మోదీ, జగన్, అదానీపై అమెరికాలో కోర్టుకెక్కిన లోకేష్..

భారత ప్రధాని నరేంద్రమోదీ, ఏపీ సీఎం జగన్, ప్రముఖ వ్యాపార వేత్త గౌతమ్ అదానీ, వరల్డ్ ఎకనామిక్ ఫోరం (WEF) అధ్యక్షుడు క్లాష్ ష్వాబ్ పై ఈ పిటిషన్ దాఖలు చేశారు డాక్టర్ లోకేష్.

Advertisement
Update: 2022-09-02 02:04 GMT

ఇదో విచిత్రమైన కేసు. భారత దేశంలో అవినీతి, పెగాసస్ స్పైవేర్ వాడకంపై అమెరికా కోర్టులో పిటిషన్ దాఖలైంది. కొలంబియా జిల్లా కోర్టులో భారత సంతతికి చెందిన డాక్టర్ వుయ్యూరు లోకేష్ ఈ పిటిషన్ వేశారు. భారత ప్రధాని నరేంద్రమోదీ, ఏపీ సీఎం జగన్, ప్రముఖ వ్యాపార వేత్త గౌతమ్ అదానీ, వరల్డ్ ఎకనామిక్ ఫోరం (WEF) అధ్యక్షుడు క్లాష్ ష్వాబ్ పై ఈ పిటిషన్ దాఖలు చేశారు డాక్టర్ లోకేష్.

రిచ్ మండ్ లో సెటిలైన భారత సంతతి గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ అయిన వుయ్యూరు లోకేష్ ఈ పిటిషన్ ద్వారా ఒక్కసారిగా సంచలన వ్యక్తిగా మారారు. కేవలం సంచలనం కోసమే ఆయన కోర్టుకెక్కినట్టు స్పష్టమవుతోంది. ఎలాంటి ప్రాథమిక ఆధారాలు లేకుండానే ఆయన కోర్టులో పిటిషన్ దాఖలు చేశారని అంటున్నారు న్యూయార్క్‌ లోని భారతీయ-అమెరికన్ అటార్నీ రవి బాత్రా. ఈ దావాలో పసలేదని చెబుతున్నారాయన. తనకు తానుగా పిటిషనర్ ఈ అవినీతికి సాక్షి కాదని, అదే సమయంలో ఆయన దావాను సమర్థించేవారు కూడా లేరని, ఈ కేసులో సాక్షులు, సాక్ష్యాలు కూడా లేవని చెబుతున్నారాయన. పనిలేని డాక్టర్ లోకేష్ సంచలనం కోసమే ఈ పిటిషన్ దాఖలు చేశారని వివరించారు. ఈ కేసుని పెద్దగా పట్టించుకోనవసరం లేదన్నారు.

సమన్లు జారీ..

సాక్షులు, సాక్ష్యాలు లేకపోయినా, పిటిషన్ దాఖలైంది కాబట్టి కొలంబియా జిల్లా కోర్టు మోదీ, జగన్, అదానీలకు సమన్లు జారీ చేసింది. మే 24న ఈ పిటిషన్ రిజిస్టర్ కాగా, జులై 22న కోర్టు సమన్లు జారీ చేసింది. ఆగస్ట్ 4న భారత్ లోని ప్రధాని మోదీ, ఏపీ సీఎం జగన్, గౌతమ్ అదానీలకు సమన్లు పంపించింది. స్విట్జర్లాండ్ లో ఉన్న WEF అధ్యక్షుడు ష్వాబ్ కి ఆగస్ట్ 2న సమన్లు వెళ్లాయి. ఈ పిటిషన్, విచారణ గురించిన సమాచారం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆగస్ట్ 19న దీనికి సంబంధించిన సాక్ష్యాలను కూడా డాక్టర్ లోకేష్ కోర్టుముందు ఉంచారని అంటున్నారు. అయితే ఆ సాక్ష్యాలేంటి, కేవలం సంచలనం కోసమే ఆయన ఈ పిటిషన్ వేశారా, లేక ఇందులో నిజానిజాలు ఉన్నాయా అనేది తేలాల్సి ఉంది.

Tags:    
Advertisement

Similar News