కెమెరా కోసం చంపేశారు..!

ఓ యువ ఫొటోగ్రాఫర్‌ వద్ద ఉన్న రూ.10 లక్షల విలువైన కెమెరా కోసం అతన్ని ఏకంగా హతమార్చి పూడ్చిపెట్టిన ఘటన కోనసీమ జిల్లా రావులపాలెంలో జరిగింది.

Advertisement
Update: 2024-03-03 13:19 GMT

ఓ యువ ఫొటోగ్రాఫర్‌ వద్ద ఉన్న రూ.10 లక్షల విలువైన కెమెరా కోసం అతన్ని ఏకంగా హతమార్చి పూడ్చిపెట్టిన ఘటన కోనసీమ జిల్లా రావులపాలెంలో జరిగింది. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటనకు సంబంధించి విశాఖపట్నంలోని పీఎం పాలెం పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. విశాఖపట్నంలోని మధురవాడ బక్కన్నపాలెం ప్రాంతానికి చెందిన పోతిన సాయికుమార్‌ (23) పెళ్లి వేడుకలకు ఫొటోలు, వీడియోలు చిత్రీకరణ చేస్తుంటాడు. ఆన్‌లైన్‌ ద్వారా బుకింగ్‌లు తీసుకొని దూర ప్రాంతాలకు కూడా ఈవెంట్లకు వెళ్తుంటాడు. పది రోజుల క్రితం రావులపాలెం ప్రాంతానికి చెందిన ఇద్దరు యువకులు పది రోజుల ఫొటోషూట్‌ ఉందని చెప్పి ఫిబ్రవరి 26న సాయికుమార్‌ను పిలిచారు. దీంతో తన వద్దనున్న సుమారు రూ.15 లక్షల విలువైన కెమెరా సామగ్రితో అతను బయలుదేరి వెళ్లాడు. వెళ్లే ముందు పెళ్లి వేడుకలో ఫొటోల చిత్రీకరణకు రావులపాలెం వెళ్తున్నట్లు తల్లిదండ్రులకు చెప్పాడు.

వచ్చిన రోజే హతమార్చి...

సాయికుమార్‌ను వచ్చిన రోజునే నిందితులు హతమార్చారు. విశాఖ నుంచి రైలులో రాజమండ్రికి వచ్చిన సాయికుమార్‌ను తొలుత కారులో వచ్చిన ఇద్దరు యువకులు తీసుకెళ్లారు. రావులపాలెం సమీపంలో అతన్ని హతమార్చి.. మృతదేహాన్ని ఆలమూరు సమీపంలో పూడ్చిపెట్టారు. అనంతరం కెమెరా, సామగ్రిని తీసుకుని పరారయ్యారు. మూడు రోజులుగా కుమారుడి ఆచూకీ తెలియకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు.

పట్టుబడిందిలా...

మృతుడి ఫోన్‌ కాల్‌ డేటా ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టగా నిందితుల గుట్టు బయటపడింది. నిందితుల్లో ఒకరైన షణ్ముఖతేజను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆలమూరు వద్ద ఫొటో గ్రాఫర్ సాయికుమార్ మృతదేహాన్ని గుర్తించి వెలికి తీశారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టంకి తరలించారు. ఈ ఘటనపై విశాఖపట్నం పోలీస్‌ కమిషనర్‌ రవిశంకర్‌ స్పందిస్తూ.. రూ.10 లక్షల విలువైన కెమెరా కోసమే అతన్ని హత్యచేశారని తెలిపారు. నిందితులిద్దరినీ అరెస్టు చేశామని ఆయన చెప్పారు.

Tags:    
Advertisement

Similar News