నీ పక్కన ఉన్న వాడే నిన్ను ఓడిస్తాడు పవన్ - వైసీపీ

పొత్తులో భాగంగా పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తే ఆయన ప్రచారానికి కూడా రానవసరం లేదని.. తానే పవన్ ని గెలిపించుకొస్తానని ముందు ప్రకటించిన ఆ నియోజకవర్గ టీడీపీ నేత ఎస్వీఎస్ ఎన్ వర్మ ఆ తర్వాత మాట మార్చిన సంగతి తెలిసిందే.

Advertisement
Update: 2024-03-31 04:42 GMT

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను ఓడించడానికి తాము అవసరం లేదని, ఆయన పక్కన ఉన్న వాడే పవన్ ని ఓడిస్తాడని అధికార వైసీపీ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. గత ఎన్నికల్లో పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయిన పవన్ కళ్యాణ్ ఈసారి ఎలాగైనా ఎమ్మెల్యేగా గెలుపొందాలనే లక్ష్యంతో పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన తన ప్రచారాన్ని పిఠాపురం నుంచే ప్రారంభించారు. నిన్న పిఠాపురంలో నిర్వహించిన వారాహి విజయ యాత్రలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. వైసీపీ పై తీవ్ర విమర్శలు చేశారు.

తనను ఓడించేందుకు వైసీపీ కక్ష కట్టిందని చెప్పారు. కంటైనర్లలో డబ్బు తరలిస్తోందని మండిపడ్డారు. తనను ఓడించడానికి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి వచ్చారని, ఒక్కో మండలానికి ఒక్కో నాయకుడిని ఇన్చార్జిగా పెట్టారన్నారు. వైసీపీ నాయకులందరూ తనపైనే ఫోకస్ పెట్టి తనను ఓడించేందుకు పనిచేస్తున్నారని చెప్పారు.

కాగా, పవన్ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ ట్విట్టర్ వేదికగా ఆసక్తికరంగా బదులిచ్చింది. ' నిన్ను ఓడించడానికి మేము అవసరం లేదు పవన్ కళ్యాణ్. నీ పక్కన ఉన్నాడు చూడు పసుపు చొక్కా వేసుకొని ఆయనే ఓడిస్తాడు నిన్ను. నీ మీద కక్ష కట్టింది కూడా మేము కాదు. మీ దత్త తండ్రి చంద్రబాబే. జాగ్రత్త..' అంటూ ట్వీట్ చేసింది. వైసీపీ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

పొత్తులో భాగంగా పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తే ఆయన ప్రచారానికి కూడా రానవసరం లేదని.. తానే పవన్ ని గెలిపించుకొస్తానని ముందు ప్రకటించిన ఆ నియోజకవర్గ టీడీపీ నేత ఎస్వీఎస్ ఎన్ వర్మ ఆ తర్వాత మాట మార్చిన సంగతి తెలిసిందే. పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నట్లు ప్రకటన వచ్చిన వెంటనే టీడీపీపై ఆయన తిరుగుబావుటా ఎగురవేశారు. ఇండిపెండెంట్ గా పోటీ చేసి పవన్ ని ఓడిస్తానని ప్రకటించారు. ఆ తర్వాత చంద్రబాబు బుజ్జగింపుతో వర్మ వెనక్కి తగ్గారు.

నిన్న పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో వారాహి వాహనంపై వర్మ పవన్ పక్కనే నిల్చున్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలపై వైసీపీ కౌంటర్ ఇస్తూ నిన్ను ఓడించడానికి తాము అవసరం లేదని.. నీ పక్కన ఉన్నవాడే నిన్ను ఓడిస్తాడు పవన్ అంటూ.. వర్మను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.

Tags:    
Advertisement

Similar News