చంద్ర‌బాబు మొద‌లుపెట్టిన గేమ్‌ని ప‌వ‌న్ ముగిస్తారా..?

పంతంతో పవన్ కూడా రాజోలు, రాజానాగరం నియోజకవర్గాల్లో జనసేన పోటీచేస్తుందని ప్రకటించారు. దాంతో జనసేన నేతల్లో జోష్ పెరిగితే టీడీపీ నేతల్లో టెన్షన్ పెరిగిపోతోంది.

Advertisement
Update: 2024-01-28 04:35 GMT

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటనతో తమ్ముళ్ళల్లో టెన్షన్ పెరిగిపోతోంది. చంద్రబాబునాయుడు, పవన్ ఎవరికి వారుగా తమిష్టంవచ్చినట్లు నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించుకుంటున్నారు. టీడీపీ-జనసేన పొత్తులో ఉన్నప్పటికీ అధినేతల తీరు ఎవరికి వారే ఎమునా తీరే అన్నట్లుగా తయారైంది. చంద్రబాబు మండపేట, అరకు నియోజకవర్గాలకు ఏకపక్షంగా అభ్యర్థులను ప్రకటించారన్న పంతంతో పవన్ కూడా రాజోలు, రాజానాగరం నియోజకవర్గాల్లో జనసేన పోటీచేస్తుందని ప్రకటించారు. దాంతో జనసేన నేతల్లో జోష్ పెరిగితే టీడీపీ నేతల్లో టెన్షన్ పెరిగిపోతోంది.

పవన్ అలా ప్రకటనచేశారో లేదో వెంటనే టీడీపీ రాజోలు, రాజానగరం నియోజకవర్గాల నేతలంతా అమరావతికి చేరుకున్నారు. రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడుతో సమావేశమయ్యారు. రాబోయే ఎన్నికల్లో తమ పరిస్థితిపై క్లారిటీ ఇవ్వాలని పెద్ద గొడవే చేశారు. భవిష్యత్తు గురించి పాపం అచ్చెన్నను అడిగితే ఆయనేమి చెబుతారు..? పార్టీలో ఆయన మాటకే దిక్కులేదనే ప్రచారం పార్టీలోనే పెరిగిపోతోంది. పార్టీలో జరిగే పరిణామాల్లో చాలావాటికి అచ్చెన్నకు సంబంధమే ఉండటంలేదు.

రాజోలు ఇన్చార్జి, మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు, రాజానగరం నియోజకవర్గం ఇన్చార్జి బొడ్డు వెంకటరమణచౌదరి తమ మద్దతుదారులతో పార్టీ ఆఫీసుకు చేరుకుని అచ్చెన్నను నిలదీశారు. ఇంతకాలం తాము పార్టీ కోసం పనిచేస్తే చివరి నిమిషంలో నియోజకవర్గాల్లో జనసేన పోటీచేయటం ఏమిటని నిలదీశారు. తమ నియోజకవర్గాలను ఎట్టి పరిస్థితిలోనూ జనసేనకు కేటాయించేందుకు లేదని వీళ్ళు గట్టిగా చెప్పారు. పవన్ చేసిన ప్రకటనను వెంటనే విత్ డ్రా అయ్యేట్లు చూడాలని అచ్చెన్నకు తమ్ముళ్ళు అల్టిమేటం ఇవ్వటమే హైలైట్.

పార్టీ ఆఫీసులో వీళ్ళకి ఏమీ సమాధానం చెప్పలేక, వాళ్ళని సముదాయించలేక ఇదే సమయంలో వీళ్ళకు ఎలాంటి హామీ ఇవ్వలేక అచ్చెన్న పార్టీ ఆఫీసునుండి బయటకు వెళ్ళిపోయారు. దాంతో తమ్ముళ్ళల్లో అసహనం మరింతగా పెరిగిపోయింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. జస్ట్ పవన్ ఇచ్చిన జర్కుకే టీడీపీలో ఇంత గందరగోళం మొదలైంది. అలాంటిది రేపు మరో నాలుగు నియోజకవర్గాలను పవన్ ప్రకటిస్తే ఏమవుతుందో ఎవరికి వాళ్ళుగా ఊహించుకోవాల్సిందే. మొత్తానికి గేమ్ చంద్రబాబు మొదలుపెడితే పవన్ ముగించేట్లున్నారు. చివరకు గేమ్ ఎలా ముగుస్తుందో చూడాలి.

Tags:    
Advertisement

Similar News