Dheera Movie Review: ధీర మూవీ రివ్యూ {2/5}

Dheera Movie Review: 'వలయం', 'గ్యాంగ్‌ స్టర్ గంగరాజు' సినిమాల్లో నటించిన హీరో లక్ష్ చదలవాడ మరో యాక్షన్ మూవీ ‘ధీర’ తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు.

Advertisement
Update: 2024-02-03 10:56 GMT

చిత్రం: ధీర 

రచన-దర్శకత్వం : విక్రాంత్ శ్రీనివాస్

తారాగణం : లక్ష్ చదలవాడ, సోనియా బన్సల్, నేహా పఠాన్, హిమజ, మిర్చి కిరణ్, సుమన్ తదితరులు

సంగీతం: సాయి కార్తీక్, ఛాయాగ్రహణం : కన్నా పిసి, కూర్పు : వినయ్ రామస్వామి

బ్యానర్ : శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ప్రొడక్షన్స్

సమర్పణ : చదలవాడ బ్రదర్స్, నిర్మాత: పద్మావతి చదలవాడ

విడుదల : ఫిబ్రవరి 2, 2024

రేటింగ్: 2/5

'వలయం', 'గ్యాంగ్‌ స్టర్ గంగరాజు' సినిమాల్లో నటించిన హీరో లక్ష్ చదలవాడ మరో యాక్షన్ మూవీ ‘ధీర’ తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. విక్రాంత్ శ్రీనివాస్ దీనికి దర్శకుడు. ఇటీవల సినిమా ట్రైలర్ విడుదల అయింది. ట్రైలర్ మొత్తం మాస్ డైలాగులతో ఒన్ మాన్ షోగా వుంది. అయితే యాక్షన్ హీరోగా ఎదగాలనుకుంటున్న లక్ష్ కి ఈ మూడో ప్రయత్నమైనా లక్ష్యానికి చేర్చిందో లేదో చూద్దాం...

కథ

వైజాగ్ లో రణధీర్ అలియాస్ ధీర (లక్ష్ చదలవాడ) వాహన డ్రైవర్. అతడికి డబ్బే ముఖ్యం. డబ్బు కోసం ఏ పనైనా, ఎంత సాహసమైనా చేస్తాడు. ఈ క్రమంలో రాజ్ గురు అనే కోమా పేషంట్‌ ని హైదరాబాద్‌ కి తరలిస్తే రూ. 25 లక్షలు ఇస్తామని ఆఫర్ వస్తుంది. రణధీర్ ఒప్పుకుని ఆ పేషంట్‌ ని తీసుకుని అంబులెన్స్ లో బయల్దేరతాడు. అదే అంబులెన్స్ లో డాక్టర్ అమృత (నేహా పఠాన్) పేషంట్‌ వెంట వస్తుంది. ఈమె, ధీర గతంలో ప్రేమికులు. మరో డాక్టర్‌గా మిర్చి కిరణ్‌ వస్తాడు. తీరా బయల్దేరాక అంబులెన్స్ లో వున్న పేషంట్‌ ని చంపేందుకు గ్యాంగులు వెంటపడతాయి. వాళ్ళని ఎదుర్కొని పేషంట్‌ ని హైదరాబాద్ చేర్చి తిరిగి వైజాగ్ వస్తూంటే, ఓ తల్లీ బిడ్డలు అంబులెన్స్ లో వుంటారు. బిడ్డని కాపాడమని ధీర కి అప్పగించి తల్లి చనిపోతుంది.

ఇప్పుడు ఈ బిడ్డ ఎవరు? తల్లి ఎవరు? పేషంట్‌ రాజ్ గురు ఎవరు? అతడితో తల్లీ బిడ్డలకి సంబంధముందా? ఆ గ్యాంగులు ఎవరి తాలూకా? ఎందుకు రాజ్ గురుని చంపేందుకు వెంటపడ్డారు? ఈ ప్రశ్నలకి సమాధానమే మిగతా కథ.

