'అన్నపూరణి' వివాదంపై ప్రజలకు నయనతార క్షమాపణ

'అన్నపూరణి' మూవీ శ్రీరాముడిని కించపరిచేలా ఉందని శివసేన నాయకుడు రమేష్ సోలంకి కొద్ది రోజుల కిందట ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Advertisement
Update: 2024-01-19 09:02 GMT

లేడీ సూపర్ స్టార్ నయనతార నటించిన తాజా చిత్రం 'అన్నపూరణి'ని పలు వివాదాలు చుట్టుముట్టిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 1వ తేదీన పలు భాషల్లో విడుదలైన ఈ సినిమా హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఉందని ఆరోపణలు వచ్చాయి. ఈ విషయమై నయనతారపై కేసు కూడా నమోదైన నేపథ్యంలో ఆమె ప్రజలకు క్షమాపణ చెప్పారు. నయనతార 75వ చిత్రంగా తెరకెక్కిన సినిమా అన్నపూరణి. దీనికి నీలేష్ కృష్ణ దర్శకత్వం వహించాడు. డిసెంబర్ 1న విడుదలైన ఈ సినిమాపై తీవ్ర విమర్శలు వచ్చాయి. 'అన్నపూరణి' మూవీ శ్రీరాముడిని కించపరిచేలా ఉందని శివసేన నాయకుడు రమేష్ సోలంకి కొద్ది రోజుల కిందట ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

'అన్నపూరణి'లోని కొన్ని సన్నివేశాలు హిందువుల మతపరమైన మనోభావాలను కించపరిచేలా ఉన్నాయని, ఈ సినిమా లవ్ జిహాద్ ను ప్రోత్సహించేలా ఉందని ఆయన ఆరోపించారు. రమేష్ ఫిర్యాదుతో నయనతారపై కేసు నమోదయింది. ఈ నేపథ్యంలో ఈ సినిమాను స్ట్రీమింగ్ చేస్తున్న నెట్ ఫ్లిక్స్ సంస్థ తాజాగా ఆన్‌లైన్‌లో నుంచి తొలగించింది.

ఈ వివాదాల నేపథ్యంలో నయనతార ప్రజలకు క్షమాపణ చెప్పింది. తన ఇన్ స్టా గ్రామ్ పేజీలో ఓం సింబల్, జైశ్రీరామ్ అంటూ రాసి ఒక లేఖ విడుదల చేసింది. 'అన్నపూరణి సినిమాను కేవలం కమర్షియల్ ప్రయోజనాల కోసం కాకుండా ప్రజల్లోకి ఓ మంచి ఆలోచనను తీసుకెళ్లడానికి తీశాం. దృఢ సంకల్పంతో పోరాడితే ఏదైనా సాధించొచ్చు.. అని చెప్పేందుకు ఈ మూవీని చేశాం. 'అన్నపూరణి' సినిమాతో ప్రజలకు సానుకూల సందేశాన్ని ఇవ్వాలని మేం భావిస్తే.. అది మాకు తెలియకుండానే కొందరి మనసులను గాయపరిచింది.

ఈ సినిమా ద్వారా ఎవరి మనోభావాలను దెబ్బతీసే ఉద్దేశం నాకు గానీ నా టీమ్ కు గానీ లేదు. నాకు భగవంతుడిపై ఎంతో నమ్మకం ఉంది. అన్ని ప్రార్థనా స్థలాలను సందర్శించే నేను ఉద్దేశపూర్వకంగా ఇలాంటి పని చేయలేదు. నా సినిమా ద్వారా ఎవరి మనోభావాలు అయినా గాయపరిచి ఉంటే నన్ను క్షమించండి.' అంటూ నయనతార ఆ లేఖ ద్వారా కోరింది.

Tags:    
Advertisement

Similar News