మాజీ ఎంపీ, సినీనటి జయప్రదకు హైకోర్టు షాక్‌

గతంలో ఈ పిటిషన్‌ను విచారించిన న్యాయమూర్తి.. ఈఎస్‌ఐకి చెల్లించాల్సిన రూ.37.68 లక్షలు చెల్లించడం కుదురుతుందా.. లేదా..? అనే విషయంపై జయప్రద వివరణ ఇవ్వాలని ఆదేశించారు.

Advertisement
Update: 2023-10-21 02:06 GMT

మాజీ ఎంపీ, సినీ నటి జయప్రదకు మద్రాసు హైకోర్టులో చుక్కెదురైంది. ఓ కేసులో ఎగ్మూర్‌ కోర్టు తనకు విధించిన జైలుశిక్షను రద్దు చేయాలని కోరుతూ ఆమె దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. శుక్రవారం జయప్రద అప్పీల్‌పై విచారణ జరిపిన ధర్మాసనం.. ఆమె 15 రోజుల్లో కోర్టులో లొంగిపోవాలని, రూ.20 లక్షలు డిపాజిట్‌ చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది.

అసలేం జరిగిందంటే.. జయప్రద చెన్నైకి చెందిన రామ్‌కుమార్, రాజాబాబులతో కలిసి అన్నాసాలైలో ఓ సినిమా థియేటర్‌ నడిపారు. అందులో సిబ్బందికి ఈఎస్‌ఐ చెల్లింపుల్లో అవకతవకలకు పాల్పడ్డారని ఎగ్మూర్‌ కోర్టులో కేసు దాఖలైంది. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు జయప్రద సహా ముగ్గురికి 6 నెలల జైలు శిక్ష, రూ.5 వేల జరిమానా చొప్పున విధిస్తూ ఈ ఏడాది ఆగస్టులో తీర్పునిచ్చింది.

దీనిపై జయప్రద మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. తనకు విధించిన జైలుశిక్షను రద్దు చేయాలని తన పిటిషన్‌లో కోరారు. గతంలో ఈ పిటిషన్‌ను విచారించిన న్యాయమూర్తి.. ఈఎస్‌ఐకి చెల్లించాల్సిన రూ.37.68 లక్షలు చెల్లించడం కుదురుతుందా.. లేదా..? అనే విషయంపై జయప్రద వివరణ ఇవ్వాలని ఆదేశించారు. రూ.20 లక్షలు చెల్లిస్తామని జయప్రద కోర్టుకు విన్నవించగా, దీనిని ఈఎస్‌ఐ తరఫు న్యాయవాది వ్యతిరేకించారు. అనంతరం ఈ అంశంపై ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి శుక్రవారం తీర్పు వెలువరించారు. జయప్రద తదితరులు దాఖలు చేసిన అప్పీల్‌ను కొట్టివేశారు.

Tags:    
Advertisement

Similar News