ఐదు పనులతో.. ఆందోళన దూరం

ఉత్సాహం, ఆశాభావం కలగాలన్నా, ఆందోళన, ఒత్తిడి లేకుండా జీవించాలన్నా రోజూ ఐదు పనులు చేయమంటున్నారు మానసిక నిపుణులు అవేంటో చూద్దాం

Advertisement
Update: 2022-07-19 02:44 GMT

ప్రతి ఉదయం ఒక కొత్త రోజు మొదలవుతుంది. అయితే అలా కొత్తగా మరో సూర్యోదయం మనకు లభించిందనే భావం, ఉత్సాహం చాలా మందిలో ఉండవు. అలాంటి ఉత్సాహం, ఆశాభావం కలగాలన్నా, ఆందోళన, ఒత్తిడి లేకుండా జీవించాలన్నా రోజూ ఐదు పనులు చేయమంటున్నారు మానసిక నిపుణులు అవేంటో చూద్దాం

1. ఉదయం నిద్రలేచామంటే చాలు ఇక ఉరుకులు పరుగులు మొదలైపోతుంటాయి. మెదడు పనిచేయటం ఆపేస్తుంది. లేదా అది మరెక్కడో ఉంటుంది. శరీరం మాత్రం అలవాటుగా పనులు చేస్తూ పోతుంటుంది. అలా కాకుండా శరీరం, మెదడు కలిసి పనిచేయాలంటే.. నిద్ర లేచాక మంచం పైనుండి కిందకు దిగకముందే నిదానంగా మూడుసార్లు శ్వాసని తీసుకోవాలి. ఆ సమయంలో మన శరీరం ఎలా కదులుతున్నదో చూడాలి. ఇలా చేయటం వలన రోజంతా యాంత్రికంగా కాకుండా మనసు శరీరం రెండింటినీ అనుసంధానిస్తూ ఉత్సాహంగా పనిచేయగలుగుతాం. మానసిక ఒత్తిడి పెరిగిన ప్రతిసారీ ఇలా దీర్ఘశ్వాస తీసుకోవటం వలన మంచి ఫలితం ఉంటుంది.

2. ప్రతిరోజు మన మనసులో తిరుగుతున్న ఆలోచలను పరిశీలించుకుంటుండాలి. ముఖ్యంగా ఇతరులు మన గురించి ఏదో అనుకుంటున్నారు.. అనే ఆలోచన మనల్ని చాలా ఆందోళనకు గురిచేస్తుంది. తాము ఫోన్ చేసినప్పుడు అవతలివారు ఫోన్ ని లిఫ్ట్ చేయకపోయినా పదిరకాలుగా నెగెటివ్ గా ఊహించేసుకుంటారు కొందరు. ఇతరులు తమ పనితీరుని, శక్తి సామర్ధ్యాలను నమ్మటం లేదని, తమని చిన్నచూపు చూస్తున్నారని, వాళ్లు తమ గురించి చెడుగా అనుకుంటున్నారని చాలామంది భావిస్తుంటారు. కానీ.. నిజానికి మనం ఊహిస్తున్నవన్నీ నిజాలు కావు. ఎదుటివారు మన గురించి అంత చెడుగా ఏమీ అనుకోకపోవచ్చు. ఒకవేళ వారు అలా అనుకున్నా మనకు వచ్చే నష్టం ఏమీ లేదని కూడా గుర్తించాలి. అందుకే అనవసరంగా ఆలోచించి ఆందోళనని పెంచుకోవటం మంచిది కాదు. రోజంతా కాకపోయినా.. రోజులో కాస్త సమయం అయినా ఆలోచనలను చెక్ చేసుకుని.. ఇతరుల ఆలోచనలు అంత ప్రమాదకరం కాదని మనకు మనం చెప్పుకోవాలి.

3. ఉదయం సీట్లో కూర్చుంటే.. సాయంత్రం వరకు కదలకుండా అలాగే కూర్చుని పని చేస్తుంటారు చాలామంది. వీరు భోజనం కూడా తమ సీట్లోనే కూర్చుని చేసేస్తుంటారు. అలా చేయకుండా లంచ్ బాక్స్ తీసుకుని క్యాంటిన్ కో మరో చోటకో.. మొత్తానికి బయటకు వెళ్లటం మంచిది. ఫోన్ ని పని ప్రదేశంలోనే ఉంచి.. బయటి ప్రదేశాలను, మనుషులను గమనిస్తూ తాజా గాలిని శ్వాసించాలి. మధ్యాహ్న భోజన సమయంలో కుదరకపోతే సాయంత్రం లోపల ఏదోఒక సమయంలో ఇలా చేయటం వలన.. చాలా సమయం వరకు ఒత్తిడికి గురికాకుండా ఉండగలుగుతారు.

4. రోజులో చాలా సందర్భాల్లో మనం నీళ్లను తాకటం, తాగటం చేస్తుంటాం. నీళ్లతో పనులు చేస్తుంటాం. కానీ నీళ్లు మనల్ని తాకినప్పుడు మనలో కలుగుతున్న అనుభూతిని ఏమాత్రం గమనించము. రోజులో ఒక్కసారైనా నీటి స్పర్శని మనస్ఫూర్తిగా, ఆస్వాదిస్తూ అనుభూతి చెందాలి. నీటిని తాకినప్పడు మన శరీరంలో కలిగే స్పందనలను గమనించాలి. చాలా తేలిగ్గా మైండ్ ఫుల్ నెస్ ధ్యానాన్ని సాధన చేసే మార్గం ఇది. నీటి స్పర్శని అనుభూతి చెందుతూ.. పూర్తిగా తాదాత్మ్యం చెందటం ద్వారా మనలోని ఆలోచనలను, ఆందోళనలను ఆపేసి మానసికశాంతిని పొందగలం.

5. మన మెదడు చాలావరకు మన తప్పులను ఎత్తి చూపటంలో ముందుంటుంది. అలాగే మనం చేయలేని పనులను గుర్తుచేస్తుంది. దీనివలన నిరుత్సాహం, నిరాశ వంటివి వెంటాడుతుంటాయి. ఇలాంటి సమస్యనుండి తప్పించుకోవాలంటే.. రాత్రి నిద్రకు ముందు ఆ రోజు మనం సరిగ్గా నిర్వహించిన మూడు పనులను ఓ పేపరుపైన రాయాలి. దీనివలన మన శక్తి సామర్ధ్యాలపైన మనకు నమ్మకం పెరుగుతుంది. నిరాశ విసుగు లాంటివి తగ్గుతాయి.

Tags:    
Advertisement

Similar News