ఢిల్లీలో డ్రోన్లు నిషేధం.. ఎప్పటివరకంటే..?

ఉగ్రముప్పుపై సమాచారం అందడంతో పోలీసులు అన్నిరకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా డ్రోన్లపై తాత్కాలిక నిషేధం విధించారు.

Advertisement
Update: 2023-07-22 06:18 GMT

దేశ రాజధాని ఢిల్లీలో డ్రోన్ల వాడకంపై నిషేధం విధించారు. ఈరోజు నుంచి డ్రోన్లు ఎగరేయడం అక్కడ నిషేధం. ఈ ఆంక్షలు ఆగస్ట్ 16వరకు అమలులో ఉంటాయి. ఎవరైనా, ఎక్కడైనా డ్రోన్లు వినియోగించినట్టు తెలిసినా, వాటిని ఎగురవేసినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు పోలీసులు. ఢిల్లీ పోలీస్ కమిషనర్ సంజయ్ అరోరా ఈమేరకు ఉత్తర్వులు జారీ చేశారు.

ఎందుకంటే..?

సహజంగా డ్రోన్లు ఎగరేయడంపై ఆంక్షలుంటాయి కానీ, ఇలా పూర్తిగా నిషేధం ఎప్పుడూ విధించలేదు. కానీ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఆగస్ట్ 16 వరకు ఈ నిషేధం తప్పదని అంటున్నారు పోలీసులు. పారాగ్లైడర్లు, పారా-మోటార్ల ద్వారా నేరస్థులు, సంఘవిద్రోహశక్తులు, ఉగ్రవాదులు.. విధ్వంసం సృష్టించే అవకాశముందని నిఘా వర్గాలు హెచ్చరించడంతో పోలీసులు ముందు జాగ్రత్తలు తీసుకున్నారు. హ్యాంగ్-గ్లైడర్‌ లు, డ్రోన్లు, రిమోట్ ఆపరేటెడ్ ఎయిర్‌క్రాఫ్ట్, హాట్ ఎయిర్ బెలూన్లు, చిన్న సైజు పవర్డ్ ఎయిర్‌ క్రాఫ్ట్ లను నిషేధిస్తున్నట్టు తెలిపారు.

స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఢిల్లీలో పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు. నేటినుంచి ఆగస్టు 16 వరకు దేశ రాజధానిలో ఆంక్షలు అమలు చేస్తున్నారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఉగ్రముప్పుపై సమాచారం అందడంతో పోలీసులు అన్నిరకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా డ్రోన్లపై తాత్కాలిక నిషేధం విధించారు. 26రోజులపాటు ఆంక్షలు తప్పవని ఆదేశాలు విడుదల చేశారు. 

Tags:    
Advertisement

Similar News