ఆంజనేయా.. ఆలయం ఖాళీ చెయ్.. నోటీసులిచ్చిన రైల్వే శాఖ

ఒకవేళ రైల్వే స్థలం నుంచి ఆలయాన్ని తొలగించకపోతే ఆలయం కూల్చివేత, ఆ స్థలం పునరుద్ధరణకు అయ్యే ఖర్చులను సైతం మీ నుంచే వసూలు చేస్తామంటూ అధికారులు ఆ నోటీసులో పేర్కొన్నారు.

Advertisement
Update: 2023-02-13 14:49 GMT

ప్రభుత్వ స్థలాన్ని ఎవరైనా ఆక్రమించుకుంటే ఆయా శాఖల నుంచి నోటీసులు రావడం మామూలే. అయితే ఎవరైతే సదరు స్థలాన్ని ఆక్రమించి ఉంటారో వారికి నోటీసులు అందుతుంటాయి. అయితే మధ్యప్రదేశ్ రైల్వే శాఖ ఇచ్చిన ఒక వింత నోటీసు ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. ఆక్రమిత భూమిలో హనుమంతుడి ఆలయం ఉండగా, వెంటనే స్థలం ఖాళీ చేయాలని ఏకంగా ఆంజనేయ స్వామి పేరిట రైల్వే శాఖ అధికారులు నోటీసులు జారీ చేశారు. మీరు ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించారని.. వెంటనే ఖాళీ చేయకపోతే తగిన చర్యలు తీసుకుంటామంటూ.. దేవుడి పేరిట నోటీసులు అందజేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

మొరెనా జిల్లాలో సబల్గర్ ప్రాంతంలో ప్రస్తుతం రైల్వే బ్రాడ్ గేజ్ పనులు జరుగుతున్నాయి. అయితే పనులు జరుగుతున్న ప్రాంతానికి సమీపంలో ఒక హనుమంతుడి ఆలయం ఉండగా, ఆ ఆలయం ఉన్న స్థలం కూడా రైల్వేకు చెందినదని అధికారులు గుర్తించారు. దీంతో ప్రభుత్వ స్థలంలో నిర్మించిన ఆలయాన్ని వెంటనే తొలగించాలని రైల్వే శాఖ అధికారులు హనుమంతుడి పేరిట ఒక నోటీసు జారీ చేశారు.

ఒకవేళ రైల్వే స్థలం నుంచి ఆలయాన్ని తొలగించకపోతే ఆలయం కూల్చివేత, ఆ స్థలం పునరుద్ధరణకు అయ్యే ఖర్చులను సైతం మీ నుంచే వసూలు చేస్తామంటూ అధికారులు ఆ నోటీసులో పేర్కొన్నారు.

అయితే రైల్వేకు చెందిన స్థలంలో గుడి నిర్మిస్తే ఆలయాన్ని నిర్మించిన వారికి నోటీసులు జారీచేస్తారు కానీ.. స్వామి వారికి నోటీసులు జారీ చేయడం ఏంటని స్థానికుల నుంచి విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ విషయమై రైల్వే అధికారి మనోజ్ కుమార్ వివరణ ఇచ్చారు. పొరపాటున స్వామివారి పేరిట నోటీసులు జారీ చేశామని, దానిని రద్దు చేసి కొత్తగా ఆలయ నిర్వాహకులకు నోటీసు జారీ చేస్తామని ఆయన తెలిపారు.

Tags:    
Advertisement

Similar News