జన సైనికులు.. రియలైజ్ కావాలి.. - వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల

ఒక రాజకీయ పార్టీకి విశ్వసనీయత కలిగిన నాయకుడు ఉంటే ఆ పార్టీ నిర్మాణం ఎలా ఉంటుందో జగన్‌ని చూసి నేర్చుకోవచ్చన్నారు.

Advertisement
Update: 2024-02-25 04:32 GMT

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కి పొలిటికల్‌ పార్టీని నడిపే లక్షణాలు లేవని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. టీడీపీ, జనసేన కలసి ఒకే వేదికపై నుంచి రానున్న ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థుల జాబితాను శనివారం ప్రకటించిన విషయం తెలిసిందే. 175 అసెంబ్లీ స్థానాలకు గాను 94 స్థానాలను ఈ సందర్భంగా ప్రకటించారు. అభ్యర్థుల జాబితా ప్రకటన సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. రాష్ట్రంలోని మొత్తం 25 పార్లమెంట్, 175 అసెంబ్లీ స్థానాల్లో జనసేన పార్టీకి 3 పార్లమెంటు, 24 అసెంబ్లీ స్థానాలు కేటాయించినట్టు వెల్లడించారు. దీనిపై సజ్జల విలేకరుల ఎదుట స్పందిస్తూ పై వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పవన్‌ కల్యాణ్‌ అత్యంత దయనీయ స్థితిలో ఉన్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు పడేసే సీట్లు తీసుకునే స్థాయికి ఆయన దిగజారిపోయారని తెలిపారు.

టీడీపీ, జనసేనవి దింపుడు కళ్లెం ఆశలని, జనసేన మిగిలిన స్థానాల్లోనూ చంద్రబాబు తన అభ్యర్థులను పంపుతారని, పవన్‌ను అభిమానించే వారంతా ఆలోచించుకోవాలని హితవు పలికారు. 175 స్థానాల్లో నిలబెట్టేందుకు టీడీపీకి అభ్యర్థులే లేరని ఈ సందర్భంగా ఆయన ఎద్దేవా చేశారు. 24 స్థానాల్లో పూర్తిగా అభ్యర్థులను ప్రకటించలేని స్థితిలో పవన్‌ ఉన్నారని, బాబు కోసమే పవన్‌ పనిచేస్తున్నారని సజ్జల విమర్శించారు.

ఈమాత్రానికి పార్టీ ఎందుకు..?

బాబు ఇచ్చిన 24 సీట్లతో పవన్‌ కల్యాణ్‌ ఎవరి మీద యుద్ధం చేస్తాడని సజ్జల ప్రశ్నించారు. ఈమాత్రానికి పార్టీ ఎందుకు..? టీడీపీ ఉపాధ్యక్ష పదవో, రాష్ట్ర అధ్యక్ష పదవో తీసుకుంటే పోలా.. అంటూ ఎద్దేవా చేశారు. తానెక్కడ పోటీచేస్తాడో కూడా చెప్పుకోలేని దుస్థితిలో పవన్‌ ఉన్నాడని ఆయన తెలిపారు. ఎత్తిపోయిన టీడీపీకి పవన్‌ కల్యాణ్‌ మద్దతా.. అంటూ ధ్వజమెత్తారు. ఈ సీట్ల కేటాయింపు ద్వారా పవన్‌ కల్యాణ్‌ వందకు 100 శాతం తెలుగుదేశం పార్టీకి అనుబంధంగా నడుస్తున్నారనేది మరోసారి తేటతెల్లమైందని సజ్జల స్పష్టం చేశారు. ఒక రాజకీయ పార్టీగా పేరు పెట్టుకుని, తన సామాజికవర్గాన్ని, అభిమానుల్ని ఇలా మోసం చేయడం దారుణమన్నారు. ఆయనపై జాలి కంటే ఆయన్ను అభిమానించే వారిని చూస్తే జాలి కలుగుతోందని ఈ సందర్భంగా ఆయన చెప్పారు.

జనసేన సీట్లు కూడా బాబే చెబుతున్నారు..

అసలు ఒక పార్టీలా కూడా వ్యవహరించలేని పరిస్థితి పవన్‌దని సజ్జల విమర్శించారు. జనసేన ఎన్ని సీట్లలో పోటీ చేస్తుందో కూడా చంద్రబాబే చెప్తున్నారని, 24 సీట్లు ఇస్తామని చెప్పారని ఆయన ఎద్దేవా చేశారు. ఆ 24 మందిలో కూడా అంతా చంద్రబాబునాయుడు పెట్టే అభ్యర్థులే ఉంటారని చెప్పారు. బహుశా బీజేపీకి కూడా ఆ 24లోనే ఇస్తాడేమో కూడా తెలియదని సందేహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ఓ పక్క బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని ఆత్రం పడుతూ.. మరోవైపు పవన్‌ కల్యాణ్‌ను పూర్తిగా మింగేశాడన్నారు.

ఆలోచించుకోవాల్సింది జనసైనికులే...

ఒక రాజకీయ పార్టీకి విశ్వసనీయత కలిగిన నాయకుడు ఉంటే ఆ పార్టీ నిర్మాణం ఎలా ఉంటుందో జగన్‌ని చూసి నేర్చుకోవచ్చన్నారు. ఒక రాజకీయ పార్టీ ఎలా ఉండాలో జగన్‌ చూపిస్తుంటే.. ఒక రాజకీయ పార్టీ ఇంత దరిద్రంగా ఉంటుందా.. అనేది చూడాలంటే పవన్‌ కల్యాణ్‌ పార్టీని చూస్తే సరిపోతుందన్నారు. ఇక ఆలోచించుకోవాల్సింది... పవన్‌పై ఆశలు పెట్టుకున్న వారేనని, వారికి వారు ఆలోచించుకుని రియలైజ్‌ కావాలని ఆయన సూచించారు. రాష్ట్రానికి ఇది చేయగలనని గానీ, 2014–19 మధ్య ఇది చేశానని గానీ చెప్పుకోలేని దౌర్భాగ్యం చంద్రబాబుదన్నారు. అలాంటి ఎత్తిపోయిన కేసుకు మద్దతుగా పవన్‌ కల్యాణ్‌ వెళ్లడం ఆయన బలహీనత, దరిద్రం అని ఎద్దేవా చేశారు. తమకు వస్తున్న సంకేతాల ప్రకారం ప్రజలు జగన్‌ని గతం కంటే అధిక స్థానాలు ఇచ్చి గెలిపించబోతున్నారని ఈ సందర్భంగా సజ్జల స్పష్టం చేశారు.

Tags:    
Advertisement

Similar News