ఎలావుంది కథ

ఓ రాజకీయ కుటుంబ కథతో కాలక్షేప సినిమా. అయితే కథ మీద కాక యాక్షన్ మీద ఎక్కువ కృషి చేసి తీశారు. దీంతో ఆద్యంతం అయినదానికి కానిదానికి కొట్టుకోవడం, యాక్షన్ డైరెక్టర్ కి ఊపిరిసలపనీయకుండా పని కల్పించడం వుంటాయి. ఎక్కువ రెమ్యూనరేషన్ పొందింది కూడా ఇతడేనేమో అన్నట్టుంటుంది. పైగా లక్ష్ అంటేనే యాక్షన్ కాబట్టి అదరగొట్టే ఎంట్రీ సీను నుంచీ క్లయిమాక్స్ వరకూ స్వైర విహారమే. ఈ యాక్షన్ తాకిడికి కథ కూడా చెల్లాచెదురై ఎమోషన్లనేవి లేకుండా పోయాయి. కొన్ని చోట్ల బరువైన భావోద్వేగ సీన్లు కూడా బలి అయిపోయాయి.

అయితే కాస్త కామెడీతో జీవం పోసే ప్రయత్నం చేశారు. గ్యాంగ్స్ తో లక్ష్ చేసే కామెడీ బాగానే వర్కౌట్ అయింది. ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే రోమాంటిక్ ట్రాక్ కూడా పైపైనే వుంటుంది. పైన చెప్పుకున్న కథలో తలెత్తిన ప్రశ్నలకి వచ్ఛే సమాధానాలు కథకి ఎలాటి బలమైన మలుపులు కూడా ఇవ్వక చప్పగా వుంటాయి. ఈ ప్రశ్నలకంటే పెద్ద ప్రశ్నకి మాత్రం సమాధానమాశించ వద్దు- కోమా పేషంట్‌ ని ఫ్లయిట్ లో తరలించే ఏర్పాటు వుండగా, పాతిక లక్షలిచ్చి అంబులెన్స్ లో అంత దూరం తరలించడమేంటో? ఈ కథని చాలా వరకూ వూహించేస్తూ చూడొచ్చు. పక్కా బి, సి సెంటర్లలో మాస్ మార్కు సినిమా ఇది.

నటనలు -సాంకేతికాలు

లక్ష్ చదలవాడ దృఢమైన బాడీతో చేసే యాక్షన్ చూస్తే ఈ స్థాయి సినిమా అతడి లెవెల్ కాదనిపించేలా వుంది. ఇంకా బిగ్ యాక్షన్ మూవీకి సరిపోతాడు. ఇందుకు సొంత బ్యానర్ కాక బయటి పెద్ద బ్యానర్లు రావాలి. అలా జరగాలంటే క్వాలిటీ పరంగా ఇప్పుడు తీస్తున్న బే గ్రేడ్ సినిమాల స్థాయిని దాటాలి. అప్పుడే అన్ని తరగతుల ప్రేక్షకులు పెరిగి ‘ఏ’ గ్రేడ్ కి ప్రమోటయ్యే అవకాశముంటుంది. లేకపోతే బి గ్రేడ్ స్థాయిలో ఇలా ఛోటా హీరోగానే మిగిలి పోవాల్సి వుంటుంది.

ఈ యాక్షన్ పొల్యూషన్లో ఇద్దరు హీరోయిన్లు సహా ఇతర తారాగణం గురించి చెప్పుకోవడానికి పెద్దగా ఏమీ లేదు. సాయికార్తీక్ సంగీతంలో పాటలు, చిత్రీకరణ మాత్రం బావున్నాయి. అలాగే కన్నా ఛాయాగ్రహణం, ఇతర నిర్మాణ విలువలు కూడా. దీని అదృష్టం బి, సి సెంటర్లపై ఆధారపడి వుంది.

Tags:    
Advertisement

Similar News