మణిపూర్ లో బీజేపీకి మిత్రపక్షం షాక్

మణిపూర్‌ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఈ నెల 21నుంచి మొదలవుతాయని షెడ్యూల్ విడుదలైంది. అయితే ఇంఫాల్ లోని అసెంబ్లీకి వెళ్లేందుకు కుకీ, నాగా తెగల ఎమ్మెల్యేలు భయపడుతున్నారు.

Advertisement
Update: 2023-08-07 01:22 GMT

మణిపూర్ లో బీజేపీ మిత్రపక్షం కుకీ పీపుల్స్ అలయన్స్(KPA) పార్టీ, ప్రభుత్వం నుంచి వైదొలగింది. మూడు నెలలుగా హింసాత్మక సంఘటనలు జరుగుతున్నా.. ప్రభుత్వం వాటిని నియంత్రించడంలో విఫలమైందని ఆరోపిస్తూ ఆ పార్టీ ఎమ్మెల్యేలు ప్రభుత్వం నుంచి బయటకు వస్తున్నట్టు ప్రకటించారు. ఈమేరకు KPA అధ్యక్షుడు తోంగ్ మాంగ్ హాకిప్.. గవర్నర్ కు లేఖ రాశారు. బీజేపీకి తమ మద్దతు ఉపసంహరించుకుంటున్నట్టు తెలిపారు.

KPA మద్దతు ఉపసంహరించుకున్నంత మాత్రాన బీజేపీకి వచ్చిన నష్టమేమీ లేదు. ఆ మాటకొస్తే మణిపూర్ లో అసలు మిత్రపక్షాల మద్దతు లేకుండా ఒంటరిగానే బీజేపీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగల బలం ఉంది. 60 సీట్ల మణిపూర్ అసెంబ్లీలో బీజేపీకి సొంతగా 37మంది ఎమ్మెల్యేల బలం ఉంది. కానీ NPP, NPF, KPA వంటి మిత్రపక్షాలతోపాటు ముగ్గురు ఇండిపెండెంట్లను కూడా తమవైపు తిప్పుకుంది బీజేపీ. ఇందులో ఇప్పుడు ఇద్దరు ఎమ్మెల్యేల కుకీ పీపుల్స్ అలయెన్స్ దూరమైంది. భవిష్యత్తులో బీజేపీకి ఇది పెద్ద ఎదురుదెబ్బే అని చెప్పాలి.

గతేడాది జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించగా, బీరేన్ సింగ్ తిరిగి సీఎం అయ్యారు. కానీ వచ్చేసారి బీజేపీకి సానుకూల పరిస్థితులు ఉండవని తెలుస్తోంది. పైగా మిత్రపక్షాలు కూడా పూర్తిగా దూరమయ్యే అవకాశాలున్నాయి.

అసెంబ్లీ జరుగుతుందా..?

మణిపూర్‌ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఈ నెల 21నుంచి మొదలవుతాయని షెడ్యూల్ విడుదలైంది. అయితే ఇంఫాల్ లోని అసెంబ్లీకి వెళ్లేందుకు కుకీ, నాగా తెగల ఎమ్మెల్యేలు భయపడుతున్నారు. దాడులు జరుగుతాయనే హెచ్చరికల నేపథ్యంలో వారు ఇంఫాల్ వెళ్లలేమని తెగేసి చెబుతున్నారు. ఇటు శాంతి భద్రతలు నాశనం అయ్యాయి, అటు పాలనాపరమైన నిర్ణయాలు తీసుకోడానికి అసెంబ్లీని సమావేశ పరిచేందుకు కూడా అవకాశం లేదు. అందరి వేళ్లూ బీజేపీనే ముద్దాయిగా చూపిస్తున్నాయి. బీజేపీతో ఉంటే రాజకీయంగా నష్టం జరిగే అవకాశం ఉండటంతో మిత్రపక్షాలు దూరమవుతున్నాయి. 

Tags:    
Advertisement

Similar News