యనమలకే క్యాడర్ గట్టి షాకిచ్చిందా?

యనమల కృష్ణుడు స్ధానంలో యువనేతకు చంద్రబాబునాయుడు టికెట్ ఇవ్వాల్సిందే అని గట్టిగా కేకలు పెట్టారు. ఎన్నికల్లో వరసగా ఓడిపోతున్న కృష్ణుడికే మరోసారి పోటీచేసే అవకాశం ఇవ్వాలా అంటూ డైరెక్టుగా రామకృష్ణుడినే నిలదీశారు.

Advertisement
Update: 2022-12-22 06:24 GMT

తెలుగుదేశం పార్టీలో అనధికారికంగా నెంబర్ 2గా చెలామణిలో ఉన్న యనమల రామకృష్ణుడికి క్యాడర్ ఊహించని షాక్ ఇచ్చింది. యనమల సొంత నియోజకవర్గం తునిలో జరిగిన మీటింగ్‌లో యువ నేతలు తనకు వ్యతిరేకంగా మారుతారని యనమల ఏమాత్రం ఊహించి ఉండ‌రు. అలాంటిది తన ఎదుటే తనను ధిక్కరించి మాట్లాడటంతో యనమలకు షాక్ కొట్టినట్లయ్యింది. ఇంతకీ విషయం ఏమిటంటే వచ్చే ఎన్నికల్లో తుని నియోజకవర్గంలో నేతలు, క్యాడర్ పోషించాల్సిన పాత్ర, కష్టపడి పనిచేయాలనే విషయంపై మాట్లాడేందుకు మీటింగ్ జరిగింది.

మీటింగ్ మొదలుకాగానే కొందరు నేతలు లేచి యనమల రామకృష్ణుడి సోదరుడు యనమల కృష్ణుడే పోటీ చేస్తారంటూ అసందర్భంగా నినాదాలు చేశారు. కృష్ణుడు పోటీకి రెడీగా ఉన్నపుడు ఆల్టర్నేటివ్ చూడాల్సిన అవసరం, చర్చ జరపాల్సిన అవసరం ఏమిటని రామకృష్ణుడినే డైరెక్టుగా అడిగారు. అంటే వీళ్ళంతా యనమల మద్దతుదారులని అర్ధమైపోయింది. మీటింగ్ ఎందుకు పెట్టారనే విషయం పక్కకుపోయి టికెట్ విషయం హైలైట్ అయ్యింది. అయితే ఎవరూ ఊహించని రీతిలో యువ నేతలు కొందరు కృష్ణుడికి కాకుండా యువనేతకు టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

యనమల కృష్ణుడు స్ధానంలో యువనేతకు చంద్రబాబునాయుడు టికెట్ ఇవ్వాల్సిందే అని గట్టిగా కేకలు పెట్టారు. ఎన్నికల్లో వరసగా ఓడిపోతున్న కృష్ణుడికే మరోసారి పోటీచేసే అవకాశం ఇవ్వాలా అంటూ డైరెక్టుగా రామకృష్ణుడినే నిలదీశారు. గడచిన మూడు ఎన్నికల్లో ఒకసారి రామకృష్ణుడు, రెండు సార్లు కృష్ణుడు ఓడిపోయారు. ఈ పాయింట్‌నే కొందరు యువ నేతలు డైరెక్టుగా వేదిక మీదున్న యనమల దగ్గరే ప్రస్తావించారు.

చంద్రబాబు హామీ ఇచ్చినట్లుగా యువతకు కేటాయించబోయే 40 శాతం టికెట్లలో తుని నియోజకవర్గం కూడా ఉండాలని గట్టిగా నినాదాలిచ్చారు. దాంతో రామకృష్ణుడికి ఏమి మాట్లాడాలో దిక్కుతోచ లేదు. టికెట్ విషయంపై ఇప్పుడు చర్చ అవసరం లేదని ఆ విషయాన్ని చంద్రబాబు చూసుకుంటారని అందరికీ నచ్చచెప్పేందుకు ప్రయత్నించారు. అయినా యువ నేతలు పట్టించుకోలేదు. దాంతో సమావేశంలో యనమల మద్దతుదారులకు, యువతకు మధ్య వాగ్వాదం జరిగింది. చివరకు గొడవ పెద్దది అవుతోందనే అనుమానంతో సమావేశాన్ని అర్ధాంతరంగా ముగించేశారు.

Tags:    
Advertisement

Similar News