విప్లవ రచయిత వరవరరావుకి బెయిల్

భీమా కోరెగావ్ కేసులో నాలుగేళ్లుగా జైలులో మగ్గిపోతున్న విప్లవ రచయిత వరవరరావుకి సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది.

Advertisement
Update: 2022-08-10 09:02 GMT

భీమా కోరెగావ్ కేసులో నాలుగేళ్లుగా జైలులో మగ్గిపోతున్న విప్లవ రచయిత వరవరరావుకి సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. షరతులతో కూడిన శాశ్వత మెడికల్ బెయిల్ మంజూరు చేస్తూ, ఆయన ముంబై దాడి వెళ్లకూడదని నిబంధన విధించింది. 82 ఏళ్ల వయసున్న వరవరరావు ఇప్పటికే రెండున్నరేళ్లపాటు జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్నారని విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు తెలిపింది. 2018లో వరవరరావు సహా 16మంది సామాజిక కార్యకర్తలను, మేధావులను ఎన్ఐఏ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

2017 డిసెంబర్ 31 న పుణె లోని ఎల్గార్ పరిషత్ లో వరవర రావు విద్వేష పూరిత ప్రసంగం చేశారనేది ఆయనపై ఉన్న ప్రదాన అభియోగం. ఆ తర్వాతి రోజే భీమా కోరేగావ్ లోని యుద్ధ స్మారకం వద్ద చెలరేగిన అల్లర్లలో ఓ వ్యక్తి మరణించారు. మావోయిస్ట్ లతో సంబంధం ఉన్నవారే ఎల్గార్ పరిషత్ లో సదస్సు నిర్వహించారని దాని ఫలితమే భీమాకోరెగావ్ అల్లర్లు అని ఎన్ఐఏ కేసు నమోదు చేసింది. ఈ కేసులో 2018 ఆగస్ట్ 28న హైదరాబాద్ లో విరసం నేత వరవర రావును అదుపులోకి తీసుకుంది. భీమా కోరేగావ్ కేసులో రెండు వేర్వేరు సమయాల్లో అరెస్టులు జరిగాయి. దీంతో రెండు రెండు ఛార్జ్‌ షీట్లు దాఖలు చేశారు. అరెస్ట్ చేసిన వ్యక్తుల నుంచి స్వాధీనం చేసుకున్న హార్డ్‌డిస్క్, పెన్ డ్రైవ్, మెమరీ కార్డ్, మొబైల్ ఫోన్ లాంటి సాధనాల ద్వారా లభ్యమైన సమాచారం ఆధారంగా ఛార్జ్‌ షీట్లు తయారు చేశారు. మొత్తం 16మందిని అరెస్ట్ చేశారు.

గతంలోనే వరవరరావు అనారోగ్య కారణాలతో బెయిల్ కోరినా ఎన్ఐఏ ఆయన విడుదలను తీవ్రంగా వ్యతిరేకించింది. ప్రభుత్వంపై జరిగిన కుట్రలో భాగస్వామికి బెయిల్ ఇవ్వొద్దని కోరింది. తాజా విచారణలో కూడా అడిషనల్ సొలిసిటర్ జనరల్ బెయిల్ ను తీవ్రంగా వ్యతిరేకించారు. వయసు రీత్యా వచ్చే అనారోగ్య సమస్యలతోపాటు, పార్కిన్ సన్ వ్యాధితో బాధపడుతున్నారని ఆయన తరపు లాయర్ కోర్టుకి తెలిపారు. 82 ఏళ్ల వయసు, ఇప్పటికే రెండున్నరేళ్లు జైలులో ఉండటం, ఆరు నెలల మధ్యంతర బెయిల్ ను దుర్వినియోగం చేయకపోవడం వంటివాటిని పరిగణనలోకి తీసుకుని వరవర రావుకు శాశ్వత బెయిల్ ఇస్తున్నట్లు ధర్మాసనం తీర్పునిచ్చింది.

Tags:    
Advertisement

Similar News