస్ట్ బౌలర్లు ఉండితీరాలి. గతంలో అగ్గిపిడుగుల్లాంటి నలుగురేసి ఫాస్ట్ బౌలర్లతో వెస్టిండీస్, ఆస్ట్ర్రేలియా, ఇంగ్లండ్, పాకిస్థాన్ ,దక్షిణాఫ్రికాజట్లు ప్రపంచ క్రికెట్ నే గడగడలాడించాయి. అయితే స్పిన్ బౌలర్లకు పుట్టినిల్లుగా పేరుపొందిన భారత క్రికెట్ చరిత్రలో నాణ్యమైన ఫాస్ట్ బౌలర్లు అతికొద్ది మాత్రమే కనిపిస్తారు.

మహ్మద్ నిస్సార్ నుంచి ఉమ్రాన్ మాలిక్ వరకూ...

1932లో ఇంగ్లండ్ గడ్డపైన టెస్టు క్రికెట్ అరంగేట్రం చేసిన భారతజట్టులో మహ్మద్ నిస్సార్, అమర్ సింగ్ లతో ఓ మెరుపు ఫాస్ట్ బౌలర్ల జోడీ కలకలమే రేపింది. టెస్టు క్రికెట్లో తొలి వికెట్ పడగొట్టిన భారత మొట్టమొదటి ఫాస్ట్ బౌలర్ గా షేక్ మహ్మద్ నిస్సార్ రికార్డుల్లో చేరాడు.

ఆ తర్వాత భారత్ మరో నిఖార్సయిన ఫాస్ట్ బౌలర్ కోసం.. కపిల్ దేవ్ ఆగమనం వరకూ వేచిచూడాల్సి వచ్చింది. ఒక్కమాటలో చెప్పాలంటే కపిల్ దేవ్ రాకతో భారత్ లో ఫాస్ట్ బౌలర్ల విప్లవానికి తెరలేచింది. అప్పటి వరకూ స్పిన్ బౌలింగే ప్రధాన అస్త్రంగా నెట్టుకొంటూ వచ్చిన భారత్ కు జవగళ్ శ్రీనాథ్, జహీర్ ఖాన్ లాంటి ఫాస్ట్ బౌలర్లు, మనోజ్ ప్రభాకర్, రోజర్ బిన్నీ, కర్సన్ ఘావ్రీ, మదన్ లాల్ , చేతన్ శర్మ, ఇర్ఫాన్ పఠాన్ , రుద్రప్రతాప్ సింగ్ లాంటి మీడియం పేస్ స్వింగ్ బౌలర్లే దిక్కయ్యారు.

బుమ్రా, షమీలను మించిన ఉమ్రాన్...

ఆస్ట్ర్రేలియా పేస్ బౌలింగ్ దిగ్గజం డెన్నిస్ లిల్లీ పర్యవేక్షణలో ఏర్పాటైన ఎమ్మారెఫ్ పేస్ అకాడమీ ద్వారా పలువురు యువఫాస్ట్ బౌలర్లు తెరమీదకు వచ్చినా ఎక్కువకాలం నిలబడలేకపోయారు.

జవగళ్ శ్రీనాథ్, జహీర్ ఖాన్ ఫాస్ట్ బౌలర్లుగా భారత క్రికెట్ కు అసమాన సేవలు అందించారు. ఇర్ఫాన్ పఠాన్, ఆర్పీ సింగ్ లాంటి ఎడమచేతి వాటం స్వింగ్ బౌలర్లు సైతం తమవంతు పాత్ర పోషించారు.

2008 లో ప్రారంభమైన ఐపీఎల్ తో భారత్ లో ఫాస్ట్ , స్వింగ్ బౌలర్ల ప్రాధాన్యం పెరిగింది. స్వింగ్ కింగ్ భువనేశ్వర్ కుమార్, ఫాస్ట్ బౌలర్ల త్రయం మహ్మద్ షమీ, ఉమేశ్ యాదవ్, జస్ ప్రీత్ బుమ్రాలతో భారతజట్టు టెస్టు క్రికెట్లో ప్రపంచ నంబర్ వన్ స్థాయికి చేరుకోగలిగింది. ఐసీసీ టెస్టులీగ్ లో సైతం రన్నరప్ గా నిలువగలిగింది.

గంటకు 156 కిలోమీటర్ల వేగంతో...

భారత ఫాస్ట్ బౌలర్ల వేగం గత దశాబ్దకాలంలో గంటకు 130 కిలోమీటర్ల స్థాయి నుంచి గంటకు 156 కిలోమీటర్ల స్థాయికి పెరిగిపోయింది.మహ్మద్ షమీ, ఉమేశ్ యాదవ్ గంటకు 135 నుంచి 140 కిలోమీటర్ల వేగంతో బౌల్ చేస్తుంటే...గుజరాత్ నుంచి భారత క్రికెట్లోకి దూసుకొచ్చిన యార్కర్లకింగ్ జస్ ప్రీత్ బుమ్రా 153.36 కిలోమీటర్ల స్థాయికి చేర్చాడు.

