పవన్ యాక్షన్ ప్లానేంటి..?

ఇక్కడ గమనించాల్సిందేమంటే.. మీడియా సమావేశం మొత్తం మీద ఒక్కసారి కూడా రాష్ట్రంలోని బీజేపీ నేతల సహకారం తనకు ఉంటుందని పొరపాటున కూడా చెప్పలేదు.

Advertisement
Update: 2022-10-18 06:50 GMT

మంగళగిరి పార్టీ ఆఫీసులో జరిగిన మీడియా సమావేశంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఒక విషయాన్ని స్పష్టంచేశారు. అదేమిటయ్యా అంటే.. రాష్ట్రంలో తనకు ఏ అవసరం వచ్చినా ఢిల్లీలోని బీజేపీ పెద్దల సహకారం తీసుకునేదిలేదని. ప్రతి విషయానికి నరేంద్రమోడీ, అమిత్ షా ను అమ్మా, అప్పా అంటూ బతిమలాడేదిలేదన్నారు. 'ఇది నా రాష్ట్రం, నా నేల.. వైసీపీ వాళ్ళతో నేనే తేల్చుకుంటాను' అని స్పష్టంగా ప్రకటించారు.

ఇక్కడ గమనించాల్సిందేమంటే.. మీడియా సమావేశం మొత్తం మీద ఒక్కసారి కూడా రాష్ట్రంలోని బీజేపీ నేతల సహకారం తనకు ఉంటుందని పొరపాటున కూడా చెప్పలేదు. మిత్రపక్షమే అయినప్పటికీ ఏ విషయంలో కూడా బీజేపీని కలుపుకుని వెళ్ళే ఉద్దేశ్యంలో పవన్ లేరని అర్థ‌మైపోతోంది. ఐక్య ఉద్యమాలు చేస్తామని బీజేపీ చీఫ్ సోము వీర్రాజు చేసిన ప్రకటనను కూడా పవన్ పట్టించుకున్నట్లు లేదు. రాష్ట్రంలోని బీజేపీ నేతలతో మాట్లాడేందుకు పవన్ ఇష్టపడటంలేదు. ఈ విషయాన్ని స్వయంగా పవనే ఒకసారి చెప్పారు. తనకు బీజేపీతో ఏదైనా అవసరమైతే ఢిల్లీ పెద్దలతోనే మాట్లాడుతానన్నారు.

అయితే సమస్య ఎక్కడ వచ్చిందంటే.. పవనేమో లోకల్ లీడర్లతో మాట్లాడటానికి ఇష్టపడటంలేదు. ఇదే సమయంలో ఢిల్లీలోని అగ్రనేతలు పవన్ను కలవటానికి అపాయిట్మెంట్లు ఇవ్వటంలేదు. పవన్ ఎప్పుడు ఢిల్లీకి వెళ్ళినా ఏపీ ఇన్‌చార్జి సునీల్ ధియోథర్ తో మాత్రమే మాట్లాడి వచ్చేస్తున్నారు. గడచిన మూడున్నరేళ్ళుగా మోడీ, షాల అపాయిట్మెంట్ కోసం పవన్ ఎంత ప్రయత్నించినా సాధ్యం కావటంలేదు. బహుశా ఈ విషయంపైన పవన్లో బాగా మంటుందేమో. ఇందులో భాగమేనేమో తాజా ప్రకటన.

సరే, ఢిల్లీ పెద్దల సాయం తీసుకోక, రాష్ట్రంలో నేతలను పట్టించుకోక మరి ప్రభుత్వంపై పోరాటంలో ఎవరి మద్దతు తీసుకుంటారు..? చంద్రబాబునాయుడు మద్దతు తీసుకోవటంలో పవన్ రెడీగా ఉన్నారా ? బీజేపీతో మిత్రపక్షంగా ఉంటూ దాని ప్రత్యర్ధి టీడీపీ మద్దతు తీసుకోవటం సాధ్యమేనా..? బీజేపీ చూస్తూ ఊరుకుంటుందా..? మొత్తానికి పవన్లో పెరిగిపోతున్న గందరగోళానికి ఇది నిదర్శనమా అన్న అనుమానాలు పెరిగిపోతున్నాయి. మరి ప్రభుత్వంపై పోరాటంలో పవన్ ఏమి చేయబోతున్నారు..? అసలు పోరాటం చేసేది వాస్తవమేనా అన్నది ఆసక్తిగా మారింది.

Tags:    
Advertisement

Similar News