భారతదేశంలో అధికారులకు లంచాలు ఇవ్వడానికి నిధులు కేటాయించిన ఒరాకిల్ సంస్థ‌

ఒరాకిల్ సంస్థ తన వ్యాపారం కోసం భారతదేశం, టర్కీ, యూఏఈ ల‌లో పలువురికి లంచాలిచ్చినట్టు తేలింది. దాంతో ఆ సంస్థకు US సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ (SEC) 188 కోట్ల జరిమానా విధించింది.

Advertisement
Update: 2022-09-29 01:00 GMT

ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ (FCPA)ని ఉల్లంఘించినందుకు టెక్ దిగ్గజం ఒరాకిల్‌పై US సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ (SEC) 188 కోట్ల జరిమానా విధించింది. ఇండియా, టర్కీ, యుఎఇ ల‌లోని అధికారులకు లంచాలు ఇవ్వడం కోసం నిధులను కేటాయించినందుకు ఈ జరిమానా విధించబడింది.

"ఇండియా, టర్కీ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) లోని ఒరాకిల్ అనుబంధ సంస్థలు విదేశీ అవినీతి నిరోదక‌ చట్టం (FCPA) నిబంధనలను ఉల్లంఘించినందుకు ఒరాకిల్ కార్పొరేషన్ 188 కోట్ల జరిమానా చెల్లించాలని నిర్ణయించాము. 2016, 2019 మధ్య ఆయా దేశాల్లో తమ వ్యాపారం కోసం విదేశీ అధికారులకు లంచాలు ఇవ్వడానికి తమ‌ నిధులను ఉపయోగించారు" అని SEC మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది.

కాగా SEC నివేదిక ప్రకారం, ఒరాకిల్ ఇండియా విభాగం రైల్వే శాఖ కు చెందిన ఓ రవాణా సంస్థకు భారీ రాయితీ ఇచ్చింది. ఓ సాఫ్ట్ వేర్ కాంపోనెంట్ విషయంలో ఒప్పందం చేజారకుండా ఉండేందుకు ఈ రాయితీ ఇచ్చారు. దీనికి ఒరాకిల్ ఉన్నతాధికారుల అనుమ‌తి కూడా ఉంది. దీనిపై SEC అన్ని ఆధారాలు సేకరించింది. భారత్ లోని ఓ ఉద్యోగికి చెల్లించేందుకు 67 వేల డాలర్ల మొత్తం కేటాయించినట్టు రికార్డుల ద్వారా SEC గుర్తించింది.

కాగా SEC ఆరోపణలను ఒరాకిల్ సంస్థ అంగీకరించలేదు, తిరస్కరించలేదు. దాని గురించి స్పందించకుండానే జరిమానా చెల్లించడానికి మాత్రం అంగీకారం వ్యక్తం చేసింది.

Tags:    
Advertisement

Similar News