షేక్ హసీనా ప్రధానిగా వద్దు.. రోడ్డెక్కిన లక్షలాది బంగ్లా ప్రజలు

బాంగ్లా దేశ్ లో శుక్రవారం భద్రతా బలగాలు బీఎన్పీ పార్టీ ప్రధాన కార్యాలయంలోకి ప్రవేశించి కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో బీఎన్పీకి చెందిన ఒక నేత మృతి చెందారు. దీంతో ప్రజల్లో, విపక్షాల్లో ప్రభుత్వం చేపట్టిన చర్యపై ఆగ్రహం పెల్లుబికింది. ప్రధానమంత్రి పదవికి షేక్ హసీనా రాజీనామా చేయాలని శనివారం ప్రజలు భారీ సంఖ్యలో రోడ్లపై చేరుకొని నిరసన వ్యక్తం చేశారు.

Advertisement
Update: 2022-12-10 15:08 GMT

షేక్ హసీనా ప్రధానమంత్రి పదవి నుంచి దిగిపోవాలని లక్షలాదిమంది బంగ్లాదేశ్ ప్రజలు రోడ్డెక్కారు. తక్షణం ఆమె పదవికి రాజీనామా చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. బంగ్లాదేశ్ లో ప్రస్తుతం షేక్ హసీనాపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. ఆమెకు వ్యతిరేకంగా ప్రజలు చేపట్టిన నిరసనలతో బంగ్లాదేశ్ అట్టుడికి పోతోంది. బంగ్లాదేశ్ లో కొన్ని నెలలుగా కరెంటు కోతలు తీవ్రమయ్యాయి. దీంతో పరిశ్రమలు నష్టాల్లో కూరుకుపోతున్నాయి. కరెంట్ సక్రమంగా ఉండకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు కూడా విపరీతంగా పెరిగిపోయాయి. ఈ కారణంగా కూరగాయలు, నిత్యావసరాల ధరలు భగ్గు మంటున్నాయి.

బంగ్లాదేశ్ లో ప్రస్తుతం ప్రజలు ఏమి కొనలేని, తినలేని పరిస్థితిలో ఉన్నారు. దీంతో ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొంది. ప్రధానిగా షేక్ హసీనా విఫలం అయ్యారని ప్రజలు భావిస్తున్నారు. ప్రధానమంత్రి పదవికి షేక్ హసీనా రాజీనామా చేసి దిగిపోవాలని ప్రజలు కొద్దిరోజులుగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు చేపడుతున్న నిరసన కార్యక్రమాలకు బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ (బీఎన్పీ) కూడా మద్దతు తెలుపుతోంది. కాగా ప్రజలకు బీఎన్పీ మద్దతు తెలపడంపై షేక్ హసీనా ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఇదిలా ఉండగా శుక్రవారం భద్రతా బలగాలు బీఎన్పీ పార్టీ ప్రధాన కార్యాలయంలోకి ప్రవేశించి కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో బీఎన్పీకి చెందిన ఒక నేత మృతి చెందారు. దీంతో ప్రజల్లో, విపక్షాల్లో ప్రభుత్వం చేపట్టిన చర్యపై ఆగ్రహం పెల్లుబికింది. ప్రధానమంత్రి పదవికి షేక్ హసీనా రాజీనామా చేయాలని శనివారం ప్రజలు భారీ సంఖ్యలో రోడ్లపై చేరుకొని నిరసన వ్యక్తం చేశారు. వారికి విపక్షాలు మద్దతు తెలిపాయి.

బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఇవాళ జరిగిన నిరసన కార్యక్రమాల్లో రెండు లక్షలకు మంది పైగా పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. కాగా బంగ్లాదేశ్ లో 2024 జనవరిలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ప్రజల్లో షేక్ హసీనాపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతున్న నేపథ్యంలో అప్పటివరకు ఆమె ప్రభుత్వం నడుస్తుందా.. లేదా.. అన్న సందేహాలు నెలకొన్నాయి. కాగా..2009 నుంచి ఎన్నికల్లో వరుస విజయాలు సాధిస్తూ వచ్చిన షేక్ హసీనా ఇప్పటివరకు ప్రధానమంత్రిగా కొనసాగుతున్నారు.

Tags:    
Advertisement

Similar News