జగన్ పాలనలో పార్టీ నేతలు ఆర్థికంగా దెబ్బతిన్నారు –ధర్మాన

ప్రజలు కూడా వైసీపీ వారు డబ్బు తినటం లేదని అంటున్నారని, తమకు అంత మంచి ఇమేజ్ ఉందన్నారు. అలాంటి పేరుంది కానీ, నేతలు ఆర్థికంగా చితికిపోయారని చెప్పారు మంత్రి ధర్మాన.

Advertisement
Update: 2022-12-20 14:31 GMT

జగన్ పాలనలో ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారని చెబుతూనే.. మరోవైపు పార్టీ నేతలు మాత్రం ఆర్థికంగా చితికిపోయారని అన్నారు మంత్రి ధర్మాన ప్రసాదరావు. అవినీతికి తావులేని పాలన వల్ల పార్టీ నేతలు దెబ్బతిన్నారని, ఆర్థికంగా చెడిపోయారని, అయినా కూడా ఎక్కడా అడ్డదారులు తొక్కడం లేదని వివరణ ఇచ్చారు. అవినీతి లేని వ్యవస్థ కావాలని, ఆ ప్రయత్నం ఇప్పుడు జరుగుతోందన్నారు ధర్మాన.

నేను నయాపైసా తీసుకోలేదు..

ఇటీవల ఏపీ మంత్రులపై వస్తున్న అవినీతి ఆరోపణలకు వారు గట్టిగా బదులిస్తున్నారు. మంత్రి అంబటి రాంబాబు తాను అవినీతికి పాల్పడలేదని, నిరూపిస్తే రాజీనామా చేస్తానన్నారు. తాజాగా మంత్రి ధర్మాన కూడా తాను ఎక్కడా నయాపైసా తీసుకోలేదని అన్నారు. తీసుకున్నానని ఎవరైనా నిరూపించగలరా అని సవాల్ విసిరారు. చంద్రబాబుకి కోట్లాది రూపాయలు ఎలా వచ్చాయో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఆయనపై ఉన్న కేసులు విచారణకు రాకుండా స్టేలు తెచ్చుకుంటాడని చెప్పారు.

ఉద్యోగులు జాగ్రత్త..

ఉద్యోగులు అవినీతికి దూరంగా ఉండాలని సూచించారు మంత్రి ధర్మాన ప్రసాదరావు. తనకు అవినీతి నచ్చదని, తనతోపాటు తన చుట్టూ ఉన్నవారు కూడా అవినీతికి దూరంగా ఉండాలన్నారు. చంద్రబాబు టైంలో బ్రోకర్ల వ్యవస్థ ఉండేదని, ప్రతి పనికీ డబ్బు పంచుకునేవారని.. కానీ ఇప్పుడు ప్రభుత్వంలో ఎవరూ నయాపైసా తినటం లేదన్నారు. ప్రజలు కూడా వైసీపీ వారు డబ్బు తినటం లేదని అంటున్నారని, తమకు అంత మంచి ఇమేజ్ ఉందన్నారు.

అలాంటి పేరుంది కానీ, నేతలు ఆర్థికంగా చితికిపోయారని చెప్పారు. ఏపీలో ప్రతి కుటుంబానికి ఏడాదికి సగటున లక్ష రూపాయల వరకు లబ్ధి చేకూరుతోందని, పన్నుల రూపంలో వచ్చే డబ్బుల్ని పేదలకు సంక్షేమ పథకాల రూపంలో అందిస్తున్నామన్నారు. సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు.. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని ప్రజలకు వివరించి చెప్పాలని పిలుపునిచ్చారు.

Tags:    
Advertisement

Similar News