అక్షయ తృతీయ

అక్షయ తృతీయ నాడు హరి హరభేదము లేకుండా చేసే పూజలకు ప్రాధాన్యము ఉంటుందని అంటారు.

Advertisement
Update: 2023-04-22 09:06 GMT

Akshaya Tritiya: అక్షయ తృతీయ

నారాయణుడు నరునిగా పుట్టి మానవ జన్మను మహత్తరమైనదిగా చూపించిన త్రేతాయుగానికి అన్ని యుగాలకన్నా ఓ ప్రత్యేకత ఉంది. అలాంటి ఆ త్రేతాయుగ ప్రారంభం రోజే వైశాఖమాసంలోని తృతీయ. ఈ తదియాతిథి అనేకనేక ఫలితాలనుఇస్తుంది. ఈరోజున చేసే దానాలు, ధర్మాలు, విశేషఫలితాలను ఇస్తాయని అంటారు.

అక్షయ తృతీయ నాడు హరి హరభేదము లేకుండా చేసే పూజలకు ప్రాధాన్యము ఉంటుందని అంటారు..

పురుషార్థ చింతామణిలో, స్మృతికౌస్తుభములోలక్ష్మీనారాయణులను పూజించినవారికి ఇహలోక సంపదలతో పాటు వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని చెప్ప బడింది . లక్ష్మీ కటాక్షంకోసం బంగారాన్ని కొని పూజా మందిరంలో ఉంచి పూజిస్తారు.

చైత్రశుక్ల తృతీయనాడు ఆరంభించిన గౌరీ పూజావ్రతము వైశాఖ శుక్లతృతీయ నాడు పరిసమాప్తమవుతుంది. అందుకని ఈ రోజున గౌరీపూజతోపాటు త్రిలోచనగౌరీవ్రతము శివపార్వతుల ఆశీస్సులు అందచేస్తాయని కొన్ని వ్రత గ్రంథాలు తెలుపుతున్నాయి.

అక్షయ తృతీయనాడే పాండవ పక్షపాతియైన కృష్ణుని సోదరుడు బలరాముని జయంతి కూడా కొందరు జరుపుకుంటారు. ఈ బలరాముడు కురుక్షేత్ర మహారణరంగంలో పాలుపంచుకోనివాడుగా కీర్తించబడ్డాడు. ఈ బలరాముని ఆయుధమైన నాగలి చేత ఏర్పడిన నాగావళి నదిలో స్నానం చేయాలంటారు. ఈ రోజున చేసే దానాలు కాని, పుణ్యక వ్రతాలు నోములు కాని, పితృదేవతలకు తర్పణాలులాంటివి కాని ఇలా ఏది చేసినా అది మంచి ఫలితాన్నిస్తుందని పెద్దలు చెప్తున్నారు.

వైశాఖమాస స్నానాలలో తృతీయ నాడు గంగా స్నానం కూడా మంచి ఫలితాన్నిస్తుంది.ఆ రోజు చేసే ఉదకుంభదానానికి ప్రత్యేకత ఉంది. మామిడి పండ్లు, పనసతొనలు, లడ్లు, విసనకర్రలు, పెరుగన్నము, ఉప్పు,గొడుగు ,పాదుకలు, చెప్పులు లాంటి దానాలు చేయాలని వ్రతరాజం చెబుతోంది.

వేసవి తాపాన్ని తగ్గించే వస్తువులను దానంచేయడమే ఈ వ్రతోద్దేశం అనీ కొందరుఅంటారు. పూర్వకాలంలో సత్యవంతుడను వైశ్యుడు ఈ అక్షయతృతీయ వ్రతాన్ని ఆచరించి మరుజన్మలోకూడా అక్షయ సంపదలు పొందినాడట. అందుకనేఉన్నంతలో ఇతరులకు దానధర్మాలు చేసి అక్షయమైన ఫలితాలను పొందాలనేది పెద్దల వచనం.

అక్షయ తృతీయ నాడు సింహాచల క్షేత్రంలో వెలసిన వరాహ లక్ష్మీనరసింహస్వామికి విశేషమైనచందనోత్సవాన్ని జరుపుతారు. తన భక్తుడైన ప్రహ్లాదుడిని రక్షించడానికి స్తంభంలోంచి ఆవిర్భవించి హరివైరి అయిన హిరణ్యకశ్యపుడిని (రాక్షసుని) కోరిక ప్రకారం సంహ రించిన లక్ష్మీనరసింహుడు సింహాచలక్షేత్రంలోనివాసమేర్చరుచుకొన్నాడు. ఆ లక్ష్మీనరసింహుని కే చందనోత్సవాన్ని జరిపి అంతకు ముందు వలచిన చందనాన్ని భక్తులుప్రసాదంగా తీసుకొంటారు. ఇలా తీసుకోవడం వలన మహిమాన్వితుడు, ఆశ్రిత జనరక్షకుడైన శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామివారి కృపా రసామృతం ఆక్షయంగా ఉంటుందనేది భక్తుల నమ్మకం.

ఈ అక్షయ తృతీయ పర్వం ఆర్భాటంకన్నా ధార్మిక గుణసంపన్నంగా కనిపిస్తుంది. దేవాలయాల్లో దేవతామూర్తులకు ఈ రోజు ధవళ వస్త్రాలను కడతారు. అక్షయఫలితానిచ్చే ఆ రోజున తిథి వార నక్షత్రాలను చూడకుండానే ఏ పని ఆరంభించినా సరే అది మంచి ఫలితానిస్తుందని పురాణాలు చెప్తున్నాయి. అందుకే అక్షయ తృతీయ రోజున జరిపేకల్యాణాల ముహుర్తాలు జయప్రదాలుగా ఉంటాయని అంటారు..

-ఆర్ .సుశీల

Tags:    
Advertisement

Similar News