ప్లాస్టికోసిస్, ఇదో కొత్త వ్యాధి.. దీని గురించి తెలుసా..?

ఆస్ట్రేలియాలోని లార్డ్ హో ద్వీపంలో మృత్యువాత పడిన పక్షులను పరీక్షించిన తర్వాత ఈ విషయం బయటపడింది. పైకి ఆరోగ్యంగా కనపడుతున్నా.. రోజుల వ్యవధిలోనే పక్షులు మృతి చెందుతున్నాయి.

Advertisement
Update: 2023-03-06 03:22 GMT

కొత్త వ్యాధి అంటే, ఇదేదో కొత్త వైరస్ ద్వారా వచ్చింది అనుకోవద్దు. దీనికి కారణం వైరస్ కాదు, మన చుట్టూ ఉన్న ప్లాస్టిక్. అవును, ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల వచ్చే వ్యాధి ప్లాస్టికోసిస్. చిన్న చిన్న ప్లాస్టిక్ ముక్కలు కడుపులోకి వెళ్లి, జీర్ణ వ్యవస్థను దెబ్బతీయడమే ప్లాస్టికోసిస్ పర్యవసానం. దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లు ఉండవు, నేరుగా మరణమే సంభవిస్తుంది.

ఎవరికి వస్తుంది..?

ప్రస్తుతానికి ప్లాస్టికోసిస్ వ్యాధిని పక్షుల్లో కనుగొన్నారు శాస్త్రవేత్తలు. జలవనరులపై ఆధారపడి అక్కడి పురుగులు, చేపల్ని తిని బతికే పక్షుల్లో ఈ వ్యాధి లక్షణాలను కనిపెట్టారు. చేపల్ని తినడం ద్వారా, వాటి కడుపులో ఉండే ప్లాస్టిక్ ని కూడా పక్షులు ఆరగించేస్తున్నాయి. కానీ ఆ ప్లాస్టిక్ ముక్కల్ని పక్షులు జీర్ణించుకోలేకపోతున్నాయి. వాటి వల్ల జీర్ణ సమస్యలతో మృత్యువాత పడుతున్నాయి.

ఆస్ట్రేలియాలోని లార్డ్ హో ద్వీపంలో మృత్యువాత పడిన పక్షులను పరీక్షించిన తర్వాత ఈ విషయం బయటపడింది. పైకి ఆరోగ్యంగా కనపడుతున్నా.. రోజుల వ్యవధిలోనే పక్షులు మృతి చెందుతున్నాయి. యూకేలో కూడా ఇలాంటి లక్షణాలతోనే పక్షుల చనిపోతున్నాయి. దీన్ని కూడా ప్లాస్టికోసిస్ అంటున్నారు శాస్త్రవేత్తలు.

ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఏడాదీ 30మిలియన్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు సముద్రాల్లో కలుస్తున్నాయి. గత 20ఏళ్లలో ప్రపంచంలో ప్లాస్టిక్ ఉత్పత్తి, వినియోగం రెట్టింపు అయింది. ఇందులో 9శాతం మాత్రమే రీసైకిల్ అవుతోంది. 22శాతం మాత్రం ప్రకృతి వనరుల్లో కలసిపోతోంది. ఇది రీసైకిల్ కాదు, వేల సంవత్సరాలపాటు ప్రకృతిలోనే ఉంటుంది, చివరకు ప్రకృతినే నాశనం చేస్తోంది. ముందుగా ప్లాస్టికోసిస్ పక్షులను కబళిస్తోంది. భారత్ వంటి దేశాల్లో గ్రామాల్లో వదిలిపెట్టే ఆవులు ప్లాస్టిక్ వ్యర్థాలను తిని అస్వస్థతకు గురవుతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి లక్షణమే ఇప్పుడు యూకే, ఆస్ట్రేలియాలోని పక్షుల్లో కనపడుతోంది. మొత్తమ్మీద ప్లాస్టికోసిస్ ఇప్పుడు తీవ్ర సమస్యగా మారింది.

Tags:    
Advertisement

Similar News