భారత క్రికెట్ చరిత్రలో ఇప్పటి వరకూ అత్యంత వేగంగా బంతులు విసిరిన బౌలర్ల వరుసలో బుమ్రా, షమీ, నవదీప్ సైనీలు నిలిచారు. బుమ్రా 153.36 కిలోమీటర్లు, మహ్మద్ షమీ 153.3 కిలోమీటర్లు, నవదీప్ సైనీ 152. 85 కిలోమీటర్ల వేగంతో బంతులు విసరడం ద్వారా ఇప్పటి వరకూ మొదటి మూడుస్థానాలలో కొనసాగుతూ వచ్చారు.

జమ్మూ ఎక్స్ ప్రెస్ ఉమ్రాన్..

జమ్మూ-కాశ్మీర్ రాష్ట్ర్రంలోని జమ్మూలోని గుజ్జర్ నగర్ లోని ఓ పండ్ల దుకాణం యజమాని ఇంట జన్మించిన ఉమ్రాన్ మాలిక్ 19 సంవత్సరాల వయసులోనే బుల్లెట్ వేగంతో బంతులు విసిరే ఫాస్ బౌలర్ గా పేరు తెచ్చుకొన్నాడు.

ఐపీఎల్ లో హైదరాబాద్ సన్ రైజర్స్ జట్టులో సభ్యుడిగా ఉమ్రాన్ ప్రభంజనమే సృష్టించాడు. ఉమ్రాన్ ను 4 కోట్ల రూపాయలకు వేలం ద్వారా హైదరాబాద్ ఫ్రాంచైజీ సొంతం చేసుకోగలిగింది.2022 సీజన్లో తన సుడిగాలి బౌలింగ్ తో 13 మ్యాచ్ ల్లో 21 వికెట్లు పడగొట్టడం ద్వారా భారతజట్టులో చోటు సంపాదించాడు.

ఓ ఐపీఎల్ సీజన్‌లో 20 అంత కంటే ఎక్కువ వికెట్లు తీసిన అతి పిన్నవయస్కుడైన భారత బౌలర్ గా ఉమ్రాన్ (22 ఏళ్ల 176 రోజులు) రికార్డు సృష్టించాడు.

ఉమ్రాన్‌కు ముందు ఈ రికార్డు ముంబై ఇండియన్స్‌ పేసర్‌ బుమ్రా పేరిట ఉండేది. 2017 ఐపీఎల్‌ సీజన్‌లో బుమ్రా 23 ఏళ్ల 165 రోజుల వయసులో 16 మ్యాచ్‌ల్లో 20 వికెట్లు పడగొట్టాడు.

భారత మెరుపు ఫాస్ట్ బౌలర్ గా...

ఐపీఎల్ ప్రతిభతో భారత సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించిన 22 సంవత్సరాల ఉమ్రాన్ 2022 జూన్ నెలలో తన తొలి అంతర్జాతీయ టీ-20 మ్యాచ్ ను ఐర్లాండ్, తొలివన్డే మ్యాచ్ ను న్యూజిలాండ్ పై 2022 నవంబర్ లోనూ ఆడాడు.

అయితే..2023 సిరీస్ లో భాగంగా ముంబై వాంఖడే స్టేడియం వేదికగా శ్రీలంకతో జరిగిన తొలివన్డేలో గంటకు 155 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేసి సరికొత్త రికార్డు నెలకొల్పిన ఉమ్రాన్ ..గౌహతీ బార్సపారా స్టేడియం వేదికగా శ్రీలంకతోనే జరిగిన తొలివన్డేలో 156 కిలోమీటర్ల వేగాన్ని అందుకోడం ద్వారా తన రికార్డును తానే అధిగమించగలిగాడు.

భారత క్రికెట్ చరిత్రలోనే సగటున 150 కిలోమీటర్లు, అత్యధికంగా 156 కిలోమీటర్ల వేగంతో బౌల్ చేసిన తొలి, ఏకైక బౌలర్ గా, భారత ఫాస్టెస్ట్ బౌలర్ గా చరిత్ర సృష్టించాడు.

23 సంవత్సరాల వయసులోనే 156 కిలోమీటర్ల వేగాన్ని సాధించిన ఉమ్రాన్ రానున్నకాలంలో ఇదే స్థాయిలో రాణించగలిగితే ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ బౌలర్ గా నిలిచినా ఆశ్చర్యపోనక్కరలేదు.

Tags:    
Advertisement

Similar News