జనం ఇచ్చిన షాక్ కు 'వ్యూహకర్త'కు కళ్ళు బైర్లుకమ్మాయా ?

3500 కిలోమీటర్లు సాగే ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ పాదయాత్ర నిన్న బీహార్ లోని పశ్చిమ చంపారణ్ జిల్లా బేతియాలో ప్రారంభమయ్యింది. అయితే మొదటి రోజే పట్టుమని పది మంది కూడా లేక సభా ప్రాంగణం వెలవెల బోయింది.

Advertisement
Update: 2022-10-04 10:45 GMT

పీకే అనబడే ప్రశాంత్ కిశోర్ దేశంలో అనేక పార్టీలను గద్దెనెక్కించిన వాడుగా పేరుగాంచినవాడు.తన ఎన్నికల వ్యూహాలతో తిమ్మిని బమ్మిని చేయగల దిట్ట అని ఆయనకు పేరుంది. ఆయనను వ్యూహకర్తగా పెట్టుకుంటే అధికారంలోకి వచ్చేస్తామన్న నమ్మకం చాలా రాజకీయ పార్టీలకు ఉంది. ఆయనను వ్యూహకర్తగా నియమించుకున్న వాళ్ళు కొన్ని చోట్ల ఓడిపోయినా చాలా చోట్ల గెలిచారు. అయితే గెలిచే పార్టీలకే అయన వ్యూహ రచన చేస్తాడనే పేరు కూడా ఉంది. అలాంటి ప్రశాంత్ కిశోర్ ఇప్పుడు తానే స్వంతంగా పార్టీ పెట్టి అధికారంలోకి రావాలనే ఆలోచనతో ముందుగా ఒక రాజకీయ వేదిక ప్రారంభించారు. ఆ వేదిక తరపున బీహార్ మొత్తం పాదయాత్ర చేయడం ప్రారంభించారు. ఆ యాత్ర పేరు 'జనసూరజ్ పాదయాత్ర'.

బీహార్ లోని పశ్చిమ చంపారణ్ జిల్లా బేతియాలో ప్రారంభించిన ఈ పాద యాత్ర 3500 కిలోమీటర్లు సాగుతుంది. నిన్న ప్రారంభమైన ఆయన పాద యాత్ర జనం లేక వెలవెల బోయింది. ఆయనతో పాటు పాదయాత్రలో పాల్గొంటున్న ఓ 15 మందితో పాటు మరో పది, పది హేను మందికన్నా ఆయన మొదటి రోజు సభకు జనం లేరు.

ఆఫీసుల్లో కూర్చొని వ్యూహాలు పన్నడానికి జనంలోకి వెళ్ళి వాళ్ళను తన మాటల ద్వారా ఒప్పించడానికి ఎంత తేడా ఉంటుందో ప్రశాంత్ కిశోర్ కు మొదటి రోజే అనుభవమయ్యింది. సభా ప్రాంగణం మొత్తం బోసిపోయి కనిపించింది. స్థానికులు కూడా పీకే సభపై పెద్దగా ఆసక్తి చూపించలేదు. అయినా తన పాదయాత్రకు విపరీతమైన స్పందన వస్తోందని ప్రకటించారు పీకే.

మరో వైపు పీకే బీజేపీ కోసం పని చేస్తున్నారని , ఆయన రహస్య ఎజెండా బీజేపీని గెలిపించడమే అని బీహార్ లో అధికార పార్టీ జేడీయూ ఆరోపించింది. ఆయన ప్రారంభించిన జనసూరజ్ పాదయాత్ర బీజేపీ ఆదేశాలకు అనుగుణంగా నడుస్తోందని జేడీయూ జాతీయ అధ్యక్షుడు రాజీవ్ రంజన్ సింగ్ ఆరోపించారు. 

Tags:    
Advertisement

Similar News