ఆయన రాజకీయాల్లోకి రాకపోవడం బాధించింది - రజనీ సతీమణి కీలక వ్యాఖ్యలు

రజనీకాంత్ రాజకీయాల్లోకి రాకపోవడంపై ఆయన సతీమణి లత కీలక వ్యాఖ్యలు చేశారు. రజనీ రాజకీయాల్లోకి అడుగుపెట్టకపోవడం తనను ఎంతో బాధించినట్లు తెలిపారు.

Advertisement
Update: 2023-12-28 09:24 GMT

సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి రాకపోవడం తనను ఎంతో బాధించిందని ఆయన సతీమణి లత వ్యాఖ్యానించారు. రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాలని తమిళనాడులోని ఆయన అభిమానులు దశాబ్దాలుగా కోరుతూ వచ్చారు. రాజకీయాల్లోకి రావాలన్న ఆసక్తి తనకూ ఉందని పలుమార్లు రజనీకాంత్ వెల్లడించారు. అయినప్పటికీ పార్టీ ఏర్పాటుకు ఆయన ముందుకు రాలేదు. ఎట్టకేలకు తమిళనాడులో గత ఎన్నికలకు ముందు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నట్లు రజనీ ప్రకటించారు.

'రజనీ మక్కల్ మండ్రం' అనే వేదికను ఏర్పాటు చేసి అభిమానులు, అభిమాన సంఘాల నాయకులతో వరుసగా సమావేశాలు నిర్వహించారు. పార్టీ ఏర్పాటుకు తేదీ కూడా నిర్ణయించారు. ఇక రజనీ రాజకీయాల్లోకి రావడం ఖాయం అనుకున్న తరుణంలో ఏం జరిగిందో తెలియదు కానీ, అనూహ్యంగా తాను రాజకీయాల్లోకి రావడం లేదని ప్రకటించారు. అనారోగ్య సమస్యల కారణంగానే పార్టీ ఏర్పాటుకు వెనకడుగు వేస్తున్నట్లు ఆయన చెప్పారు. పైకి అనారోగ్య సమస్యలు అని రజనీ చెప్పినప్పటికీ ఇతర కారణాల వల్లే ఆయన రాజకీయాల్లోకి రాలేదని అప్పట్లో వార్తలు వినిపించాయి.

తాజాగా రజనీకాంత్ రాజకీయాల్లోకి రాకపోవడంపై ఆయన సతీమణి లత కీలక వ్యాఖ్యలు చేశారు. రజనీ రాజకీయాల్లోకి అడుగుపెట్టకపోవడం తనను ఎంతో బాధించినట్లు తెలిపారు. ఆయనలో నిజమైన నాయకుడిని చూశానని, బలమైన కారణంతోనే ఆయన రాజకీయాల్లోకి అడుగుపెట్టలేదని చెప్పారు. ప్రస్తుతం తమిళనాడులో ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఆయన రాజకీయాల్లో ఉండి ఉంటే సూపర్ పవర్‌గా ఎదిగేవారని ఆమె వ్యాఖ్యానించారు. ర‌జ‌నీకాంత్ భార్య చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

తమిళనాడులో అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మరణం తర్వాత రాష్ట్రంలో రాజకీయ శూన్యత ఏర్పడింది. స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే పార్టీకి అక్కడ పోటీ కనపడడం లేదు. అన్నాడీఎంకేను దక్కించుకునేందుకు ఆ పార్టీ నాయకులు పన్నీర్ సెల్వం, పళని స్వామి రెండు వర్గాలుగా విడిపోయి కోర్టుల చుట్టూ తిరగడంతో.. అక్కడ అన్నాడీఎంకే బలహీన పడింది. ఇప్పుడు కనుక రజనీకాంత్ పార్టీ ఉండి ఉంటే బలమైన పార్టీగా ఎదిగి ఉండేదని ఆయన అభిమానులు వాపోతున్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలోనే రజనీకాంత్ సతీమణి ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.

Tags:    
Advertisement

Similar News