కాంగ్రెస్ అధ్యక్ష పదవిపై రాహుల్ మనసు మారిందా..?

ఇన్నాళ్లూ కాంగ్రెస్ అధ్యక్ష పదవి నాకు వద్దు అన్నారు రాహుల్ గాంధీ. కానీ ఇప్పుడు నాకు క్లారిటీ ఉంది, ఆరోజే అసలు విషయం తెలుస్తుందని ట్విస్ట్ ఇచ్చారు.

Advertisement
Update: 2022-09-09 11:28 GMT

రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్ష పదవి చేపడతారా లేదా..? గతంలో ఓటమి వైరాగ్యంతో ఆ పదవి తనకు వద్దన్న ఆయన, ఇప్పటి వరకూ అదే పంథాలో ఉన్నారు. తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియా కాలం నెట్టుకొస్తున్నా 2024 ఎన్నికలు తరుముకొస్తున్న వేళ ఇప్పుడు కాంగ్రెస్ కి అధినాయకుడి అవసరం తప్పనిసరి అయ్యింది. అదే సమయంలో కాంగ్రెస్ జోడో యాత్ర అంటూ దేశవ్యాప్తంగా రాహుల్ పర్యటన మొదలు పెట్టారు. పార్టీని పైకి తీసుకురావాలన్న కసి ఆయనలో కనిపిస్తున్నా, కాంగ్రెస్ అధ్యక్ష పదవిని ఆయన ఎందుకు వద్దంటున్నారనే ప్రశ్న కూడా వేధిస్తూనే ఉంది.

సీనియర్లు ఒక్కొక్కరే పార్టీని వీడుతూ రాహుల్‌ని టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు. ప్రస్తుతం జోడో యాత్రలో ఉన్న రాహుల్ కి పార్టీ పగ్గాలను ఎప్పుడు చేప‌డతార‌నే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. తాజాగా ఈ ప్రశ్నలకు ఆసక్తికర సమాధానమిచ్చారాయన. ''నేను కాంగ్రెస్ అధ్యక్షుడిని అవుతానా లేదా అనేది పార్టీలో ఎన్నికలు జరిగినప్పుడు స్పష్టంగా తెలుస్తుంది. ఏం చేయాలనే విషయంపై ఇప్పటికే నేను ఓ నిర్ణయానికి వచ్చాను. అందులో ఎలాంటి గందరగోళం లేదు'' అని చెప్పారు. అంటే తాను అధ్యక్ష పదవి చేపట్టను అని స్పష్టంగా చెప్పలేదు, అలాగని తానే అధ్యక్షుడిని అవుతానని కూడా అనలేదు. ఎన్నికలు జరగనివ్వండి అంటూ దాటవేశారు. గతంలో తనకు అసలా పదవి వద్దంటే వద్దని చెబుతూ వచ్చిన రాహుల్, ఇప్పుడిలా నర్మగర్భంగా వ్యాఖ్యలు చేసేసరికి కాంగ్రెస్ శ్రేణుల్లో ఎక్కడో చిన్న ఆశ మిణుకు మిణుకు మంటోంది.

అందమైన దేశంలో ఈ మూడు నెలల యాత్ర ద్వారా పరిస్థితులను అర్థం చేసుకోవ‌డానికి తనకో అవకాశం దొరుకుతుందని అంటున్న రాహుల్, కొన్ని విషయాలపై పూర్తిస్థాయి అవగాహనతో సమర్థంగా రాటుదేలగలను అని అంటున్నారు.

సెప్టెంబర్ 30న ఏం జరుగుతుంది..?

భారత జాతీయ కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికలకు నవంబర్ 17న పోలింగ్ జరుగుతుంది. రెండు రోజుల తర్వాత కౌంటింగ్‌ అనేది కేవలం నామమాత్రమే. రాహుల్ పోటీ చేస్తే ఏకగ్రీవం అవుతుంది, ఇంకెవరైనా పోటీలో ఉంటే, అధిష్టానం సూచించినవారిదే పైచేయి అవుతుంది. అంటే కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లోరాహుల్ బరిలో ఉంటారా, ఉండరా అనేది సెప్టెంబర్‌ 30న నామినేషన్ల ప్రక్రియ ముగిసేరోజు తేలిపోతుంది.

Tags:    
Advertisement

Similar News