ప్రజలు జగన్‌ని ఎందుకు వద్దనుకుంటారు?.. - మీడియాను ప్రశ్నించిన మంత్రి బొత్స

చిత్తశుద్ధితో ఇవన్నీ చేస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ప్రజలు ఎందుకు వద్దనుకుంటారని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు హయాంలో చేసిన మోసాలను, ప్రజలను ఇబ్బందులు పెట్టిన తీరును జనం మరిచిపోలేదని తెలిపారు.

Advertisement
Update: 2024-01-25 08:40 GMT

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రజలు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఎందుకు వద్దనుకుంటారని మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాను ప్రశ్నించారు. శ్రీకాకుళంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా రానున్న ఎన్నికల్లో ప్రతిపక్షాలన్నీ ఏకమై జగన్‌ ప్రభుత్వంపై దండయాత్ర చేస్తున్నాయని, వచ్చే ఎన్నికల్లో ప్రజలు మిమ్మల్ని ఆదరిస్తారని అనుకుంటున్నారా అంటూ మీడియా ప్రశ్నించగా ఆయన పైవిధంగా స్పందించారు. రాష్ట్రంలోని 5 కోట్ల మంది ప్రజల్లో అర్హులైనవారందరికీ నవరత్నాల పథకాలు అమలు చేసి వారి జీవన ప్రమాణాలు పెంచినందుకు జగన్‌ని వద్దనుకుంటారా అని బొత్స నిలదీశారు. ప్రజల ఆరోగ్య పరిస్థితిని మెరుగుపరిచినందుకా? ఉత్తమ విద్యావిధానాన్ని రూపొందించి వారి పిల్లల‌ను చదివించినందుకా? ప్రజలకు కార్పొరేట్‌ వైద్యాన్ని ఉచితంగా అందిస్తున్నందుకా? రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తున్నందుకా? వారికి ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇచ్చి ఆదుకుంటున్నందుకా? అంటూ మంత్రి బొత్స ప్రశ్నించారు.

చిత్తశుద్ధితో ఇవన్నీ చేస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ప్రజలు ఎందుకు వద్దనుకుంటారని ఆయన ప్రశ్నించారు. ప్రజలు వీటన్నింటినీ మరిచిపోరని ఆయన చెప్పారు. చంద్రబాబు హయాంలో చేసిన మోసాలను, ప్రజలను ఇబ్బందులు పెట్టిన తీరును జనం మరిచిపోలేదని తెలిపారు. యావత్‌ భారతదేశం ఆంధ్రాలో అమలు చేస్తున్న పథకాలను ఆసక్తిగా గమనిస్తున్నాయని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. నాణ్యమైన, చిత్తశుద్ధితో కూడిన పాలన అందిస్తున్నాం కాబట్టే దేశమంతా తమను గుర్తిస్తోందని తెలిపారు.

షర్మిల ప్రచారం చూస్తే.. జాలేస్తోంది

కాంగ్రెస్‌ పార్టీలో చేరి రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్న షర్మిల విషయంపై మీడియా ప్రశ్నించగా, షర్మిల మాటలు చూస్తే జాలేస్తోందని బొత్స అన్నారు. చంద్రబాబు ఇప్పటికే చెబుతున్న మాటలే ఆమె కూడా చెబుతున్నారని ఆయన చెప్పారు. ప్రత్యేక హోదా విషయంలో ప్యాకేజీకి ప్రాధాన్యత ఇచ్చి హోదాను తాకట్టు పెట్టింది చంద్రబాబు కాదా అని ఆయన ప్రశ్నించారు. కేంద్రానికి సాగిలపడుతున్నారనే ఆరోపణలపై స్పందిస్తూ.. అంశాల వారీగా కేంద్రం నుంచి నిధులు తెచ్చుకునేందుకు ప్రయత్నించడం సహజమేనని, అది అన్ని రాష్ట్రాలూ చేసేదేనని చెప్పారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కూడా మోడీని కలిశారని, ఆయన కాంగ్రెస్‌ ముఖ్యమంత్రే కదా అని ప్రశ్నించారు. అమరావతి రాజధాని అనేది టీడీపీ విధానమని, మూడు రాజధానులు అనేది తమ విధానమని ఆయన స్పష్టం చేశారు.

Tags:    
Advertisement

Similar News