ఎయిర్ ఇండియాకు రూ.30లక్షలు జరిమానా..

Air India fined 30 lakhs:ఎయిర్ ఇండియా సంస్థపై డీజీసీఏ విధించిన జరిమానా ఇప్పుడు సంచలనంగా మారింది. ఆ ఘటనలో తమ తప్పేమీ లేదని ఎయిర్ ఇండియా వాదిస్తున్నా డీజీసీఏ మాత్రం జరిమానా విధించింది. పైలట్ పై కూడా చర్యలు తీసుకుంది.

Advertisement
Update: 2023-01-20 11:41 GMT

న్యూయార్క్ నుంచి ఢిల్లీ వచ్చిన ఎయిర్ ఇండియా ఫ్లైట్ లో ఓ ప్రయాణికురాలిపై తోటి ప్రయాణికుడు మూత్రవిసర్జన చేసిన ఘటనపై డీజీసీఏ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై విచారణ జరిపిన అనంతరం చర్యలు చేపట్టింది. ఎయిరిండియాకు రూ.30 లక్షలు జరిమానా విధించింది. ఈ విషయంలో పైలెట్ నిర్లక్ష్యం కూడా ఉందని, అతని లైసెన్స్ ను మూడు నెలలపాటు సస్పెండ్ చేసింది. ఎయిరిండియా డైరెక్టర్ కు రూ. 3 లక్షలు జరిమానా విధించింది.

మరోవైపు ఈ ఘటనపై సివిల్ పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నారు. విమానంలో మహిళపై మూత్ర విసర్జన చేసిన తర్వాత ఆ వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నిందితుడు శంకర్ మిశ్రా పారిపోయాడు. చాలా రోజులపాటు తప్పించుకు తిరిగాడు.


ఆ తర్వతా అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. తాను మూత్ర విసర్జన చేయలేదని, ఆ మహిళే మూత్రవిసర్జన చేసిందని, తనపై తప్పుడు ఆరోపణలు చేస్తోందని వాదించాడు మిశ్రా. కానీ బాధిత మహిళ సాక్ష్యాన్ని పరిగణలోకి తీసుకుని అతడిపై చర్యలు తీసుకున్నారు. ఈ గొడవ బయటకు రాగానే శంకర్ మిశ్రాపై 30 రోజులపాటు ప్రయాణ నిషేధాన్ని విధించింది ఎయిర్ ఇండియా. ఇప్పుడు అదనంగా మలో 4నెలలపాటు అతడిపై నిషేధాన్ని పొడిగించింది.

ఈ ఘటన తర్వాత విమాన ప్రయాణాల్లో జరిగే వ్యవహారాలపై ప్రయాణికుల వికృత చేష్టలపై డీజీసీఏ దృష్టి సారించింది. కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. పైలట్లు, ఇతర సిబ్బంది కూడా అప్రమత్తంగా ఉండాలని, అల్లరిచేసే వారిని, ఉద్దేశపూర్వకంగా తోటి ప్రయాణికులను ఇబ్బంది పెట్టేవారి విషయంలో కచ్చితంగా ఫిర్యాదులు చేయాలని సూచించింది. అలాంటి వారిపై సదరు విమానయాన సంస్థ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరింది. మొత్తమ్మీద ఎయిర్ ఇండియా సంస్థపై డీజీసీఏ విధించిన జరిమానా ఇప్పుడు సంచలనంగా మారింది. ఆ ఘటనలో తమ తప్పేమీ లేదని ఎయిర్ ఇండియా వాదిస్తున్నా డీజీసీఏ మాత్రం జరిమానా విధించింది. పైలట్ పై కూడా చర్యలు తీసుకుంది. 

Tags:    
Advertisement

Similar News