నిద్రలేకపోతే స్వార్థం పెరుగుతుందా?

నిద్రలేకపోతే గుండెవ్యాధులు, డిప్రెషన్, మధుమేహం, రక్తపోటు వంటి అనారోగ్యాలు చుట్టుముడతాయనే అవగాహన మనలో చాలామందికి ఉంది.

Advertisement
Update: 2022-09-05 08:15 GMT

నిద్రలేకపోతే గుండెవ్యాధులు, డిప్రెషన్, మధుమేహం, రక్తపోటు వంటి అనారోగ్యాలు చుట్టుముడతాయనే అవగాహన మనలో చాలామందికి ఉంది. అయితే నిద్రతగ్గితే మనలో స్వార్థగుణం పెరుగుతుందని ఓ అధ్యయనంలో తేలింది. కాలిఫోర్నియా యూనివర్శిటీలోని మానసిక శాస్త్రవేత్తలు నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. నిద్ర తక్కువైతే మనలో సామాజిక స్పృహ తగ్గిపోతుందని, దాంతో ఇతరులకు సహాయం చేయాలనే కోరిక ఉండదని ఈ పరిశోధనలో తేలింది.

సరైన నిద్రలేకపోతే శారీరక, మానసిక అనారోగ్యాలు రావటమే కాకుండా మనుషుల మధ్య ఉండాల్సిన బంధాలు, సామాజిక అనుబంధాలు సైతం దెబ్బతింటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గత ఇరవైఏళ్లుగా నిద్రకు, మానసిక ఆరోగ్యానికి మధ్య ఉన్న సంబంధంపై అధ్యయనాలు నిర్వహిస్తున్నామని, తీవ్రమైన మానసిక రుగ్మతలన్నింటిలో నిద్రలేమి కూడా ఒక అంశంగా ఉందని వారు వివరించారు. ఒక వ్యక్తి సరిగ్గా నిద్రపోలేకపోతే... అతనొక్కడిపైనే కాకుండా ఆ ప్రభావం అతనితో సంబంధం ఉన్నవారందరిపైనా ఉంటుందని వారు చెబుతున్నారు.

నిద్రకు, ఇతరులకు సహాయం చేసే గుణంకి మధ్య ఉన్న సంబంధాన్ని గుర్తించేందుకు శాస్త్రవేత్తలు పలు అధ్యయనాలు నిర్వహించారు. ఎనిమిది గంటలు నిద్రపోయిన తరువాత, రాత్రంతా మేలుకుని ఉన్న తరువాత...ఈ రెండు విధాల అధ్యయనంలో పాల్గొన్న వలంటీర్ల మెదళ్లను పరిశీలించారు. నిద్రలేని రాత్రి తరువాత వలంటీర్ల మెదడులోని ఓ భాగం సరిగ్గా పనిచేయకపోవటం గుర్తించారు. ఇతరుల పట్ల సానుభూతిని చూపటంలో, ఇతరుల అవసరాలు, బాధలను అర్థం చేసుకోవటంలో పనిచేయాల్సిన ఆ మెదడు భాగం చురుగ్గా లేకపోవటం పరిశోధకులు గమనించారు.

ముందురోజు రాత్రి సరైన నిద్రలేని వారు తరువాత రోజు ఇతరులకు సహాయం చేయటంలో అసలు ఆసక్తి చూపలేదని మరొక అధ్యయనంలో తేలింది. ఒక్క గంట నిద్ర తగ్గినా మనుషుల్లో ఉండాల్సిన దయ మానవతలపై ప్రభావం చూపుతుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.

నిద్రలేనివారు నలుగురిలో కలవలేరని ఒంటరిగా ఉండేందుకు ఇష్టపడతారని పరిశోధకులు అంటున్నారు. వారిలో ఒంటరితనం ఆలోచనలు పెరుగుతాయని తెలుస్తోంది. ఇలా ఒంటరితనంకి గురవుతున్నవారు తమకున్న సమస్యని... ఇతరులకు సైతం వ్యాపించేలా చేస్తారు.

వ్యక్తుల్లో నిద్ర తక్కువైనా, దాని నాణ్యత తగ్గినా అది సమాజం మొత్తాన్ని ప్రభావితం చేస్తుందని మనం గ్రహించి తీరాలి. సామాజికంగా ఇతరులకు సహాయం చేసే గుణం తగ్గటం నుండి మొదలై... అది సామాజిక వ్యతిరేకతగా మారుతుందనే కోణంలో ఈ అంశాన్ని తాము చూస్తున్నామని పరిశోధకులు అంటున్నారు. సామాజిక సంబంధాలను పెంచే క్రమంలో కూడా ఈ అంశం ప్రాధాన్యతని మనం గుర్తించాలని వారు అభిప్రాయపడుతున్నారు.

Tags:    
Advertisement

Similar News