హిందూ సమాజం యుద్ధంలో ఉంది, ప్రజలు దూకుడుగా ఉండటం సహజం: ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్

ఆరెస్సెస్ అధికార పత్రిక ఆర్గనైజర్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మోహన్ భగవత్ , “హిందూ సమాజం 1000 సంవత్సరాలకు పైగా యుద్ధంలో ఉంది. ఈ పోరాటం విదేశీ దురాక్రమణలు, విదేశీ ప్రభావం, విదేశీ కుట్రలకు వ్యతిరేకంగా కొనసాగుతోంది. సంఘ్ ఈ పోరాటానికి తన మద్దతును అందించింది.'' అని చెప్పారు.

Advertisement
Update: 2023-01-11 07:11 GMT

దేశంలో గత కొన్ని సంవత్సరాలుగా మతపరమైన ఘర్షణలు, ఆందోళనకరమైన వాతావరణం పెరుగుతున్న నేపథ్యంలో ఆ పరిస్థితి అత్యంత సహజమని, అది జరగవల్సిన పరిణామమే అని ఆరెస్సెస్ ఛీఫ్ మోహన్ భగవత్ అన్నారు.

ఆరెస్సెస్ అధికార పత్రిక ఆర్గనైజర్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన, “హిందూ సమాజం 1000 సంవత్సరాలకు పైగా యుద్ధంలో ఉంది. ఈ పోరాటం విదేశీ దురాక్రమణలు, విదేశీ ప్రభావం, విదేశీ కుట్రలకు వ్యతిరేకంగా కొనసాగుతోంది. సంఘ్ ఈ పోరాటానికి తన మద్దతును అందించింది. దాని గురించి చాలామంది హిందూ సమాజాన్ని చైతన్యం చేస్తున్నారు. వీటన్నింటి వల్లనే హిందూ సమాజం మేల్కొంది. యుద్ధంలో ఉన్న వ్యక్తులు దూకుడుగా ఉండటం సహజం." అన్నారు.

"నీరసంగా ఉండకుండా పోరాడాలి" అని భగవద్గీతలోని శ్లోకాలను ఉదహరించారు భగవత్. “భగవద్గీతలో చెప్పినట్లు, 'యుద్ధస్య విగత్ జ్వర్' నీరసంగా ఉండకుండా పోరాడండి. ఈ సూత్రాన్ని పాటించడం అందరికీ సాధ్యం కాదు. అయితే సంఘ్ నాయకులు ప్రజలను మేల్కొలుపుతున్నారు. ఈ సామాజిక మేల్కొలుపు సంప్రదాయం చాలా పాతది. ఇది మొదటి ఆక్రమణదారుడైన అలెగ్జాండర్ మన సరిహద్దులకు వచ్చిన రోజున ప్రారంభమైంది. మనకిష్టం లేకపోయినా యుద్ధ సమయాల్లో అత్యుత్సాహం సహజంగా అని భగవంతుడు చెప్పాడు. "ఇది యుద్ధం కాబట్టి, ప్రజలు అత్యుత్సాహంతో ఉంటారు. రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తారు. ఇది అవాంఛనీయమైనది కాదు'' అని భగవత్ అన్నారు.

హిందూత్వ సాహిత్యంలో ప్రధాన ఇతివృత్తమైన “లోపల శత్రువు” గురించి భగవత్ ఇలా అన్నారు, “ఈ యుద్ధం లేని శత్రువుపై కాదు, లోపల ఉన్న శత్రువుపై. కాబట్టి హిందూ సమాజాన్ని, హిందూ ధర్మాన్ని, హిందూ సంస్కృతిని రక్షించడానికి యుద్ధం జరుగుతోంది. విదేశీ ఆక్రమణదారులు ఇప్పుడు ఇక్కడ లేరు, కానీ విదేశీ ప్రభావం, విదేశీ కుట్రలు కొనసాగుతున్నాయి.

భారతదేశంలో నివసిస్తున్న ముస్లింల గురించి మాట్లాడుతూ భగవత్, బలవంతపు మతమార్పిడులు, అక్రమ వలసల గురించి చెప్పారు.: “ హిందూస్థాన్ హిందూస్థానంగా ఉండాలి. నేడు భారత్‌లో నివసిస్తున్న ముస్లింలకు ఎలాంటి హానీ లేదు. వారు తమ విశ్వాసానికి కట్టుబడి ఉండాలనుకుంటే, వారు ఉండొచ్చు. వారు తమ పూర్వీకుల విశ్వాసానికి తిరిగి రావాలనుకుంటే, వారు రావచ్చు. ఇది పూర్తిగా వారి ఇష్టాఇష్టాలపై ఆధారపడి ఉంటుంది. హిందువులలో అంత మొండితనం లేదు. ముస్లింలు భయపడాల్సిన పనిలేదు. అయితే అదే సమయంలో, ముస్లింలు తమ ఆధిపత్యపు వాక్చాతుర్యాన్ని విడిచిపెట్టాలి. జనాభా అసమతుల్యత ఒక ముఖ్యమైన ప్రశ్న. మనం దాని గురించి ఆలోచించవలసి ఉంటుంది. ఇది జనన రేటు గురించిన ప్రశ్న మాత్రమే కాదు. మతమార్పిడులు, అక్రమ వలసలు అసమతుల్యతకు ప్రధాన కారణం. దీన్ని నిరోధించడం వల్లనే సమతుల్యత పునరుద్ధరించగలం.'' అని భగవత్ అభిప్రాయపడ్డారు.

"LGBT" గురించి మాట్లాడుతూ, మీడియా చాలా చిన్న విషయాలను పెద్దవిగా చేస్తుంది. "నియో-లెఫ్ట్ అని పిలవబడే వారు ఇటువంటి వాటిని లేవనెత్తుతారు". ఎప్పటిలాగే ఎక్కువ శ్రమ లేకుండా వాటిని ఎదుర్కోవటానికి మన సంప్రదాయంలో నుండి మార్గాలు కనుక్కోవాలి. జంతు ప్రపంచంలో కూడా ఇలాంటివి ఉంటాయి. మేము దీన్ని ఎదుర్కోవాలి, కానీ దీని గురించి మాకు పెద్దగా గొడవ‌ అవసరం లేదు. ” అని భవత్ చెప్పారు.

ఇక భగవత్ చెప్తున్న ఈ దూకుడు ఫలితం నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) డేటా మనకు అర్దం చేయిస్తుంది. 2017, 2021 మధ్య భారతదేశంలో 2,900 మతపరమైన అల్లర్లకు సంబంధించి కేసులు నమోదయ్యాయని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ గత నెలలో పార్లమెంటుకు తెలిపారు. 2021, 2020లో 857, 2019లో 438, 2018లో 512 మరియు 2017లో 723. మతపర అల్లర్ల కేసులు నమోదయ్యాయి. 

Tags:    
Advertisement

Similar News