శ్రీలంకలో వాటర్ కేనన్లు ప్రయోగించిన పోలీసులు... షాంపూతో తలంటుకున్న నిరసనకారులు!

నిన్న విక్రమసింఘే జాఫ్నా యూనివర్సిటీ సందర్శ‌న‌కు రావాల్సి ఉంది. అయితే ఆయన పర్యటనకు నిరసనగా తమిళులు వందలాది మంది రోడ్లెక్కి ఆందోళనకు దిగారు. నిరసనకారులను తరిమికొట్టేందుకు, శ్రీలంక పోలీసులు వారిపై నీటి ఫిరంగులను ప్రయోగించారు.

Advertisement
Update: 2023-01-17 07:02 GMT

ప్రజలు తమ ఉద్యమాల్లో క్రియేటివిటీ చూపిస్తూ ఉంటారు. పాలకులు కొత్త నిర్బంద విధానాలు అవలంభిస్తూ ఉంటే ఉద్యమకారులు తమ ఉద్యమాల్లో కొత్త కొత్త పద్దతులు అనుసరిస్తూ ఉంటారు.

శ్రీలంకలో అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే పట్ల దేశ వ్యాప్తంగా వ్యతిరేకత ఉంది. గత ఏడాది తాము తమ నిరసనలతో దేశం విడిచివెళ్ళేట్టు చేసిన అప్పటి దేశాధ్యక్షుడు గొటబయ రాజపక్సేను మళ్ళీ దేశానికి తీసుక వచ్చిన విక్రమసింఘే అంటే ప్రజల్లో వ్యతిరేకత గూడు కట్టుకొని ఉంది. ఇప్పటికీ ఆయన ఎక్కడికి వెళ్ళినా నిరసనలు ఎదురవుతున్నాయి.

నిన్న విక్రమసింఘే జాఫ్నా యూనివర్సిటీ సందర్శ‌న‌కు రావాల్సి ఉంది. అయితే ఆయన పర్యటనకు నిరసనగా తమిళులు వందలాది మంది రోడ్లెక్కి ఆందోళనకు దిగారు. నిరసనకారులను తరిమికొట్టేందుకు, శ్రీలంక పోలీసులు వారిపై నీటి ఫిరంగులను ప్రయోగించారు. అయినప్పటికీ, పోలీసులను ధిక్కరించిన‌ నిరసనకారులు షాంపూని తీసి, తలపై స్ప్రే చేసుకొని వారి జుట్టును రుద్దుకున్నారు. తలంటుకోవడం కూడా ఒక నిరసన రూపంగా వారు ఎంచుకున్నారు.

ఈ నిరసనకు సంబంధించిన చిత్రాలను డాక్టర్ తుసియన్ నందకుమార్ అనే వ్యక్తి ట్విట్టర్‌లో షేర్ చేశారు. "ఈరోజు జాఫ్నాలో జరిగిన నిరసనల‌పై శ్రీలంక పోలీసులు వాటర్ ఫిరంగులు ప్రయోగించినప్పుడు.. తమిళులు షాంపూతో తలంటుకున్నారు" అని ఆ వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు.


ఎమ్మెల్యే నందకుమార్ షేర్ చేసిన మరో వీడియోలో, నల్లూరులో పోలీసులపై నిరసనకారులు ఆవు పేడ కలిపిన నీళ్లను చల్లారు. తమిళ్ గార్డియన్ కథనం ప్రకారం, ర్యాలీ చేస్తున్న ఆందోళనకారులను చెదరగొట్టేందుకు శ్రీలంక పోలీసులు నల్లూరు అరసాటి రోడ్-వైమన్ రోడ్ కూడలి వద్ద బారికేడ్లు ఏర్పాటు చేశారు. బారికేడ్లను దాటి వెళ్లేందుకు ప్రయత్నించిన ఆందోళనకారులపై పోలీసులు వాటర్‌ ఫిరంగులు ప్రయోగించారు.

మీడియా నివేదికల‌ ప్రకారం, దివాలా తీసిన శ్రీలంక ఇటీవల ప్రభుత్వ ఖర్చులో కోతలను ప్రకటించింది. భారీగా పన్నులను పెంచి ప్రజలపై భరించలేనంత భారాన్ని మోపింది. అయినప్పటికీ ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పెన్షన్‌లను చెల్లించడానికి కూడా ప్రభుత్వం దగ్గర తగినంత ఆదాయం లేదని నివేదికలు తెలిపాయి.

"ఈ సంవత్సరం ఆర్థిక సంక్షోభం తాము ఊహించిన దానికంటే దారుణంగా ఉండబోతోందని రాష్ట్రపతి నిన్న మంత్రివర్గానికి తెలియజేశారు" అని ప్రభుత్వ అధికార ప్రతినిధి బందుల గుణవర్దన విలేకరులతో అన్నారు.


Tags:    
Advertisement

Similar News