తాలిబన్ల దుర్మార్గం: నిరసన తెలుపుతున్న మహిళపై తుపాకీ మడమ‌లతో దాడి

ఆఫ్ఘనిస్తాన్ లో తమకు ఆహారం, పని, స్వేచ్చ కావాలంటూ నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్న మహిళలపై తాలిబన్లు దుర్మార్గంగా విరుచుకపడ్డారు. స్త్రీలను తరిమి తరిమి తుపాకీ మడమ‌లతో చావబాదారు.

Advertisement
Update: 2022-08-13 12:23 GMT

ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబన్లు మళ్ళీ ఒక సారి మహిళలపై విరుచుకపడ్డారు. గాలిలోకి కాల్పులు జరపడమే కాక పరిగెడుతున్న మహిళల వెంటపడి తుపాకీ మడమలతో దారుణంగా కొట్టారు.

తాలిబన్లు అధికారంలోకి వచ్చిన మొదటి వార్షికోత్సవానికి రెండు రోజుల ముందు శనివారంనాడు ఈ దాడి జరిగింది.40 మంది మహిళలు తమకు "రొట్టె, పని,స్వేచ్ఛ" కావాలని నినదిస్తూ కాబూల్‌లోని విద్యా మంత్రిత్వ శాఖ భవనం ముందు ధర్నా నిర్వహించారు. పని హక్కులతో పాటు మహిళలకు రాజకీయ భాగస్వామ్యాన్ని డిమాండ్ చేస్తూ "ఆగస్టు 15 బ్లాక్ డే" అని రాసి ఉన్న బ్యానర్‌ను నిరసనకారులు పట్టుకున్నారు. ''మేము ఈ అజ్ఞానులతో విసిగి పోయాము మాకు న్యాయంకావాలి'' అ‍ంటూ నినదించారు.

వాళ్ళలో చాలా మంది తాలిబన్ల ఆదేశాలను ధిక్కరించి బుర్ఖాలు గానీ హిజాబ్ లు కానీ లేకుండా నిరసన ప్రదర్శనల్లో పాల్గొన్నారు.

ఈ ప్రదర్శన జరుగుతుండగానే తుపాకులతో రంగ ప్రవేశం చేసిన తాలిబన్లు గాలి లోకి కాల్పులు జరిపారు. మహిళలను తరిమి తరిమి కొట్టారు. పారి పోతున్న మహిళల వెంటపడి మరీ తుపాకీమడమలతో బాదారు. చుట్టుపక్కల దుకాణాల్లో దాక్కున్న మహిళలను బైటికి లాక్కొచ్చి కొట్టారు. తాలిబన్లు అధికారంలోకి వచ్చాక మొదటి మహిళా ప్రొటెస్ట్ పై ఈ విధమైన దాడి చేసి తాలిబన్లు వాళ్ళు ఏంటో నిరూపించుకున్నారు.

గత సంవత్సరం ఆగస్టు 15 న అధికారంలోకి వచ్చాక తాలిబన్లు.... 1996 నుండి 2001 వరకు తమ పాలనలో ఉన్న కఠినమైన ఇస్లామిస్ట్ పాలన ఉండబోదని, స్త్రీలకు అన్ని హక్కులు కల్పిస్తామని వాగ్దానం చేశారు. అయితే ఆ వాగ్దానాన్ని వాళ్ళు నిలబెట్టుకోలేదు. పదివేల మందికి పైగా బాలికలు చదువుకునే సెకండరీ పాఠశాలలను మూసివేశారు, మహిళలను ప్రభుత్వ ఉద్యోగాల నుంచి తీసివేశారు. మహిళలకు ప్రభుత్వ ఉద్యోగాలను నిషేధించారు. ప్రైవేటు ఉద్యోగాలు చేసే మహిళలను కూడా అనేక రకాల వేధించారు. మహిళలు ఒంటరిగా ప్రయాణించడం నిషేధించారు.

మేలో, ఆఫ్ఘనిస్తాన్ సుప్రీం లీడర్, తాలిబాన్ చీఫ్ హిబతుల్లా అఖుండ్‌జాదా, మహిళలు తమ ముఖాలను పూర్తిగా కప్పుకోవాలని ఆదేశాలు జారీచేశాడు.

ఇంత నిర్బంధంలో కూడా 40 మంది మహిళలు ధైర్యంగా ప్రదర్శన నిర్వహించారంటే తాలిబన్ల పాలనతో వాళ్ళెంత విసిగిపోయారో అర్దమవుతోంది. ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించినవారిలో ఒకరైన ఝోలియా పార్సి మీడియాతో మాట్లాడుతూ, శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమపై తాలిబన్లు దుర్మార్గంగా దాడి చేశారని మండిపడ్డారు. బ్యానర్లను చించేశారని, తమ‌ వద్ద ఉన్న సెల్‌ఫోన్లను లాక్కున్నారని చెప్పారు.

Tags:    
Advertisement

Similar News