CAA వెనుక బీజేపీ కుట్ర బయటపెట్టిన కేజ్రీవాల్

మన దేశ అభివృద్ధికి ఉపయోగించాల్సిన ప్రభుత్వ డబ్బును పాకిస్తానీయుల కోసం కేంద్రం ఖర్చు చేయబోతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు కేజ్రీవాల్.

Advertisement
Update: 2024-03-13 13:11 GMT

పౌరసత్వ సవరణ చట్టం (CAA) అమలుపై ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఎన్నికలకు ముందు ఓటు బ్యాంకు రాజకీయాలే లక్ష్యంగా కేంద్రం CAAను అమల్లోకి తెచ్చిందన్నారు. పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌ నుంచి వచ్చిన వలసదారులకు పౌరసత్వం ఇచ్చి వారికి బీజేపీ బలహీనంగా ఉన్న నియోజకవర్గాల్లో ఆశ్రయం కల్పిస్తుందని ఆరోపించారు. దీనివల్ల భవిష్యత్‌లో బీజేపీకి ఓటు బ్యాంకు పెరుగుతుందన్నారు. వారి రాజకీయ ప్రయోజనాల కోసమే కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని మండిపడ్డారు కేజ్రీవాల్.

దేశంలో ఉన్న నిరుద్యోగం, ద్రవ్యోల్బణం సమస్యలు పరిష్కరించకుండా కేంద్రం CAA గురించి మాట్లాడుతోందన్నారు కేజ్రీవాల్. "2014కు ముందు భారత్‌కు వచ్చిన వారికి పౌరసత్వం ఇస్తామంటున్నారు. ఒకసారి తలుపులు తెరిస్తే మిగిలినవారు ఊరుకుంటారా?. పెద్ద సంఖ్యలో వలసదారులు భారతదేశంలోకి రావడం మొదలుపెడుతారు. 3 దేశాల్లో 3 కోట్లకుపైగా మైనారిటీలు నివసిస్తున్నారు. ఇందులో సగం మంది భారత్‌కు వచ్చినా, వారు ఎక్కడ ఉంటారు?. వాళ్లకు ఉద్యోగాలు ఎవరిస్తారు?. వలసదారులకు పౌరసత్వం ఇవ్వడం వల్ల మన యువతకు అందాల్సిన ఉద్యోగావకాశాలు వారికి దక్కుతాయి. వారికి ఉద్యోగాలు ఇస్తారు, ఇళ్లు కట్టిస్తారు. మరి మన దేశ పౌరుల పరిస్థితేంటి?" అని కేజ్రీవాల్ ప్రశ్నించారు.

మన దేశ అభివృద్ధికి ఉపయోగించాల్సిన ప్రభుత్వ డబ్బును పాకిస్తానీయుల కోసం కేంద్రం ఖర్చు చేయబోతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు కేజ్రీవాల్. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలు ప్రభావితం అయ్యే అవకాశముందన్నారు. ఇప్పటికే బంగ్లాదేశ్‌ నుంచి అక్రమ వలసదారులు రావడం వల్ల అస్సాం ప్రజల భాష, సంస్కృతి ఇబ్బందుల్లో పడ్డాయని ఆందోళన వ్యక్తంచేశారు.

Tags:    
Advertisement

Similar News