పవన్‌ కళ్యాణ్‌ ఇక తేల్చుకోవాలి..

పవర్‌స్టార్‌కి ఇప్పుడు సంకటం ఎదురైంది. ఈ స్థితిని Catch-22 అనీ, Between the Devil and the Deep Sea అనీ అంటారు. అనగా అచ్చ తెలుగులో ముందు నుయ్యీ వెనుక గొయ్యీ అని..!

Advertisement
Update: 2024-02-05 09:55 GMT

చంద్రబాబుతో చర్చలు. ఎడతెగని చర్చలు, బేరాలు, బేలతనాలు, అభ్యర్థించడాలు. ఎన్ని అసెంబ్లీ..? ఎన్ని పార్లమెంట్‌.. ఇప్పటికీ తేలలేదు. ఒక కొలిక్కి రానేలేదు. ఇవన్నీ విజయవాడ రాజకీయాలు. అసలు పవర్‌ సెంటర్‌ ఢిల్లీలో ఉంది. నాలుగైదు రోజుల్లో పవన్‌ ఢిల్లీ వెళతారు. కథ క్లయిమాక్స్‌కి వస్తోంది. ఎన్నికల వేళ ముంచుకొస్తోంది. ఆశావహులు, అభ్యర్థులూ ఎమ్మెల్యేలు అవుదామని తహతహలాడుతున్న అనేక మంది, నాయకుడు పవన్‌ వైపు చూస్తున్నారు. పవన్‌ చంద్రబాబు వైపు చూస్తున్నాడు. ఉత్కంఠభరితమైన రాజకీయ గేమ్‌ నడుస్తోంది.

అయితే అసలు కీలకం కాపుల దగ్గర ఉంది. ఎన్ని సీట్లు..? అనేది కాపు మనోభావాలని గాయపరచకుండా ఉండాలి. 65 అసెంబ్లీ స్థానాలు జనసేనకి ఇవ్వాలనీ, కనీసం ఆరు పార్లమెంట్‌ స్థానాలు కేటాయించాలనీ కాపు యాక్టివిస్టులు ఆశిస్తున్నారు. జనసేనకి ఇరవయ్యో, ముప్పైలోపో గనక చంద్రబాబు ఇస్తే కాపులు ఆగ్రహంతో ఊగిపోతారు. ఒకవేళ జనసేన 20 సీట్లలో గెలిచినా ముఖ్యమంత్రి పదవి క్లెయిమ్‌ చేయడం సాధ్యం కాదు కదా..! ఇదో పెద్ద సమస్య.

అటు నరేంద్రమోడీ, చంద్రబాబు నాయుడు మధ్య ఇరుక్కుపోయి ఉన్న పవన్‌ది వేరే సమస్య. ఎవ్వర్నీ కాదనలేడు. అయినా, తెగించి మాట నెగ్గించుకోగలడా..? పరువు దక్కించుకోగలడా..? అనేది మిలియన్‌ డాలర్‌ ప్రశ్న. బీజేపీ ఆగ్రహిస్తుందా..? కాపులు తిరగబడతారా..? చివరికి పవన్‌కళ్యాణ్‌ చంద్రబాబు గారి ఆఫీస్‌ బాయ్‌గా మిగిలిపోతారా..? అనేది జవాబు లేని రాజకీయ బేతాళ ప్రశ్నలు..!

Tags:    
Advertisement

Similar News